హెరిటేజ్‌ కోసం సర్వం దోచుకున్నారు: వైఎస్‌ జగన్‌ | YS Jagan Mohan Reddy Public Meeting At Tiruvuru | Sakshi
Sakshi News home page

దళారీలకు నాయకుడిగా చంద్రబాబు: వైఎస్‌ జగన్‌

Published Sun, Mar 24 2019 6:11 PM | Last Updated on Sun, Mar 24 2019 6:48 PM

YS Jagan Mohan Reddy Public Meeting At Tiruvuru - Sakshi

సాక్షి, తిరువూరు: చంద్రబాబు నాయుడి పాలనలో పేదవాడికి ఏది కావాలన్న జన్మభూమి కమిటీలకు లంచం ఇవ్వాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజలు రేషన్‌ తీసుకోవాలన్నా, బాత్‌రూమ్‌ నిర్మించుకోవాలన్నా ప్రభుత్వానికి లంచం చెల్లించాల్సిన పరిస్థితి టీడీపీ ప్రభుత్వంలో ఉందని ఆరోపించారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఏ ఒక్క వర్గానికి కూడా మేలు జరగలేదని, రైతుల, నిరుద్యోగుల ఆత్మహత్యలు తప్ప మరేమీ లేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికలు ఇరవై రోజులే ఉన్నందున అనేక అబద్ధాలు చెప్పడానికి చంద్రబాబు సిద్ధమైయ్యారని, ఆయనతో యుద్ధం చేయడానికి మనందరం సిద్ధంగా ఉండాలన్నారు. ఎన్నికల్లో గెలవడానికి టీడీపీ నేతలు మూటల కొద్ది డబ్బులు పంచుతున్నారని, మూడువేల తీసుకుని మరోసారి మోసపోద్దని వైఎస్ జగన్‌ వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలనలో కష్టాలు పడ్డ ప్రతి ఒక్కరికీ అండగా తాను ఉంటానని భరోసా ఇచ్చారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కృష్ణాజిల్లా తిరువూరు ప్రచార సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. సభలో ఆయన మాట్లాడుతూ..‘‘నియోజకవర్గానికి నాగార్జునసాగర్‌ పక్కనే ఉన్నా సాగునీరు అందక రైతులు ఆత్మహత్యకు పాల్పడుతన్నారు. ప్రజలకు తాగునీరు కూడా దొరకడంలేదు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ఒక్కసారి కూడా దీని గురించి ఆలోచన చేయలేదు. గతంలో ఇదే సమస్య ఉన్నప్పుడు నూటిపాడు వద్ద దివంగత వైఎస్సార్‌ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. ఇదే ప్రాంతంలో బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ను కూడా నిర్మించారు. ఈ ప్రభుత్వం వాటి ద్వారా అయినా కనీసం రైతులను ఆదుకోవడంలేదు. కిృష్ణా జలాలను రైతులకు అందిస్తామని ఎన్నికల ముందు శిలాఫలకాలు వేస్తున్నారు. ఇలాంటి మోసపూరిత పాలకులు మనకు అవసరమా?. అధికారంలో ఉన్నపుడు చంద్రబాబుకు ప్రజల కష్టాలు గుర్తుకురావు. ఈ ప్రాంతంలో లక్షఎకరాలకు పైగా మామిడి సాగు చేస్తున్నారు. రైతులు కనీసం మద్దతు ధర కూడా లభించట్లేదు.

తన సొంత కంపెనీ హెరిటేజ్‌ కోసం దళారీలకు నాయకుడిగా చంద్రబాబు మారి రైతులను దోచుకుంటున్నారు. 3648 కి.మీ సుధీర్ఘ పాదయాత్రంలో ప్రజల కష్టాలను చూశాను. వారందరికీ హామీ ఇస్తున్నా నేను ఉన్నాను. ప్రతి ఒక్కరి నుంచి చంద్రబాబు పాలనలో ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు అనే మాటలే విన్న. ప్రత్యేక హోదాను కూడా తాకట్టుపెట్టారు. ఉద్యోగాలు వస్తాయనే నమ్మకం కూడా లేదు. 2లక్షల 30 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అయినా ప్రభుత్వం భర్తీ చేయదు. జాబు రావాలి అంటే బాబు రావాలి అన్నారు. బాబు పోతేనే జాబు వస్తుంది. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే  2లక్షల 30 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ప్రతి ఏడాది జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్‌ను విడుదల చేస్తాం. ఇంజనీరింగ్‌ చదువుకు లక్షల రూపాయలు ఖర్చుఅవుతున్నాయి. ఇంజనీరింగ్, మెడిసిన్‌ విద్యను ఉచితంగా చదివిస్తానని హామీ ఇస్తున్నా. 

నిరుద్యోగులకు, మహిళలకు, రైతులకు, నిరుద్యోగుల చంద్రబాబు మోసం చేశారు. టీడీపీ ప్రభుత్వంలో పరిశ్రమలు వచ్చినా ఇతర రాష్ట్రాల వారికే ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఈ విధానానికి చెక్‌ పెడుతూ.. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే 75శాతం ఉద్యోగాలు స్థానికులకే వచ్చే విధంగా చట్టం చేస్తాం. ప్రతి గ్రామంలో సెక్రటేరియట్‌ను ఏర్పాటు చేస్తాం. గ్రామంలో చదువుకున్న పదిమందికి అక్కడే ఉద్యోగాలు కల్పిస్తాం. ప్రభుత్వ పథకాలకు లంచాలు ఇచ్చే దుర్మర్గాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం. ఏ అప్లికేషన్‌ పెట్టుకున్నా 72 గంటల్లో అమలు జరిగేలా వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. నవరత్నాలు ద్వారా పేదల బతుకుల్లో మార్పు వస్తుందన్న నమ్మకం నాకుంది.’’ అని వ్యాఖ్యానించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement