రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలసి వినతి పత్రం అందిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, చిత్రంలో ఏపీ ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అస్థిరపరుస్తూ దొంగ ఓట్లు, అధికార దుర్వినియోగంతో ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. పార్టీ నేతలతో కలసి శనివారం ఆయన రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ఆ వివరాలు ఇవీ..
1 ఈ వ్యవహారంపై ఇప్పటికే ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను కలిసి వివరించాం. ఎన్నికల ప్రక్రియను టీడీపీ ప్రభుత్వం ఎలా చిన్నచూపు చూస్తోందో, ఎలా అక్రమాలకు పాల్పడుతుందో, అపహాస్యం పాలు చేస్తోందో తెలియజేశాం. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాల్సిందిగా ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను కోరాం. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో ప్రజాస్వామ్యయుతంగా, న్యాయబద్ధంగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశాం. ఎన్నికల జాబితాలో అవకతవకలు సహా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక, అనైతిక విధానాలు, అధికార దుర్వినియోగం, ప్రతిపక్షాన్ని బెదిరించేలా పోలీసు అధికారులను పక్షపాత బుద్ధితో వినియోగించడం, విపక్షమే లక్ష్యంగా ట్యాబ్‌లతో వివరాలు సేకరించి ఓట్లను తొలగిస్తుండటాన్ని ప్రధాన ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకొచ్చాం.
2 రాష్ట్రంలో 2018 సెప్టెంబర్ నాటికి నమోదైన 52.67 లక్షల నకిలీ ఓట్లను గుర్తించి వాటిపై దృష్టి సారించాలని పలుమార్లు సీఈసీ దృష్టికి తెచ్చాం.
3 ప్రస్తుతం ఈ దొంగ ఓట్లు దాదాపు 59.18 లక్షలకు చేరాయి. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వీటిని వాడుకోవాలనేది వీటి నమోదు వెనక ఉన్న దురుద్దేశం.
4 ఆంధ్రప్రదేశ్‌లోని 3.69 కోట్ల ఓట్లలో దాదాపు 60 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయి. వీటి ప్రభావం ఎన్నికల ప్రక్రియపై చాలా దారుణంగా ఉంటుంది.
5 ఈ పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితా నుంచి ఈ తరహా డూప్లికేట్, చెల్లుబాటు కాని (ఇన్‌వాలిడ్), దొంగ ఓట్లను తొలగించాలని కోరుతున్నాం. ఈ తరహా ఓట్లు కలిగి ఉన్న వారిలో ఎక్కువ మంది ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు రెండింటిలో ఉంటున్నందున ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఒకే రోజు ఎన్నికలు నిర్వహించే విషయాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
6 వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను గుర్తించి ఒక పద్ధతి ప్రకారం తొలగిస్తున్నారు.
7 ప్రజా సాధికార సర్వే, రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ (ఆర్‌టీజీఎస్) డేటాబేస్, పరిష్కార వేదిక– ఫిర్యాదుల సేకరణ, పీరియాడిక్ సర్వేల పేరుతో అక్రమంగా సమాచారాన్ని సేకరించి అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారు. ఓటర్లను బెదిరించేందుకు, ఒత్తిడి చేసేందుకు, ప్రభావితం చేసేందుకు ఈ వ్యవస్థలను ఉపయోగిస్తూ తమ మాట వినని ఓటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగిస్తున్నారు.
8 ఇటీవల ఒక యాప్ ద్వారా సర్వీస్ డెలివరీ పేరిట సర్వే నిర్వహించి ఓటర్ల ఆంతర్యాన్ని గుర్తిస్తూ వైఎస్సార్ సీపీ సానుభూతిపరులను జాబితా నుంచి
తొలగిస్తున్నారు.
9 అర్హుడైన ఒక్క ఓటరునైనా జాబితా నుంచి తొలగిస్తే అది ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. అధికారిక ఓటరు జాబితాను టీడీపీ తన వెబ్‌సైట్‌లో ఫోటోలతో సహా ప్రచురించింది. వివిధ రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ అందజేసిన ఓటర్ల జాబితాలో ఫోటోలు లేవు. ఓటర్ల వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘిస్తూ టీడీపీ దారుణంగా అనైతిక చర్యలకు పాల్పడుతోంది.
10 టీడీపీ తన నాలుగేళ్ల 8 నెలల పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో అవినీతిని వ్యవస్థీకృతం చేసింది. అక్రమ మార్గాల ద్వారా సంపాదించిన అవినీతి సొమ్ములో రూ.4 వేల కోట్ల నుంచి రూ.5 వేల కోట్ల దాకా రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన వ్యక్తుల వద్ద (వీరిలో కొందరు పోలీసు అధికారులు కూడా ఉన్నారు) ఎన్నికల సమయంలో పంపిణీ చేసేందుకు ఇప్పటికే సిద్ధంగా ఉంచింది.
11 టీడీపీకి గట్టి మద్దతుదారులుగా ఉన్న ఓ సామాజికవర్గం పోలీసు అధికారులకు అడ్డదారిలో డీఎస్సీలుగా ప్రమోషన్లు ఇచ్చి కీలక స్థానాల్లో పోస్టింగులు ఇచ్చారు. తటస్థులు, నిష్పాక్షికంగా వ్యవహరించే ఇతర సామాజిక వర్గాలకు చెందిన అధికారులను కీలక, ముఖ్యమైన పదవుల్లో నియమించేందుకు నిరాకరించారు. నిజాయితీ పరులైన పోలీసు అధికారులను టీడీపీ ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నా, దుర్భాషలాడుతున్నా వారిపై సర్కారు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు.
12 టీడీపీ ప్రభుత్వం తమకు అనుకూలురైన ఎస్పీలు, డీఎస్పీలను ఎంపిక చేసి అనుచిత కార్యక్రమాలకు వినియోగిస్తోంది. ప్రముఖ రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేయించడం లాంటి అనైతిక చర్యలను వారితో చేయిస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై తమకు అనుకూలురైన అధికారులతో ఆరా తీయించడం, ప్రతిపక్షంలో ఉన్న వారిపై అక్రమ కేసులను బనాయించి వేధించడం లాంటి పనులకు ఉపయోగిస్తున్నారు.
13 డీజీపీ ఠాకూర్ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. నిఘా చీఫ్ కూడా అదే మాదిరిగా ప్రవరిస్తున్నారు. ఎన్నికల ప్రయోజనాల కోసం లా అండ్ ఆర్డర్ (కో ఆర్డినేషన్) పేరుతో కొత్త పోస్టును ప్రభుత్వం సృష్టించింది.
14 రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా, నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలంటే డీజీపీ ఠాకూర్, ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు, లా అండ్ ఆర్డర్–కో ఆర్డినేషన్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాసరావులను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని వైఎస్సార్ సీపీ ప్రతినిధి బృందం తరపున కోరుతున్నాం.
Comments
Please login to add a commentAdd a comment