సాక్షి, న్యూఢిల్లీ : తనపై జరిగిన హత్యాయత్నం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వ ప్రేరేపిత దర్యాప్తు జరుగుతోందని, తక్షణం జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేని సంస్థలతో దర్యాప్తు జరిపించేలా చూడాలని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా ఆరు పేజీల లేఖ రాశారు. ఈ లేఖను వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం మంగళవారం రాష్ట్రపతికి అందజేసింది. లేఖ సారాంశం ఇదీ.. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న ప్రమాదకర పరిస్థితులను మీ దృష్టికి తేవాలని ఈ లేఖ రాస్తున్న. 2018 అక్టోబర్ 25న సుమారుగా మధ్యాహ్నం 12.40 గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్టులోని వీఐపీ లాంజ్‌లో ఓ యువకుడి చేతిలో హత్యాయత్నానికి గురయ్యాను.
సెల్ఫీ ఫొటో తీసుకోవాలంటూ నాకు అత్యంత చేరువగా వచ్చి పదునైన ఆయుధంతో నా గొంతు కోయడానికి ప్రయత్నించాడు. సాధారణంగా ఆ ఆయుధాన్ని కోడి పందేల్లో కత్తిగా వాడుతారు. ఆత్మరక్షణలో భాగంగా నేను వెంటనే స్పందించి.. మెడకు తగలకుండా భుజాన్ని అడ్డుపెట్టాను. నా ఎడమ భుజానికి తీవ్ర గాయమైంది. 3.5 నుంచి 4 సెంటీమీటర్ల లోతున కోసుకుపోయింది. నా వెంట ఉన్న వారు హత్యాయత్నానికి పాల్పడిన యువకుడిని పట్టుకుని అక్కడే ఉన్న సీఐఎస్‌ఎఫ్ సిబ్బందికి అప్పగించారు. ఎయిర్‌పోర్టులో ఉన్న డ్యూటీ డాక్టర్ నాకు అవసరమైన ప్రాథమిక చికిత్స చేశారు. నా పై హత్యాయత్నం జరిగిందనే వార్తలు రాష్ట్రంలో తీవ్రమైన ఉద్రిక్తతలకు దారితీసే ప్రమాదం ఉందని నేను గ్రహించాను. అందువల్ల రాష్ట్ర ప్రజలు నా క్షేమంపై ఆందోళన చెందకుండా ఉండాలన్న ఆలోచనతో నేను రక్తంతో తడిచిన నా చొక్కాను మార్చుకున్నాను. కనీస ప్రాథమిక చికిత్స పొంది, గాయానికి డ్రెసింగ్ చేయించుకుని షెడ్యూలు ప్రకారం మధ్యాహ్నం 1.05 గంటల విమానంలో హైదరాబాద్ బయలుదేరాను.
రెస్టారెంట్ యజమాని సాయంతోనే..
హైదరాబాద్ చేరుకున్న వెంటనే నన్ను సిటీ న్యూరో ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకెళ్లారు. భుజానికి అయిన లోతైన గాయాన్ని వైద్యులు పరీక్షించి శస్త్రచికిత్స నిర్వహించి 9 కుట్లు వేశారు. తెగిన కండరానికి నాలుగు కుట్లు, మిగిలినవి చర్మానికి వేశారు. దాడిలో విషమేదైనా వాడారేమోనన్న అనుమానంతో రక్త నమూనాలను తదుపరి వైద్య పరీక్షల కోసం పంపారు. దుండగుడు నాపై దాడికి వాడిన కత్తి.. రెండు భద్రతా వలయాలను దాటుకొని ఎయిర్‌పోర్ట్‌లోకి చేరింది. హత్యాయత్నానికి పాల్పడిన జనుపల్లి శ్రీనివాసరావు ఎయిర్‌పోర్ట్‌లోని రెస్టారెంట్‌లో పని చేస్తున్న ఉద్యోగి. ఈ రెస్టారెంట్‌ను హర్షవర్దన్ అనే టీడీపీ నాయకుడు నిర్వహిస్తున్నారు. ఈయన గాజువాక శాసనసభ నియోజకవర్గం నుంచి 2014లో టీడీపీ టికెట్ ఆశించిన నేత. ఇతనికి ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి లోకేశ్‌తోపాటు ఇతర టీడీపీ నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. మరోవైపు దుండగుడికి నేర చరిత కూడా ఉంది. ఇతడిపై తీవ్రమైన నేరాభియోగాలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యం ఉన్నప్పటికీ హర్షవర్దన్ అతడికి ఉద్యోగం కల్పించారు. టీడీపీ ప్రభుత్వం కోసం పని చేస్తున్న హర్షవర్దన్ సహాయం లేకుండా హత్యాయత్నం చేసిన యువకుడు ఎయిర్‌పోర్టులో పని చేసేందుకు అనుమతి గానీ, ఎయిర్‌పోర్ట్‌లోకి కత్తి గానీ వచ్చి ఉండేవి కాదు.
ముందుగానే ఓ నిర్ధారణకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ఓ నిర్ధారణకు వచ్చి, లోపభూయిష్ట విధానంలో ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. దీంతో దర్యాప్తు సంస్థ ఉద్దేశ పూర్వకంగానే ముందస్తుగా ఒక ముగింపునకు సిద్ధమైంది. నేను అధ్యక్షుడిగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జరిగిన అంతర్గత కుట్రగా దీనిని చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. ఈ దాడి జరిగిన కొద్ది సేపటికే రాష్ట్ర డీజీపీ మీడియా ముఖంగా ఒక ప్రకటన చేశారు. ప్రజల దృష్టిని ఆకర్షించాలన్న ఉద్దేశంతోనే అతడు ఈ దాడికి పాల్పడ్డాడని ప్రాథమిక దర్యాప్తు సంకేతాలిస్తోందని డీజీపీ ప్రకటించారు. నిర్దిష్టత లేకుండా ఆయన చేసిన ఈ ప్రకటన ఈ దాడిని చిన్న అంశంగా చూపింది. తద్వారా అధికార టీడీపీ ప్రయోజనాలకు ఉపకరించేలా చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం నా పై జరిగిన దిగ్భ్రాంతికర దాడిని చిన్నదిగా చూపించే ఉద్దేశంతో పని చేస్తోందని స్పష్టమైంది. పైగా.. నాపై హత్యాయత్నానికి పాల్పడిన యువకుడు వైఎస్సార్‌సీపీ అభిమాని అని డీజీపీ ప్రకటించారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేకున్నప్పటికీ ఆయన ఈ ప్రకటన చేశారు.
సీఎం ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూశారు
ఈ దాడి ప్రణాళికాబద్ధంగా, పార్టీలో అంతర్గతంగా జరిగిందని.. రానున్న ఎన్నికల్లో సానుభూతి పొందేందుకు చేసిన దాడి అని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, టీడీపీ నేతలు అనేక ప్రకటనలు చేశారు. నేను ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగానే దర్యాప్తు ప్రక్రియను పక్కదారి పట్టించేందుకు, ముందుగా నిర్దేశించిన దారిలోకి మళ్లించేందుకు ఎంచుకున్న క్రూరమైన వ్యూహమిది. నేను హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తర్వాత ఇంటికి వెళ్లానని, బీజేపీ నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చాకనే ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యానని ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేశారు. ఇది పూర్తిగా అసత్యం. దర్యాప్తు సంస్థలను, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు. భద్రతా సిబ్బంది రాష్ట్ర ప్రభుత్వ భద్రత వాహనంలో ఎయిర్‌పోర్ట్ నుంచి నన్ను నేరుగా సిటీ న్యూరో ఆసుపత్రికి తీసుకెళ్లారు.
‘ఆపరేషన్ గరుడ’ అని శివాజీ చెబుతున్నారు
హత్యాయత్నం చేసిన యువకుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడు అని చెప్పేందుకు టీడీపీ ప్రభుత్వం, టీడీపీ నేతలు ఓ ఫ్లెక్సీని తెరపైకి తెచ్చారు. దాడి జరిగిన ఒక గంటలోనే డీజీపీ, టీడీపీ నేతలు ఎప్పుడో 9 నెలల కిందటి కాలానికి చెందినదని సూచిస్తున్న ఓ ఫ్లెక్సీని ఎలా తేగలిగారన్నది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అలాగే టీడీపీ మీడియా ఆవిష్కరించిన ఆ ఫ్లెక్సీ బొమ్మల్లో కొన్నింటిపై గులాబీ బొమ్మ ఉండగా మరికొన్నింటిలో లేదు. ఇటీవల తెలుగు చిత్ర రంగానికి చెందిన శివాజీ అనే టీడీపీ సానుభూతిపరుడు ‘ఆపరేషన్ గరుడ’ పేరుతో ఒక థియరీని తీసుకొచ్చారు. బీజేపీ దానిని అమలు చేస్తోందని ఆయన వివరించారు.
ఈ పథకంలో భాగంగా నాపై దాడి జరుగుతుందని, దీనిని ఆసరాగా చేసుకుని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వాన్ని అస్థిర çపరుస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. అన్ని ఫ్లెక్సీలపై గరుడ చిత్రాన్ని ప్రముఖంగా ముద్రించారు. ‘ఆపరేషన్ గరుడ’లో భాగంగానే నాపై దాడి జరిగిందని చిత్రించేలా టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారు. వీటన్నింటి దృష్ట్యా చూస్తుంటే ఈ ఘటన నన్ను కడతేర్చాలన్న కుట్రగా అర్థమవుతోంది. అది విఫలమైనప్పుడు బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆపరేషన్ గరుడ’గా చిత్రించి, రాజకీయ లబ్ధికి వీలుగా వాడుకునేందుకు పన్నిన కుట్రగా స్పష్టమవుతోంది. దీనిని అమలు చేయడానికి ఎయిర్‌పోర్ట్‌ను ఎంచుకోవడం, ఎయిర్‌పోర్ట్‌లోకి కత్తిని తేగలిగే వీలు కల్పించడం కూడా కుట్రలో భాగం. ఎయిర్‌పోర్టు సీఐఎస్‌ఎఫ్ నియంత్రణలో ఉన్నందున కేంద్ర ప్రభుత్వంపై నెపం మోపవచ్చనేలా కుట్రదారులు ప్రణాళిక రచించారు.
దర్యాప్తును ప్రభావితం చేశారు
ముఖ్యమంత్రి ఒక సిగ్గుమాలిన చర్యకు దిగారు. బీజేపీ, జేఎస్పీ, టీఆర్‌ఎస్ నేతలు సంఘీభావం తెలియపరిస్తే దానిని కుట్రకు సంకేతమని, దాడిలో వారి హస్తం ఉందని చెబుతూ ప్రజలను పక్కదోవ పట్టించేందుకు యత్నించారు. అలా అనుకుంటే నా వద్దకు వచ్చి సానుభూతి తెలిపిన వారిలో తెలంగాణలో ఆయన మిత్రపక్ష కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, జైపాల్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలకు అదే సూత్రాన్ని ఎందుకు వర్తింపజేయలేదు? ఇది ముఖ్యమంత్రి దిగజారుడు వైఖరిని తెలియజేస్తోంది. రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిపై దాడి జరిగినప్పుడు రాష్ట్ర యంత్రాంగానికి అధిపతిగా ఉన్న గౌరవ ముఖ్యమంత్రే స్వయంగా ఈ దాడి ఆ పార్టీలో జరిగిన అంతర్గత కుట్రగా మాట్లాడడం దురదృష్టకరం.
ఇది దర్యాప్తును ప్రభావితం చేసేందుకు జరిపిన ప్రయత్నం. దాడిని ప్రజలు నమ్మకుండా ఉండాలని, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బతీయాలని ముఖ్యమంత్రి ఈ ప్రచారానికి దిగారు. 3.5 సెంటీమీటర్ల లోతున తెగడంతో 9 కుట్లు పడ్డాయని డాక్టర్లు వెల్లడించినప్పటికీ.. కేవలం 0.5 సెంటీమీటర్ల మేర మాత్రమే తెగిందని ముఖ్యమంత్రి ప్రెస్‌మీట్‌లో చెబుతూ చిన్న ఘటనగా చిత్రీకరించే యత్నం చేశారు. ఒకవేళ ఆ దాడిలో తలకు, మెడకు రక్త ప్రసరణ జరిపే ధమనులు దెబ్బతిని ఉంటే ప్రాణాంతకమైన పరిస్థితి ఏర్పడి ఉండేదని ఊహిస్తేనే దిగ్భ్రాంతికరంగా ఉంటుంది. అసలు కుట్రదారుల ప్రాథమిక ఉద్దేశమే ఇది. కానీ ఆ దేవుడి అండతో ఆ ప్రమాదం తృటిలో తప్పింది.
అందుకే మీరు జోక్యం చేసుకోవాలి
రాష్ట్ర సర్కార్ పరిధిలో దర్యాప్తు సంస్థలు ఈ ఘటనపై దర్యాప్తు జరిపితే అవి ప్రభావవంతంగా వాటి విధులు నిర్వర్తించలేవు. నేర ఘటనలో బాధితుడు న్యాయమైన విచారణకు, నిష్పాక్షిక దర్యాప్తు కోరుకునేందుకు అర్హుడు. ఏ దర్యాప్తు అయినా న్యాయంగా, పారదర్శకంగా, చట్టబద్ధంగా ఉండాలి. పక్షపాతంగా ఉండకూడదు. నిగూఢ ఉద్దేశంతో ఉండకూడదు. ముందస్తు నిర్ధారణకు రాకుండా, ముందస్తుగానే ఒక నిర్ణయానికి రాకుండా తగిన సాక్ష్యాధారాలను సేకరించడం, దర్యాప్తు నిర్వహించడం న్యాయమైన దర్యాప్తులో కీలక అంశాలు. ఈ ఘటన ఓ కుట్రగా పుష్కలమైన సాక్ష్యాలు ఉన్నప్పటికీ రాష్ట్ర దర్యాప్తు సంస్థలు వైఎస్సార్‌సీపీలో జరిగిన అంతర్గత కుట్ర అన్న కోణంలో ఈ దర్యాప్తు ప్రక్రియను నడిపిస్తున్నాయి. నిష్పాక్షిక దర్యాప్తు జరగడం లేదనడానికి ఇదే సంకేతం. ఈ నేపథ్యంలో మీరు తక్షణం జోక్యం చేసుకోవాలని కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేని దర్యాప్తు సంస్థకు దర్యాప్తు బాధ్యతలు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అలా చేస్తే ఈ ఘటన వెనక వాస్తవాలను వెలికితీసేందుకు దోహదపడుతుంది. నేరస్తులకు శిక్ష పడేలా చేస్తుంది.
ఆ లేఖ కల్పితం
ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి పాత్రికేయుల సమావేశంలో నాపై, వైఎస్సార్ కాంగ్రెస్‌పై జుగుప్సాకరంగా మాట్లాడారు. దాడికి పాల్పడిన వ్యక్తి నుంచి 10 పేజీల లేఖను స్వాధీన పరుచుకున్నామని, అతడు వైఎస్సార్ కాంగ్రెస్ సానుభూతిపరుడని ఈ లేఖ ద్వారా తెలిసిందని చెప్పారు. అతని ఇంటిని తనిఖీ చేస్తుండగా దివంగత రాజశేఖరరెడ్డి ఫొటో దొరికిందని ప్రకటించారు. సానుభూతి కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే ఈ దాడికి పథక రచన చేసిందని ముఖ్యమంత్రి ఆరోపించారు. ముఖ్యమంత్రి చేసిన ఈ ప్రకటన దురుద్దేశంతో కూడినది. జేబులో లేఖ దొరికిందంటే అది మడత పెట్టి ఉండాలి. అలా మడతపెట్టి ఉంటే అన్ని పేజీలకూ మడతలు ఉండాలి. కానీ ఒకే పేజీ మడత పెట్టినట్టుగా స్పష్టమైంది. మరోవైపు ఆ లేఖను ఒకరికంటే ఎక్కువ మంది రాసినట్టు అవగతమవుతోంది.
ఎందుకంటే నలుగురైదుగురి చేతి రాత ఆ పేజీల్లో కనిపిస్తోంది. దాడి జరిగిన గంటకు డీజీపీ ప్రెస్‌మీట్‌లో చెప్పిన పేజీల సంఖ్యకు, లేఖ విడుదల చేసిన సమయంలో ఉన్న పేజీల సంఖ్యకు మధ్య తేడా ఉంది. నన్ను చంపాలనుకున్న వ్యక్తి తన వద్ద లేఖ పెట్టుకుంటాడా? అతడి వద్ద దొరికిందని చెబుతున్న లేఖ కేవలం కల్పిత గాథ. ఒక నిర్దిష్ట వాదన వినిపించేందుకు వీలుగా ఉద్దేశపూర్వకంగా పెట్టిన లేఖ అది. ఆ యువకుడు నన్ను చంపేందుకు ప్రయత్నించాడని రిమాండ్ రిపోర్టులో పోలీస్ శాఖ నిర్ధారించింది. అతను నన్ను రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నట్టుగా, అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని కోరుకున్నట్టుగా లేఖలో ఉందని చెబుతున్నారు. ఇది రిమాండ్ రిపోర్ట్ ఉద్దేశాలకు విరుద్ధంగా ఉంది. అందువల్ల ఈ లేఖ కేవలం అబద్ధాల అల్లిక.
- భవదీయుడు
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment