జగన్‌ అన్నా నువ్వొస్తే తొలిసంతకం దానిమీదే పెట్టాలి? | ys Jagan mohan reddy interaction with students in yuvabheri | Sakshi
Sakshi News home page

విద్యార్థులతో వైఎస్‌ జగన్‌ ముఖాముఖి

Published Tue, Oct 10 2017 2:49 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

ys Jagan mohan reddy interaction with students in yuvabheri - Sakshi

సాక్షి, అనంతపురం : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై పలువురు విద్యార్థులు, మేథావులు ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా విషయంలో తమను ఎలా మోసం చేశారో, తమలో ఎన్ని అనుమానాలు ఉన్నాయో ఆగ్రహ రూపంలో వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అనంతపురం జిల్లా కేంద్రంలోని ఎంవైఆర్‌ ఫంక్షన్‌ హాల్‌ ఏపీకి ప్రత్యేక హోదా కోసం నిర్వహించిన 'యువభేరి' సదస్సు నిర్వహించింది. ఈ సదస్సులో భాగంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాన ప్రసంగం చేశారు.

అనంతరం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు చంద్రబాబు పరిపాలన తీరుపై, చేస్తున్న మోసాలపై నిప్పులు చెరిగారు. తాము ఇక చంద్రబాబును ముఖ్యమంత్రిగా భరించలేమని, ఎట్టి పరిస్థితుల్లో 2019 ఎన్నికల్లో చంద్రబాబును ఓడిస్తామని, ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ను ఆహ్వానించి తమ కలలను నెరవేర్చుకుంటామని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం ముమ్మాటికీ వైఎస్‌ జగన్‌ వెంట నడుస్తామని, ఏ శక్తి తమను ఆపలేదని ధీమా వ్యక్తం చేశారు. ప్రశ్నలు, సందేహాల రూపంలో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితో విద్యార్థుల ముఖాముఖి కార్యక్రమం ఎలా జరిగిందంటే..

అంజు, ఎస్‌ఆర్‌ఐటీ ఇంజినీరింగ్‌ కాలేజీ : ప్రజాస్వామ్య దేశం మనది మన నేతలను మనం ఎన్నుకుంటాం. వారిపై నమ్మకంతో ఉంటాం. ఒకసారి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎలా మర్చిపోతారు? ప్రత్యేక హోదా 15ఏళ్లపాటు కావాలని అడిగిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా మర్చిపోయారు? ప్రభుత్వాన్ని వెనక్కి పిలిచే అవకాశం ఉందా అన్న? తప్పుడు హామీలు ఇచ్చిన వారిని వెనక్కి పిలిచే అవకాశం ఉండాలి? మీలాంటి యంగ్‌ డైనమిక్‌ లీడర్‌ ఉంటే మమ్మల్ని ఎవరూ ఆపలేరు ప్రత్యేక హోదా సాధించి తీరుతాం.  

వైఎస్‌ జగన్‌ : 'విశ్వసనీయత అంటే ఏమిటో నీ ప్రశ్న చూసిన తర్వాతనైనా చంద్రబాబు తెలుసుకోవాలి. మీకున్న అవగాహన కూడా చంద్రబాబుకు లేదు. ఇలాంటి వారిని దింపాలంటే మళ్లీ ఎన్నికలు రావాల్సిందే. మనకు వేరే ప్రత్యామ్నాయం లేదు'

ప్రియాంక, ఎస్‌ఆర్‌ఐటీ ఇంజినీరింగ్‌ కాలేజీ : ప్రత్యేక హోదా కోసం 10 నుంచి 15 ఏళ్లు అడిగిన చంద్రబాబు ఇప్పుడెందుకు వృధా అన్నారు. అప్పుడు ఈ ఆలోచన ఏమైంది. మనం ఏమన్నా పిచ్చోళ్లమా.. మీరే మాకు న్యాయం చేయాలి.
వైఎస్‌ జగన్‌ : 'కచ్చితంగా మీకు న్యాయం చేస్తాను. ప్రత్యేక హోదా ఉంటేనే పరిశ్రమలు పెడతారు. పరిశ్రమలు చంద్రబాబు, జగన్‌ మొఖం చూసి పెట్టరు. వారికి కలిగే ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని పరిశ్రమలు పెడతారు. ప్రత్యేక హోదా ఉందనే కారణంతో పలువురు ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ నేతలు ఆయా రాష్ట్రాల్లో పరిశ్రమలు పెట్టారు, భూములు కొన్నారు.

విజయ్‌ భాస్కర్‌, ప్రొగ్రెసివ్‌ స్టూడెంట్‌ ఆర్గనైజేషన్‌ : అధికారంలోకి రాకమునుపు చంద్రబాబు ఎన్నో దొంగ హామీలు ఇచ్చారు. కాపులను బీసీలు చేస్తానని అన్నారు, కురుమ, కురుబలను, వాల్మీకిలను ఎస్టీలను చేస్తానని చెప్పారు. 30 ఏళ్ల అనుభవం అని చెప్పిన దొంగబాబు అందరినీ మోసం చేశారు. దివ్యాంగులను మోసం చేశాడు. మాకోసం చంద్రబాబు ఏం చేయలేదు. నీకోసం ప్రాణాలు ఇచ్చయినా ప్రత్యేక హోదా కోసం మీతోపాటు సాగుతాను.
వైఎస్‌ జగన్‌ : 'భాస్కర్‌ చెప్పింది ముమ్మాటికి నిజమే. ప్రతి ఒక్కరినీ మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. మోసం చేయడం తప్పనే విషయం భాస్కర్‌ ప్రశ్నతోనైనా తెలుస్తుందని ఆశిద్దాం

శిరీష, బీఫార్మసీ థర్డ్‌ ఇయర్‌: మహిళలకు రక్షణ ఇస్తామని చెప్పిన చంద్రబాబు తన ప్రభుత్వంలోని ఓ ఎమ్మెల్యే ఓ ప్రభుత్వ ఉద్యోగి అయిన వనజాక్షిని నడిరోడ్డుపై జుట్టుపట్టుకొని కొడితే ఎలాంటి శిక్షను వేయలేదు. స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ కోడలిని చిత్రహింసలు పెడితే ఏం చర్యలు తీసుకోలేదు. కానీ, వైఎస్‌ఆర్‌ హయాంలో ఒకమ్మాయిపై వరంగల్‌ యాసిడ్‌ దాడి చేస్తే కుక్కల్ని కాల్చినట్లే కాల్చేశారు. అలాంటి భద్రత మీరు మాకు ఇవ్వాలి. భద్రత కావాలంటే బాబు రావాలన్నారు. బాబొచ్చాక భద్రత పోయింది.. మీరు వస్తేనే భద్రత వస్తుంది.. మీరు మాకు భద్రతను ఇవ్వాలి.

వైఎస్‌ జగన్‌ : 'నేను వచ్చాక తప్పకుండా మీకు భద్రత ఉండి తీరుతుంది. ముఖ్యమంత్రిగా ఉండి కూడా వనజాక్షిపై మీడియా చూస్తుండగా దాడి జరిగినా చంద్రబాబు చర్చలు తీసుకోలేదు. రిషితేశ్వరిపై జరిగినా చర్యలు లేవు. ఏ ఆడపడుచుకు ఇబ్బంది వచ్చినా ఫోన్‌ కొట్టండి చర్యలు తీసుకుంటానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు కనీసం యాక్షన్‌ తీసుకోని పరిస్థితి ఉంది. త్వరలోనే చంద్రబాబుకు బుద్ధి చెబుదాం.

ప్రీతి, ఇంజినీరింగ్‌ : అరుణ్‌ జైట్లీ ప్రత్యేక హోదావల్ల లాభం లేదన్నప్పుడు బాధపడ్డాను. విద్యార్థులు, నిరుద్యోగులు నష్టం జరుగుతుందని తెలిసి కూడా చంద్రబాబు అర్థరాత్రి ప్యాకేజీని ఎలా స్వాగతించారు?

వైఎస్‌ జగన్‌: వాస్తవానికి ప్యాకేజీ రాకపోయినా వచ్చినట్లు భ్రమలు కల్పిస్తూ చంద్రబాబు ఆరోజు అర్థరాత్రి మీటింగ్‌ పెట్టి చెప్పాడు. ఇప్పుడేమో కేంద్రం చెప్పిన ప్యాకేజీ ఏదీ కూడా ఇవ్వలేదని మరో కొత్త డ్రామా ఆడుతున్నారు. ఆరోజు అవసరానికి ఏం కావాలో అదే చంద్రబాబు మాట్లాడతారు.. అవసరం తీరాక వదిలేస్తారు. మీ ప్రశ్నలు విన్నాకైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకుంటారేమో చూద్దాం.

సంపత్‌, లాస్టూడెంట్‌ : ఒక ఉద్యోగి లంచం తీసుకుంటే వెంటనే చర్యలు తీసుకుంటారు. కానీ గజదొంగ చంద్రబాబు పక్క రాష్ట్రంలో నల్లడబ్బును లంచం ఇచ్చి దొరికినా ఎందుకు చర్యలు తీసుకోలేదు?

వైఎస్‌ జగన్‌ : ఒక ఎమ్మెల్సీని అక్రమంగా కొనేందుకు ప్రయత్నించి నల్లడబ్బును ఇస్తూ ఆడియో టేపులు, వీడియో టేపుల్లో దొరికినా కూడా ఆ మనిషిపై ఏ కేసు లేదు.. యాక్షన్‌ లేదు. నిజంగా చిన్నా చితక ఉద్యోగి అయితే ఈపాటికే సస్పెండ్‌ చేసి జైలుకు పంపేవారు. దేశంలో ఈ ప్రశ్నను ప్రతి పౌరుడు ఆలోచించాలి. ప్రజాస్వామ్యం అనేది అందరికీ సమానంగా ఉంటేనే న్యాయం జరుగుతుంది. నేను కూడా చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలనే బలంగా కోరుతున్నాను.

 రవళి ఎస్‌ఆర్‌ఐటీ : ప్రత్యేక హోదావల్ల మనకు ఇండస్ట్రీలు వచ్చేవి.. కానీ, కోట్లు వృధా చేసి విదేశాలకు చంద్రబాబు ఎందుకు వెళ్తున్నారు? పెట్టుబడులు తీసుకురావడానికా లేక ఇక్కడ దోచుకుంది అక్కడ దాచుకోవడానికా?

వైఎస్‌ జగన్‌ : చంద్రబాబు టూర్‌లు చేస్తేనో లేక జగన్‌ ముఖం చూసో పెట్టుబడులు రావు. ప్రత్యేక హోదాలాంటి వాటి వల్ల వారికి వచ్చే ప్రయోజనాలు చూసి వస్తాయి. వ్యక్తులను చూసి పెట్టుబడులు రావు. ఆ విషయం చంద్రబాబుకు అర్ధం అయ్యే ఉండాలి. చంద్రబాబు ఎక్కడికైనా వెళితే సాధారణంగా వెళ్లరు. ఆయనకు ప్రత్యేక విమానాలు కావాలి.. పైగా కోట్లు వృధా చేస్తారు. ఆ ప్రయత్నమేదో ప్రత్యేక హోదా కోసం చేసినా ఈ పాటికి వచ్చి ఉండేది. ఇక ఆయన పెట్టుబడులు తేవడానికి వెళుతున్నారో దోచుకుంది దాచుకోవడానికి వెళ్తున్నారో ఆయన మనస్సాక్షికే తెలియాలి.

హనీషా, ఎస్‌ఆర్‌ఐటీ : మన రాష్ట్రంలో ఎంతోమంది ఎంతోమంది గొప్ప ఆర్కిటెక్ట్స్‌ను, ఇంజినీర్లు కాదని చంద్రబాబు సింగపూర్‌కు ఎందుకు అవకాశాలు ఇచ్చారు. ఇప్పుడేమో రాజమౌళి అంటున్నారు. ఈ రాజధాని ఉంటుందా సినిమా సెట్టింగుల్లాగానే పోతుందా. నాకు భయం వేస్తుంది.  

వైఎస్‌ జగన్‌ : అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతున్నా చంద్రబాబు ఒక్క ఇటుక పెట్టిన పాపాన పోలేదు. అసెంబ్లీ, సెక్రటేరియల్‌ ఎలా ఉంటుందో తెలియదు ఎప్పుడొస్తుందో తెలియదు. మన కర్మేంటంటే కేంద్రం నుంచి రూ.2వేల 500కోట్లు తీసుకున్నారు. కేంద్రం మరిన్ని నిధులు ఇవ్వాలంటే ఈయన బిల్లులు చూపించాలి. ఈయన బిల్లులు ఇవ్వరు వారు నిధులు ఇవ్వరు. సినిమాలు చూసి సినిమా సెట్లు బాగున్నాయని డైరెక్టర్‌లకు కాంట్రాక్టు ఇచ్చే ముఖ్యమంత్రులను మన జీవితంలో ఎప్పుడూ చూడలేదు. నాకు తెలిసి చివర వరకైనా ఆయన ఏ బిల్డింగ్‌ కట్టడు ఒక సినిమా మాత్రం చూపిస్తాడు

అంజి, విద్యార్థి : ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు వివిధ పేర్లతో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాకుండా చంద్రబాబు చేస్తున్నారు. నాకు ఎంబీఏ చేయాలన్న కోరిక. కానీ, చంద్రబాబు రూ.35 వేలే ఇస్తున్నారు. మా అమ్మ కూలి చేస్తే వచ్చేది రూ.200 మాత్రమే. నేను ఆ కూలి పైసలతో ఎలా చదువుకోవాలి.

వైఎస్‌ జగన్‌ : ఫీజులు చూస్తేనేమో ఏడాదికి ఇంజినీరింగ్‌ రూ.లక్ష, రూ.75 వేలు, రూ.50వేలు, ఇలా ఒక్కో కాలేజీలో ఒక్కో ఫీజు ఉంది. చంద్రబాబు మాత్రం ఇస్తుంది 35వేలు మాత్రమే. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వస్తుందో రాదో అని విద్యార్థులు భయపడుతున్నారు. దేవుడు దయతో మన ప్రభుత్వం వచ్చాక ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడంతోపాటు రూ.20వేలు బోర్డింగ్‌ ఖర్చులు కూడా ఇచ్చుకుందాం.

రేఖ, ఎస్‌ఆర్‌ఐటీ కాలేజ్‌ : ఒక పంట పోతేనే రైతులు ఆగమవుతారు. అలాంటిది వారి భూములు లాక్కుంటున్నారు. వారు ఎలా బతకాలి? అమరావతిలో ఎందుకు అన్ని భూములు లాక్కుంటున్నారు? రియల్‌ ఎస్టేట్‌ చేయాలనుకుంటున్నారా? రాజధాని కట్టాలని అనుకుంటున్నారా?

వైఎస్‌ జగన్‌ : మూడు నుంచి నాలుగు పంటలు పండే భూములను రైతులను బెదిరించి ప్రలోభాలుపెట్టి వేల ఎకరాలు తీసుకోవడం దారుణం. రాజధాని అక్కడ వస్తుంది.. ఇక్కడ వస్తుంది అని చెప్పి చివరకు అందరినీ మోసం చేసి పంటలు పండే ప్రాంతంలో రాజధాని అని ప్లాన్‌ చేశారు. రైతులను దారుణంగా దెబ్బకొట్టారు.

గుర్రప్ప, ఆంగ్ల బోధకుడు : వైఎస్‌ఆర్‌ ఉన్నప్పుడు 104, 108 సర్వీసులు గొప్పగా సాగేవి. 2019లో మీరు పదవిలోకి రాగానే వైఎస్‌ఆర్‌ పథకాలన్నింటిపై తిరిగి సంతకం చేయాలి.

వైఎస్‌ జగన్‌ : నిజంగానే ఆరోగ్య శ్రీ పరిస్థితి దారుణంగా ఉంది. ఆస్పత్రికి వెళితే ఇంటికి తిరిగొస్తామా అని నమ్మకం లేని పరిస్థితి. అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీ బ్రహ్మాండంగా జరిపిస్తాం. పేదవాడికి ఉచిత వైద్యం ఉంటుంది. మందుల ఖర్చు, విశ్రాంతి సమయంలో ఖర్చులకు డబ్బులు కూడా ఇస్తాం. ప్రత్యేక హోదా సాధించేందుకు అందరం కలిసి కట్టుగా సాగుదాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement