సాక్షి, పశ్చిమ గోదావరి: గత ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా.. మోసపూరితమైన మ్యానిఫెస్టో పేరుతో మరోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. గత ఎన్నికల సమయంలో 54 పేజీలతో కూడా ఎన్నికల ప్రణాళికను చంద్రబాబు నాయుడు విడుదల చేశారని.. కానీ అధికారంలోకి వచ్చాక అవేవీ కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. ప్రజలకిచ్చిన వాగ్ధానాలను నెరవేర్చకుండా ఈసారి అబద్ధాలతో కూడిన 34 పేజీల మ్యానిఫెస్టో రూపొందించారని ఆయన అన్నారు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పినట్లు రైతుల రుణమాఫీ, డ్వాక్రా రుణాల రద్దు, మద్యపాన నిషేదం, పంటలకు గిట్టుబాటు ధర వంటి అనేక హామీలను విస్మరించారని గుర్తుచేశారు. చంద్రబాబు నాయుడి ఐదేళ్ల పాలనపై చర్చ జరగకుండా రోజుకో అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి కుట్ర చేస్తున్నారని, ఆయన పాలనపై చర్చ జరిగితే టీడీపీకి కనీసం డిపాజిట్లు కూడా రావని స్పష్టం చేశారు.
తమ ప్రభుత్వం ఏర్పడిన తరువాత పేదలకు ఏవిధంగా మేలు జరుగుతుందో.. తమ పార్టీ మ్యానిఫెస్టోలో వివరించామని వైఎస్ జగన్ తెలిపారు. టీడీపీలా తమది పేజీలకొద్ది అబద్ధాల పుస్తకం కాదని..కేవలం రెండే పేజీల రూపంలో ప్రజలకు అర్థమైయ్యే విధంగా వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రణాళికను రూపొందించినట్లు వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా కోరుకొండలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజానగరం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జక్కంపూడి రాజా, రాజమండ్రి లోక్‌సభ అభ్యర్థి మార్గని భరత్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గోదావరి నది పక్కనే ఉన్నా ఈ ప్రాంత ప్రజలకు తాగు, సాగు నీరు దొరకడం లేదని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘పాదయాత్రలో ఈ జిల్లాలోని ప్రజలు పడుతున్న కష్టాలన్నీ నేను దగ్గర నుంచి చూశాను. ప్రభుత్వ సహాయం అందక, సంక్షేమ పథకాలు అమలుకాక ఎంతో మంది పేదలు కష్టాలు పడుతున్నారు. వారందరికీ నేను ఉన్నానని హామీ ఇస్తున్నాను.
రైతులకు గిట్టుబాటు ధర ఉండదు. రుణమాఫీ కూడా కాలేదు. దీంతో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయి. 2017 నాటికే పోలవరం పూర్తి చేస్తామన్నారు. కానీ ఇప్పటికీ పునాదులు దాటలేదు. ప్రాజెక్టుల పేరుతో దోచుకోవాలనే ఆరాటంతో అంచనాల వ్యయ్యాన్ని ఇష్టం వచ్చినట్టు పెంచారు. ఇదే జిల్లాకు చెందిన మంత్రి యనమల రామకృష్ణుడి వియ్యంకుడు సబ్ కాంట్రక్టర్‌గా దోచుకుంటున్నారు. పురుషోత్తంపట్నం కూడా ఇదే పరిస్థితి ఉంది. గతంలో కడియం స్కీం ద్వారా దివంగత వైఎస్సార్ 48 గ్రామాలకు నీరు అందించారు. చంద్రబాబుకు అది కూడా చేతకావడంలేదు. అనేక ప్రాంతాల్లో ఇసుక ర్యాంపులను ఏర్పాటు చేసి ఇసుకను అక్రమంగా దోచుకుంటున్నారు.
అధికార పార్టీకి చెందిన నేతలు వంద కోట్లకు పైగా దొచుకున్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన 650 వాగ్ధానాలను అమలు చేయకుండా మోసం చేసిన వ్యక్తి మరోసారి సీఎంగా మనకు అవసరమా?. ఎన్నికల సమీపిస్తున్న వేళ డబ్బుల మూటలు పంచుకుని గ్రామాల్లోకి వస్తున్నారు. చంద్రబాబు ఇచ్చే మూడువేలు తీసుకుని మోసపోవద్దు. వచ్చేది మన ప్రభుత్వమే. అందరినీ ఆదుకుంటాం. డ్వాక్రా రుణాల పూర్తిగా మాఫీచేసి.. సున్నా వడ్డీకే రుణాలు అందిస్తాం. రైతుల పెట్టుబడికి మేలో రూ.1250 ఇస్తాం. ఆర్థికంగా వెనుకబడిన ప్రతి పేదవాడిని ఉచితంగా చదవిస్తాం. నవరత్నాలు ద్వారా ప్రతి పేదవాడి బతుకులు మారతాయి. మళ్లీ రాజన్న రాజ్యం వస్తుంది’’ అని అన్నారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment