‘‘నాన్నగారి రక్తం నాలో ఉంది. రైతన్నలకు నేను తోడుగా ఉంటానని ప్రత్యేకంగా చెప్సాల్సిన పనిలేదు. ప్రాజెక్టుల గురించి తెలిసిన వ్యక్తిని, కరువు ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తిని. ఆ ప్రాజెక్టులు, నీటితో రైతుల జీవితాలు పూర్తిగా బాగుపడుతాయని తెలిసిన వ్యక్తిని. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. ఆ ప్రాజెక్టుల నుంచి డబ్బులు ఎలా గుంజాలి అనే ఆలోచన చేయం, ప్రాజెక్టుల్లో నీళ్లు ఎలా పారించాలనే ఆలోచన మాత్రమే చేస్తామని సగర్వంగా చెబుతున్నా’’
సాక్షి ప్రతినిధి కడప: అన్నదాతలు సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. తమ ప్రభుత్వం రైతన్నల శ్రేయస్సును కాంక్షించే ప్రభుత్వమని స్పష్టం చేశారు. దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా సోమవారం వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో ‘రైతు దినోత్సవం’ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నెల రోజుల్లోనే రైతాంగం సంక్షేమం కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకుందని గుర్తుచేశారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని చెప్పారు. రాబోయే మరో సంవత్సరంలో మరెన్నో చర్యలు ప్రారంభించబోతున్నామని తెలిపారు.
వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం, వైఎస్సార్ ఉచిత పంటల బీమా, పగటి పూట 9 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా, రైతులకు బకాయిల చెల్లింపు వంటి విప్లవాత్మకమైన చర్యలకు శ్రీకారం చుట్టామని గుర్తుచేశారు. సీఎం జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘దివంగత మహానేత, నాన్నగారు వైఎస్ రాజశేఖరరెడ్డికి రైతుల పట్ల ఎలాంటి ప్రేమ ఉండేదో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి మైక్ ఇచ్చినా వైఎస్సార్ గురించి నా కంటే బాగా చెబుతారు. రైతుల సంక్షేమం విషయంలో ఎందాకైనా ముందుకెళ్లడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అధికారంలోకి రాగానే నెల రోజుల్లోనే అన్నదాతల కోసం ‘వైఎస్సార్ సున్నా వడ్డీ’ పథకానికి శ్రీకారం చుట్టాం. మన ప్రభుత్వంలో ఈ సంవత్సరం కేవలం రైతులకు రూ.84,000 కోట్ల రుణాలు అందించాలని నిర్ణయం తీసుకున్నాం.
పంటలు రుణాలు తీసుకున్న రైతులు సకాలంలో తిరిగి చెల్లిస్తే వాటిపై వడ్డీ కట్టాల్సిన పనిలేదు. కడప జిల్లాలో జూన్ 1 నుంచి జూలై 7వ తేదీ దాకా అంటే 47 రోజుల్లో రైతన్నలకు రూ.1,000 కోట్ల పంటలు రుణాలు అందించాం. పంట రుణాలు ఇకపై సున్నా వడ్డీకే అందుబాటులోకి వస్తాయి. రైతన్నల కోసం తీసుకున్న మరో నిర్ణయం.. పగటిపూటే 9 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా. ఇప్పటికే వెసులుబాటు ఉన్న 60 శాతం ఫీడర్లలో దీన్ని అమలు చేస్తాం. అధికారుల సూచనల మేరకు మిగిలిన 40 శాతం ఫీడర్లలో పగటిపూటే 9 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేయడానికి రూ.1,700 కోట్లు వెంటనే విడుదల చేశాం. అలాగే ఆక్వా రైతులకు రూ.1.50కే యూనిట్ కరెంటు సరఫరా చేస్తున్నాం. ‘వైఎస్సార్ ఉచిత పంటల బీమా’ పథకానికి కూడా శ్రీకారం చుట్టాం ఇన్సూరెన్స్ ప్రీమియం సొమ్మును రైతుల తరపున ప్రభుత్వమే చెల్లిస్తుంది ప్రభుత్వమే ఇన్సూరెన్స్ సొమ్మును రాబట్టి, రైతన్నలకు అందజేస్తుంది. ‘వైఎస్సార్ ఉచిత పంటల బీమా’ పథకం కింద 55 లక్షల మంది రైతుల తరపున 1.38 కోట్ల ఎకరాలకు గాను అక్షరాలా రూ.2,164 కోట్ల బీమా ప్రీమియాన్ని ఇకపై ప్రభుత్వమే చెల్లిస్తుంది.
పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలన్న ఉద్దేశంతో రూ.3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయబోతున్నాం. అధికారంలోకి రాగానే శనగ రైతులపై తోడుగా ఉండేందుకు క్వింటాల్‌కు రూ.1,500 చొప్పున ఇవ్వబోతున్నాం. ఎకరాకు 6 క్వింటాళ్లు అంటే ప్రతి ఎకరాకు రూ.9,000 చొప్పున రైతన్నల చేతిలో పెట్టబోతున్నాం. శనగ రైతులను ఆదుకోవడానికి అధికారంలోకి వచ్చి నెల తిరక్కముందే రూ.330 కోట్లు కేటాయించాం. పామాయిల్ రైతులకు అండగా ఉండడానికి రేట్లను పూర్తిగా సవరించాం. తెలంగాణలో రైతులకు లభిస్తున్న ధరలే మన రాష్ట్రంలోని పామాయిల్ రైతులకు దక్కేలా చర్యలు తీసుకున్నాం. దానివల్ల ప్రభుత్వంపై రూ.80 కోట్ల భారం పడుతున్నా ఫర్వాలేదని భావించి సంతకం చేశాం.
బాబు నిర్లక్ష్యం వల్లే విత్తనాల కొరత
ఖరీఫ్ సీజన్ మొదలయ్యే నాటికి రైతులకు విత్తనాలను అందుబాటులోకి తీసుకురావాలి. ఇందుకోసం గత ఖరీఫ్ సీజన్ అయిపోయిన వెంటనే నవంబర్ నెల నుంచే చర్యలు తీసుకోవాలి. మే నెల వచ్చే సరికి విత్తనాలను సిద్ధం చేసి పెట్టుకోవాలి. కానీ, చంద్రబాబు ప్రభుత్వం దానిపై దృష్టి పెట్టిన పాపాన పోలేదు. విత్తనాలకు సంబంధించిన రూ.384 కోట్ల బకాయిలను సైతం చెల్లించలేదు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే విత్తనాలకు సంబంధించిన రూ.384 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని ఆదేశాలు జారీ చేశా. ఎంత ఖర్చయినా ఫర్వాలేదు, విత్తనాలు కోనుగోలు చేసి, ప్రతి రైతుకూ అందజేయండి అని చెప్పా. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన రూ.960 కోట్ల బకాయిలను తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు చెల్లించలేదు. మనం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే చంద్రబాబు చేసిన తప్పిదాన్ని సరి చేశాం. రైతులకు రూ.960 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని అధికారులకు ఆదేశాలిచ్చాం. రైతులకు ఇప్పటికే రూ.300 కోట్లు చెల్లించేశాం.
బాధిత రైతు కుటుంబాలకు రూ.7 లక్షలు
రాయలసీమ ప్రాంతం. చంద్రబాబు పాలనలో కరువు వచ్చినా రైతాంగాన్ని పట్టించుకున్న నాథుడు లేడు. 2018 ఖరీఫ్‌లో వచ్చిన కరువుకు సంబంధించి రైతులకు రూ.2,000 కోట్ల పెట్టుబడి రాయితీ(ఇన్‌పుట్ సబ్సిడీ) సొమ్ము చెల్లించాల్సి ఉండగా, అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు పట్టించుకోలేదు. మన సర్కారు వచ్చాక నెల రోజులు కూడా తిరక్కముందే రైతుల పక్షపాతిగా ఆ ఇన్‌పుట్ సబ్సిడీ బకాయిలను విడుదల చేస్తూ సంతకం చేశాం. అధికారంలోకి రాగానే ట్రాక్టర్లపై రోడ్డు ట్యాక్స్ రద్దు చేశాం. ‘వ్యవసాయ మిషన్’ ఏర్పాటు చేశాం. పులివెందులలో అరటి పరిశోధనా కేంద్రం నెలకొల్పుతున్నాం. రైతు ఆత్మహత్య చేసుకున్నా, ప్రమాదవశాత్తూ చనిపోయినా, జరగరానిది జరిగినా మీరే అక్కడికి వెళ్లండి అని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశాం. బాధిత కుటుంబాన్ని ఓదార్చి, రూ.7 లక్షల చెక్కును వారి చేతుల్లో పెట్టండి అని ఆదేశాలిచ్చాం. మనం అధికారంలోకి వచ్చాక వ్యవసాయ శాఖ మంత్రిని పొగాకు కొనుగోలు కేంద్రాల దగ్గరకు పంపించా. కొనుగోలుదారులతో మాట్లాడి, పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు ఇప్పించే కార్యక్రమాన్ని కేవలం ఈ నెల రోజుల్లోనే చేశాం.
- ‘వైఎస్సార్ సున్నా వడ్డీ’ పథకానికి శ్రీకారం
- ఈ సంవత్సరం రైతులకు రూ.84,000 కోట్ల రుణాలు అందిస్తాం
- రుణాలను సకాలంలో తిరిగి చెల్లిస్తే వాటిపై వడ్డీ కట్టాల్సిన పనిలేదు
- 60 శాతం ఫీడర్లలో పగటిపూటే 9 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా
- మిగిలిన 40 శాతం ఫీడర్లలో అమలుకు రూ.1,700 కోట్లు విడుదల
- ఆక్వా రైతులకు రూ.1.50కే యూనిట్ కరెంటు సరఫరా
- ‘వైఎస్సార్ ఉచిత పంటల బీమా’ పథకం అమలు
- 55 లక్షల మంది రైతుల తరపున రూ.2,164 కోట్ల బీమా ప్రీమియాన్ని ఇకపై ప్రభుత్వమే చెల్లిస్తుంది
- రూ.3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు
- శనగ రైతులను ఆదుకోవడానికి రూ.330 కోట్లు
- విత్తనాలకు సంబంధించిన చంద్రబాబు చెల్లించాల్సిన రూ.384 కోట్ల బకాయిలను చెల్లించాం
- ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన రూ.960 కోట్ల బకాయిలు రైతులకు చెల్లింపు
- 2018 ఖరీఫ్ కరువుకు సంబంధించి రైతులకు రూ.2,000 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల
- రైతు ఆత్మహత్య చేసుకున్నా ప్రమాదవశాత్తూ చనిపోయినా రైతు కుటుంబానికి రూ.7 లక్షలు
రానున్న సంవత్సరంలో ఇంకెన్నో చర్యలు
రైతులు బాగుంటేనే ఏ రాష్ట్రమైనా బాగుంటుంది. 62 శాతం జనాభా కష్టాల్లో ఉంటే ఏ రాష్ట్రమూ బాగుండదు. అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా రాబోయే సంవత్సరం కాలంలోనే ఇంకెన్నో కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. తుపాను వచ్చినా, కరువు వల్ల పంటలు నష్టపోయినా రైతన్నలను ఆదుకోవడానికి రూ.2,000 కోట్లతో ‘విపత్తుల సహాయ నిధి’ ఏర్పాటు చేయబోతున్నాం. ఈ పథకాన్ని ఈ సంవత్సరం నుంచే అమలు చేస్తాం. ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులకు రబీలోనే సాయం అందజేస్తాం. ‘వైఎస్సార్ రైతు భరోసా’ను తీసుకొస్తున్నాం. పంటల సాగుకు సిద్ధమయ్యే నాటికే మే నెలలోనే పెట్టుబడి కోసం రైతన్న చేతిలో రూ.12,500 పెడతాం. ఈ పథకాన్ని మే నెలలో అమలు చేయాల్సి ఉన్నప్పటికీ కూడా రైతుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని ఏడు నెలల ముందే అమలు చేస్తున్నాం. రబీ సీజన్ మొదలయ్యే నాటికి ఈ ఏడాది అక్టోబర్ 15వ తేదీన ప్రతి రైతుకు రూ.12,500 ఇవ్వబోతున్నాం.
దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా దాదాపు 70 లక్షల రైతులు, కౌలు రైతుల కుటుంబాలకు ‘వైఎస్సార్ రైతు భరోసా’ కింద అక్టోబర్ 15వ తేదీన రూ.8,750 కోట్లు ఇవ్వబోతున్నామని చెప్పడానికి గర్వపడుతున్నా. దాదాపు 16 లక్షల మంది కౌలు రైతులకు కూడా దీనివల్ల మేలు జరుగుతుంది. ఇంత భారీ మొత్తాన్ని ఒకేసారి రైతుల చేతికి ఇవ్వడం అంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు, 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్న భారతదేశ చరిత్రలోనే ఎక్కడా లేదు. భూ యజమానులకు ఉన్న హక్కులను పూర్తిగా కాపాడుతూ కౌలుదారులకు మేలు చేసే విధంగా 11 నెలల పాటు మాత్రమే సాగు ఒప్పందం ఉండేలా కౌలు రైతుల చట్టాల్లో మార్పులు తీసుకొస్తున్నాం. మొదటి ఏడాదే సహకార రంగం పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా సహకార రంగంలో ఉన్న చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీని మళ్లీ తెరిపిస్తాం. ప్రతి నియోజకవర్గంలో గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీలు, అవసరం మేరకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ఇదే సంవత్సరం చర్యలు తీసుకోబోతున్నాం.
ఇక నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు
రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు లభించేలా ప్రభుత్వం నడుం బిగించింది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యతను తేల్చడానికి ప్రతి నియోజకవర్గంలో ఒక ల్యాబోరేటరీని తీసుకొస్తున్నాం. నాణ్యతను నిర్ధారించిన తర్వాతే వాటిని గ్రామ స్థాయిలో నేరుగా రైతులకు విక్రయించేలా చర్యలు తీసుకుంటాం. సంవత్సరం తిరక్కముందే మీ గ్రామంలో షాపులు కనిపిస్తాయి.
మార్కెట్ కమిటీలకు ఎమ్మెల్యేలు గౌరవ చైర్మన్లు
నియోజకవర్గాల్లో పంటల పరిస్థితి ఏమిటి? అక్కడ రైతుల కష్టాలేంటి? ఆ జిల్లాలోపంటల ధరలు ఎలా ఉన్నాయి? పంటలకు ఎలాంటి గిట్టుబాటు ధరలు కల్పించాలి? అనే దానిపై సూచనలు తీసుకోవడానికి మార్కెట్ కమిటీలకు ఇకపై ఎమ్మెల్యేలనే గౌరవ చైర్మన్లుగా నియమిస్తామని సగర్వంగా చెబుతున్నా. ఎమ్మెల్యేలు రైతులతో నేరుగా భేటీ అవుతారు. పంటలు, ధరల పరిస్థితిని స్వయంగా తెలుసుకుంటారు. తమ నియోజకవర్గంలో పండిన ఫలానా పంటకు ఫలానా మేర గిట్టుబాటు ధర కల్పించాలంటూ ప్రభుత్వానికి సిఫార్సు చేస్తారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, ఆ నియోజకవర్గంలో పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి నుంచి నిధులు విడుదల చేస్తుంది. ‘నాఫెడ్’ను ఏర్పాటు చేసి, ఐదు కొనుగోలు కేంద్రాల ద్వారా కొబ్బరికి కనీస మద్దతు ధర కల్పించేందుకు ఈ సంవత్సరం చర్యలు తీసుకుంటున్నాం. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 200 రిగ్గులు కొనుగోలు చేసి, ప్రతి రైతన్నకు ఉచితంగా బోర్లు వేసే కార్యక్రమాన్ని ఇదే సంవత్సరంలో ప్రారంభించబోతున్నాం.
గోదావరి నీటితో మన పొలాలు సస్యశ్యామలం
గోదావరి జలాలు మన కళ్ల ముందే వృథాగా సముద్రంలో కలిసి పోతున్నాయి. గోదావరి జిల్లాలను శ్రీశైలంలోకి తీసుకొస్తే మన ప్రాంతం ఎలా మారిపోతుందో చెపాల్సిన పనిలేదు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి నుంచి ఆమోదం తీసుకున్నాం. గోదావరి నీటిని శ్రీశైలానికి తీసుకొచ్చి, రాయలసీమ, ప్రకాశం జిల్లాలను సస్యశ్యామలం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కృష్ణా ఆయకట్టు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. గోదావరి నీటిని శ్రీశైలానికి, నాగార్జునా సాగర్‌కు తీసుకొచ్చి, కృష్ణా ఆయకట్టును పూర్తిగా స్థిరీకరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టగలిగాం అంటే నిజంగా దేవుడు మన వైపు ఉన్నాడని చెప్పడానికి ఇదొక నిదర్శనం.
- రూ.2,000 కోట్లతో ‘విపత్తుల సహాయ నిధి’ ఏర్పాటు చేయబోతున్నాం.
- ‘వైఎస్సార్ రైతు భరోసా’ కింద ప్రతి రైతుకు రూ.12,500
- అక్టోబర్ 15న రూ.8,750 కోట్ల పంపిణీ
- భూ యజమానుల హక్కులను పూర్తిగా కాపాడుతూ కౌలుదారులకు మేలు చేసే విధంగా 11 నెలల పాటు మాత్రమే సాగు ఒప్పందం ఉండేలా చట్టాల్లో మార్పులు
- సహకార రంగంలో ఉన్న చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీని మళ్లీ తెరిపిస్తాం.
- ప్రతి నియోజకవర్గంలో గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీలు, అవసరం మేరకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు
- విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యతను తేల్చడానికి ప్రతి నియోజకవర్గంలో ఒక ల్యాబోరేటరీ
- 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి రైతన్నకు ఉచితంగా బోర్లు
- గోదావరి నీటిని శ్రీశైలానికి తీసుకొచ్చి, రాయలసీమ, ప్రకాశం జిల్లాలను సస్యశ్యామలం చేసే కార్యక్రమానికి శ్రీకారం
డిసెంబర్ 26న కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన
కడప జిల్లాలో ఇక్కడికి దగ్గర్లోనే ఒక కలగా మిగిలిపోయిన స్టీల్ ప్లాంట్ కనిపిస్తోంది. డిసెంబర్ 26న అదే స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తానని హామీ ఇస్తున్నా. మూడేళ్లలోనే ఆ ప్రాజెక్టును పూర్తిచేస్తాం. కందూ నదిపై రాజోలి, జోలదరాశి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టబోతున్నాం. వాటి నిర్మాణానికి ఈ ఏడాది డిసెంబర్ 26న శంకుస్థాపన చేస్తాం. కుందూ నది నుంచి ఎత్తిపోతల ద్వారా తెలుగుగంగ కాలువ గుండా బ్రహ్మంసాగర్‌కు నీటిని తరలిస్తాం. ఆ కార్యక్రమాన్ని డిసెంబర్ 26న ప్రారంభిస్తాం. దేవుడు దయతలిస్తే గండికోట రిజర్వాయర్‌లో ఈ సంవత్సరం 20 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు చర్యలు చేపడతాం.
Comments
Please login to add a commentAdd a comment