సాక్షి, ఆళ్లగడ్డ (కర్నూలు జిల్లా): 'నా పాదయాత్రలో దారిపొడవునా ప్రజలు నాకు అర్జీలు ఇస్తున్నారు. అన్నా ఈ చంద్రబాబు పాలనతో వేగలేకపోతున్నాం అన్నా.. అని తమ గోడును చెప్పుకుంటున్నారు' అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా తొమ్మిదోరోజు బుధవారం ఆళ్లగడ నాలుగురోడ్ల కూడలికి చేరుకున్న వైఎస్ జగన్‌కు పెద్దసంఖ్యలో తరలివచ్చిన ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. ఇసుక వేస్తే రాలనంతగా జనంతో పోటెత్తిన ఆళ్లగడ్డ పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. తన పాదయాత్రలో దారి పొడవునా.. ప్రజలు తమ గోడు చెప్పుకుంటున్నారని, చంద్రబాబు పాలనతో తాము వేగలేకపోతున్నామని, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనే ప్రతినోటా వినిపిస్తోందని అన్నారు. ఆయన తన ప్రసంగంలో ఏమన్నారంటే..
దారిపొడవునా.. ఇవే మాటలు
- పాదయాత్రలో ఇవాళ ఉద్యోగులు నన్ను కలిశారు. సంత్సరంపైగా పెన్షన్ విధానం మార్చాలని కోరుతున్నా, సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు
- దారిపొడవునా అవ్వాతాతలు నన్ను కలిసి.. పెన్షన్ రావడం లేదని మొరపెట్టుకున్నారు
- పెన్షన్ అందడం లేదని, ఇళ్లు లేవని, పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని దారిపొడవునా ప్రతి నోట ఇవే మాటలు వినిపిస్తున్నాయి.
- పత్తి, మినుములు, పసుపు, వేరుశనగల తదితర పంటలకు గిట్టుబాటు ధర లేదని రైతున్నలు అంటున్నారు
- ధరలు గిట్టుబాటు కాక, అప్పుల బాధ తట్టుకోలేక ఏదో రేటుకు అమ్ముకునే అధ్వాన్న పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
- బ్యాంకుల గడప తొక్కలేకపోతున్నాం, అప్పులు పుట్టడం లేదని రైతన్నలు గోడు చెప్పుకుంటున్నారు
- చదువుకున్న పిల్లలు వచ్చి ఇంజినీరింగ్ ఫీజులు లక్షదాక ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చేది రూ. 30వేలు కూడా ఉండటం లేదు. అదీ ఎప్పుడిస్తారో తెలియదు. పరిస్థితులు ఇలా ఉంటే ఎలా చదువాలి అన్న అని అంటున్నారు
- వైఎస్సార్ పాలనలో వడ్డీ లేని రుణాలు, పావులా వడ్డీ రుణాలు వచ్చేవని, ఇప్పుడా రోజులు పోయాయని పొదుపు సంఘాల అక్కాచెల్లెమ్మలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- పొదుపు సంఘాల మహిళలకు ఒక్క రూపాయి రుణం కూడా మాఫీ కాలేదని అంటున్నారు.
నాలుగేళ్ల పాలన.. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి
- నాలుగు సంవత్సరాల టీడీపీ పరిపాలన గురించి ఇవాళ మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం, సమయం వచ్చింది.
- ఈ నాలుగేళ్ల పాలనలో మనకు మంచి జరిగిందా? చెడు జరిగిందా? అన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి
- నాయకత్వం నుంచి ఏదైతే ఆశిస్తామో అది వచ్చిందా? లేదా అన్నది ప్రశ్నించుకోవాలి
- నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అనేది కూడా ప్రశ్నించుకోవాలి
- ఫలానావాడు మా నాయకుడు అని ప్రతి కార్యకర్త సగర్వంగా చెప్పుకొనేలా నాయకుడు ఉండాలి
- సినిమాల్లో హీరోనే ఎప్పుడూ నచ్చుతాడు.. విలన్ నచ్చడు..
- మరొక్క సంవత్సరంలో ఎన్నికలు రాబోతున్నాయి..
- మనం ఇవాళ కూర్చి మీద కూర్చోబెట్టిన ఇదే చంద్రబాబుకు మళ్లీ ఓటు వేయాలా? వద్దా? అన్నది నిర్ణయించాలి
- బాబు పాలన రాకముందు కరెంటు బిల్లు ఎంత వచ్చింది? ఇప్పుడెంత వస్తోంది.
- ఇప్పుడు ఇష్టమొచ్చినట్టు బాదుడే బాదుతున్నారు. డబ్బు కట్టకపోతే కరెంటు కట్ చేస్తామని బెదిరిస్తున్నారు
- బాబు పాలన రాకముందు బియ్యం కోసం మీరు రేషన్ షాపులకు వెళ్తే.. బియ్యంతోపాటు చక్కెర, కిరోసిన్, గోధుమపిండి, చింతపండు, పామాయిల్ దొరికేవి.
- కానీ ఇప్పుడు రేషన్ షాపులో ఒక్క బియ్యం తప్ప మరేమీ దొరకడం లేదు
- ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తానని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చాడు. ఈ నాలుగేళ్లలో ఒక్క ఇల్లు అన్న కట్టించాడా? లేదు
- రుణాలు మాఫీ చేస్తానని, బ్యాంకుల్లోని బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలని చెప్పిన చంద్రబాబు రైతులను మోసం చేశాడు.
- నిరుద్యోగ భృతి ఇస్తానని మాట తప్పి చంద్రబాబు నిరుద్యోగులను మోసం చేశాడు. ప్రతి ఇంటికీ చంద్రబాబు రూ. 90వేలు చొప్పున బాకీపడ్డాడు
చంద్రబాబు నిస్సిగ్గుగా..!
'ప్రశ్నించాల్సిన ప్రతిపక్షమే లేకపోతే.. ప్రజల తరఫున ఎవరూ నిలబడరు? ప్రజలకు ఎవరు అండగా నిలబడరన్న ఆలోచనతో చంద్రబాబు నిస్సిగ్గుగా, సంతలో గొర్రెలను కొన్నట్టు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నాడు. కొంతమందికి డబ్బులు ఇస్తున్నాడు. ఇంకొంతమందికి మంత్రిపదవులు ఇస్తున్నాడు. ప్రస్తుతం కేబినెట్‌లో ఎవరు ఏ పార్టీ నుంచి ఎన్నికై మంత్రిగా ఉన్నారో తెలియని పరిస్థితి నెలకొంది. దారుణంగా రాజకీయ పరిస్థితి దిగజారిపోయింది. చట్టాలను రూపొందించి.. కాపాడాల్సిన శాసనసభ్యులనే చట్టాలను ఏమాత్రం లెక్కచేయకుండా చంద్రబాబు నిస్సిగ్గుగా కొనుగోలు చేస్తున్నాడు. పార్టీ మారినా వాళ్లు రాజీనామా చేయకుండా.. వారి పదవులు పోకుండా కాపాడుతున్నాడు. ఇంతటి దారుణమైన పరిస్థితులు ఉండటంతో ఆ చట్టసభలో కూర్చోబుద్ధి కావడం లేదు. వీళ్లంతా (ఫిరాయింపు ఎమ్మెల్యేలు) మంత్రులైన మొట్టమొదటి సభ ఇది. సభకు హాజరైతే వాళ్లు చేసిన అన్యాయాన్ని మేం కూడా టిక్ చేసినట్టు అవుతుంది. అందుకే మేం సభకే రామని చెప్పాం. అప్పుడే మీ అన్యాయం దేశం మొత్తానికి, ప్రపంచం మొత్తానికి తెలుస్తుందని, అప్పుడైనా మీకు సిగ్గు వస్తుందయ్యా చంద్రబాబు అని అన్నాం' అని వైఎస్ జగన్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment