గవర్నర్‌ను కలసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. చిత్రంలో పార్టీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, బుగ్గన తదితరులు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన సుమారు 59,18,000 దొంగ ఓట్లను తొలగించాలని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై అభిప్రాయ సేకరణ నెపంతో టీడీపీ సర్కారు పలు సర్వేలు నిర్వ హిస్తూ వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో దొంగ ఓట్ల నమోదు, విపక్ష మద్దతుదారుల ఓట్ల తొల గింపు, పోలీస్ వ్యవస్థను టీడీపీ సర్కారు స్వప్ర యోజనాల కోసం వాడుకుంటున్న తీరుపై శనివారం ఆయన రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను కలసి ఫిర్యాదు చేశారు. ఈమేరకు పార్టీ ప్రతినిధివర్గంతో కలసి గంటన్నరకు పైగా గవర్నర్‌తో సమావేశమైన ప్రతిపక్ష నేత పలు అంశాలను ఆయన దృష్టికి తెచ్చారు. పార్టీ ముఖ్య నేతలు ధర్మాన ప్రసాదరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు తిప్పేస్వామి, అనిల్‌కుమార్ యాదవ్, ‘ఓటర్ అనలిటిక్స్ అండ్ స్ట్రాటజీ’ ప్రతినిధి తుమ్మల లోకేష్ తదితరులు గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. అనంతరం రాజ్‌భవన్ వద్ద వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు.
దొంగ సర్వేలతో అధికార యంత్రాగాన్ని వాడుకుంటున్నారు..
‘మేం ఇటీవల ఢిల్లీకి వెళ్లి రాష్ట్రంలో దొంగ ఓట్ల వ్యవహారం గురించి కేంద్ర ఎన్నికల కమిషన్‌కు వివరించాం. ఈసీకి చెప్పిన అంశాలను ఈరోజు గవర్నర్‌కు కూడా నివేదించాం. ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ దాదాపుగా 59.18 లక్షల దొంగ ఓట్లున్నాయి. కచ్చితంగా వాటిని తొలగించాల్సిన అవసరం ఉందని గవర్నర్‌కు తెలియజేశాం. అంతేకాకుండా టీడీపీ దొంగ సర్వేలతో ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుంటోంది. ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునే నెపంతో.. ప్రజా సాధికార సర్వే, రియల్‌టైం గవర్నెన్స్, పరిష్కార వేదిక అంటూ విడతలవారీగా పదే పదే సర్వేలు నిర్వహించారు. తమ ప్రభుత్వంపై ప్రజలకు ఏ మేరకు సంతృప్తి ఉందో తెలుసుకునే పేరుతో ఈ సర్వేలు చేసి వాటి ఆధారంగా టీడీపీకి ఓటు వేయని వారిని గుర్తించి జాబితా నుంచి తొలగించడాన్ని గవర్నర్ దృష్టికి తెచ్చాం. ఎన్నికల కమిషన్‌కు కూడా ఇవే విషయాలను చెప్పాం. టీడీపీ సర్కారు సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రంలో పోలీసులను ఎంత దారుణంగా ఉపయోగించుకుంటోందో కూడా తెలియజేశాం. పోలీసు వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించి తన స్వార్థం, రాజకీయ అవసరాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోలీసు వ్యవస్థను వాడుకోవడాన్ని గవర్నర్ దృష్టికి తెచ్చాం’ అని జగన్ తెలిపారు.
హోదా కోసం బాబు దీక్ష.. దయ్యాలు వేదాలు వల్లించడమే
ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో తాను చేస్తున్న ధర్మ పోరాట దీక్షకు అందరూ కలిసి రావాలంటూ సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనపై స్పందించాలని మీడియా ప్రతినిధులు కోరగా వైఎస్ జగన్ బదులిస్తూ... ‘ప్రత్యేక హోదా వస్తే ఏమొస్తుంది? అని వ్యాఖ్యానించిన సీఎం చంద్రబాబు ఇప్పుడు ఢిల్లీలో దీక్ష చేస్తాననడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. చంద్రబాబు దీక్షకు దిగడం ఎలా ఉంటుందంటే.. ఓ వ్యక్తిని తానే పొడిచి చంపి, అనంతరం ఆ హత్యకు వ్యతిరేకంగా ఎవరైనా దీక్ష చేస్తే ఎలా ఉంటుందో చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం పోరాడతాననటం కూడా అలాగే ఉంటుంది. అసలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి ప్రధాన కారణం ఎక్కడైనా, ఏదైనా ఉందీ అనంటే అది చంద్రబాబే. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడమే మన ఖర్మ. ప్రత్యేక హోదాను నీరుగారుస్తూ ఆయన అసెంబ్లీలోనే ఏ రకంగా మాట్లాడారో ఆ మాటలను ఎవరూ ఇంకా మర్చిపోలేదు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయి? అని చంద్రబాబు అసెంబ్లీలో వేసిన ప్రశ్నలు కూడా ఇంకా అందరి చెవుల్లో మోగుతూనే ఉన్నాయి. ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా....? అంటూ చంద్రబాబు ప్రతిపక్షంపై విరుచుకుపడుతూ తిడుతూ మాట్లాడారు.
ఆయన ప్రత్యేక ప్యాకేజీ కోసం ఏరకంగా లాబీయింగ్ చేసిందీ అందరికీ తెలుసు. ప్రత్యేక ప్యాకేజీ వల్ల చాలా మేలు జరుగుతుందని తాను, తన మంత్రులు మాట్లాడారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తున్నపుడు ఆయన పక్కనే కూర్చుని చంద్రబాబు, మంత్రులు, ఎంపీలు మాట్లాడిన మాటలు కూడా మనందరికీ తెలుసు. ఆ తరువాత చంద్రబాబు అసెంబ్లీలో జైట్లీని, బీజేపీ ప్రభుత్వాన్ని పొగుడుతూ ధన్యవాదాలు తెలియచేస్తూ తీర్మానాలు కూడా చేశారు. ఆ తరువాత 2017 జనవరి 27వ తేదీన చంద్రబాబు విలేకరుల సమావేశం నిర్వహించి మరీ ఏపీకి బీజేపీ చేసినట్లుగా ఏ రాష్ట్రానికైనా చేసిందా? ఎక్కడైనా ఇంత మేలు జరిగిందా? మీకు ఛాలెంజ్ విసురుతున్నా. చెప్పండి అంటూ బాబు స్వయంగా బీజేపీ ప్రభుత్వాన్ని భుజాన మోసిన పరిస్థితులన్నీ కూడా ప్రజలు గమనించారు.
నాలుగు సంవత్సరాలకు పైగా బీజేపీతో సంసారం చేస్తున్నపుడు చంద్రబాబు అసలు ప్రత్యేక హోదా కావాలని కేంద్రాన్ని అడగనే లేదు. ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించ లేదు సరికదా దాన్ని ఖూనీ చేశారు. టీడీపీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు నాలుగు సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వంలో కూడా పని చేశారు. అప్పుడు హోదా గురించి అడగని వ్యక్తి నాలుగేళ్ల తరువాత యూటర్న్ తీసుకుని ఈరోజు నల్ల చొక్కాలు వేసుకుని ప్రత్యేక హోదా కోసం ధర్మపోరాట దీక్ష చేస్తాననడాన్ని చూస్తుంటే నిజంగా దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని చెప్పడానికి ఇంతకన్నా వేరే ఉదాహరణ కూడా అవసరం లేదు’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment