సాక్షి, తాడేపల్లి : కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. అయితే కరోనా సాకుతో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుందని అనుకోలేదన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యవస్థలను దగ్గరుండి వ్యవస్థలను నీరుగారుస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో ఆయన సామాజిక వర్గానికి చెందిన రమేష్ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించారని గుర్తుచేశారు. రమేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయని అన్నారు. నిష్పాక్షికంగా ఉండాల్సిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ విచక్షణ కోల్పోయారని అన్నారు. అధికారులు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకూ అతీతంగా పనిచేసినప్పుడే వారికి గౌరవం వస్తుందన్నారు. ఒకవైపు కరోనా సాకుతో ఎన్నికలు వాయిదా వేశామని చెబతూనే.. మరోవైపు అధికారులను తప్పిస్తున్నామని ప్రకటించడం ఏ విధంగా సబబని ప్రశ్నించారు. ప్రజలు ఓట్లేసి 151 సీట్లు ఇస్తేనే వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. ఇటీవల కాలంలో కొందరు విచక్షణాధికారం పేరుతో కొత్త పద్ధతికి తెరలేపుతున్నారని మండిపడ్డారు.
పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే సంతోషించాల్సింది పోయి.. ఎన్నికలు ప్రక్రియ పూర్తయ్యే వరకు వాటిని ఆపేయమని శనివారం ఎన్నికల కమిషనర్ అధికారులకు ఆదేశాలు జారీచేశారని గుర్తుచేశారు. అలాంటి కమిషనర్ మరుసటి రోజే ఎన్నికల వాయిదా వేశారని.. ఆయనకు నిన్నటికి, ఈరోజుకి తేడా ఏం కనిపించిందని ప్రశ్నించారు. ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తోందనే విషయమే కొందరికి దుర్వార్తగా తోచిందన్నారు. టీడీపీ దెబ్బతింటుందనే.. ఎన్నికల ప్రక్రియ నిలుపుదల చేస్తున్నట్టు 4 పేజీల ఆర్డర్ వచ్చిందన్నారు. ఇంత పెద్ద ఆర్డర్ తయారవుతున్నట్టు ఎన్నికల కమిషన్‌లో ఉన్న సెక్రటరీకే తెలియదన్నారు. ఎవరో రాస్తున్నారు.. ఎవరో ఇస్తున్నారు.. రమేష్ కుమార్ దానిని చదువుతున్నారని విమర్శించారు. కరోనా పేరు చెప్పి ఎన్నికలు వాయిదా వేసే ముందు ఎవరినైనా సంప్రదించారా అని సూటిగా ప్రశ్నించారు. కనీసం హెల్త్ సెక్రటరీ, చీప్ సెక్రటరీలను అయినా పిలిచి మాట్లాడారా అని నిలదీశారు. రమేష్‌కు చంద్రబాబు పదవి ఇచ్చి ఉండొచ్చు, వారిద్దరు ఒకే సామాజిక వర్గం కావొచ్చు.. కానీ ఇంత వివక్ష చూపడం ధర్మమేనా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో 43 చోట్ల మాత్రమే చిన్నపాటి గొడవలు జరిగాయని తెలిపారు. గతంలో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎన్నికలు జరిగాయా అని ప్రశ్నించారు. అత్యంత నిబద్ధతతో పోలీసులు పనిచేస్తున్నారని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. పోలీసులు ఎక్కడ ప్రేక్షక పాత్ర పోషించలేదని తెలిపారు. రమేష్ కుమార్ ఒక రాక్షస క్రీడకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. 2013లో జరిగిన స్థానిక సంస్థల్లో టీడీపీ సత్తా చాటిందని ఈనాడు పత్రికలో రాశారని గుర్తుచేశారు. ఏకగ్రీవాలు అనేవి ఇప్పుడు కొత్తేమీ కాదన్నారు. 9 నెలల్లో ప్రజలు హర్షించదగ్గ పాలన ఇచ్చామని గుర్తుచేశారు. కొద్ది నెలల్లోనే మేనిఫెస్టోలో చెప్పిను 90 శాతం అంశాలను పూర్తిచేశామని తెలిపారు. ప్రజలకు మేలు జరుగుతుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. మార్చి 31లోగా ఎన్నికలు జరగకపోతే 14వ ఆర్థిక సంఘం నుంచి వచ్చే దాదాపు రూ. 5వేల కోట్ల నిధులు ఆగిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ డబ్బులను ఎందుకు నష్టపోవాలని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో పరిస్థితిలో ఏమైనా మార్పు వస్తుందని చెప్పగలరా అని ప్రశ్నించారు. కరోనా బాధిత దేశాల నుంచి ఇంకా వస్తారు. కరోనాను ఎదుర్కొవడం నిరంతర ప్రక్రియ అవుతుందన్నారు. ఇలాంటప్పుడు 10 రోజుల్లో ఎన్నికలు జరిపితే సరిపోయేదన్నారు. రమేష్ కుమార్ వైఖరిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. ఆయనలో మార్పు రాకపోతే.. పై స్థాయికి దీనిని తీసుకెళ్తామని చెప్పారు.
పానిక్ బటన్ నొక్కాల్సిన అవసరం లేదు..
అంతకుముందు సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘కరోనా వైరస్‌పై కొన్ని విషయాలు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చైనాలో 80 వేల మందికి కరోనా వైరస్ సోకిందని గుర్తుచేశారు. కరోనా వల్ల మనుషులు చనిపోతారని.. ఇదొక భయానక పరిస్థితి అని పానిక్ బటన్ నొక్కాల్సిన అవసరం లేదన్నారు. 60 ఏళ్ల వయసు ఉన్నవారికి, మధుమేహం, ఇతర వ్యాధులు ఉన్నవారికి కరోనా వల్ల కొంత ప్రభావం కలిగే అవకాశం ఉందని చెప్పారు. ప్రపంచం మొత్తం మీద ఉన్న కేసుల్లో 81.9 శాతం కేసులు ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్నారు. 13 శాతం కేసులు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నారు. 4.7 శాతం కేసులు మాత్రమే ఐసీయూలో చికిత్స జరిగింది. ఎవరికీ ఇబ్బందులు రాకూడదనే మా తాపత్రాయం. విదేశాల్లో పనిచేసుకునే మనవాళ్లను వెనక్కి పంపుతారు. వారికి ఎయిర్‌పోర్టులలో స్క్రీనింగ్ నిర్వహించి.. 14 రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచుతాం. అవసరమైన వారందరికీ ప్రభుత్వం వైద్యం చేయిస్తుంది. కేవలం 2, 3 వారాల్లో పరిస్థితి మారిపోదు. వచ్చే ఏడాది పాటు ఇదంతా నిరంతర ప్రక్రియ.
ఏపీలో 78 మందికి ఇప్పటివరకు పరీక్షలు నిర్వహించగా.. ఒక్కరికే కరోనా పాజిటివ్‌గా తేలిందన్నారు. అతను కూడా ప్రస్తుతం కోలుకుంటున్నాడు. తిరుపతి, విజయవాడలలో రెండు ల్యాబ్స్ పెట్టాం. త్వరలో కాకినాడలో మరో ల్యాబ్ పెడతాం. జిల్లా ఆస్పత్రులు, బోధన ఆస్పత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. గ్రామ వాలంటీర్లతో ప్రతి ఇల్లు సర్వే చేయిస్తున్నాం. స్క్రీనింగ్ యాప్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. విశాఖలో 200 పడకల ఐసోలేషన్ వార్డు సిద్ధంగా ఉంచాం. విజయవాడలో 50 పడకల సూపర్ స్పెషాలిటీ ఐసోలేషన్ వార్డు ఉంచాం. కాకినాడ, రాజమండ్రి, కర్నూలు, గుంటూరు, విజయవాడ, విశాఖలో ఐసోలేషన్ రూమ్స్ ఏర్పాటు చేశాం. ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నెల్లూరులో ఒక్క పాజిటివ్ కేసు రాగానే తక్షణం స్పందించాం. 40 టీమ్‌లతో 20 వేల ఇళ్లలో ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించామ’ని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment