
హైదరాబాద్: ప్రజా సమస్యలపై ఆంధ్రప‍్రదేశ్ ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తుండటంతో రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆవేదన వ‍్యక్తం చేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో వైఎస్ జగన్.. ఏపీ ప‍్రభుత్వం అవలంభిస్తున్న వైఖరిపై మండిపడ్డారు. ప్రధానంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై జగన్ ప్రశ్నించారు. రైతుల రుణ మాఫీతో పాటు, రూ, 20 లక్షల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు అంటూ చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏమయ్యాని జగన్ నిలదీశారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంపై వ్యతిరేకత వెల్లువెత్తుతోందన్నారు. ఇప్పుడు సీఎం చంద్రబాబును బీజేపీ, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లే తప్పుబడుతున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
గత ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే వైఎస్సార్‌సీపీ కంటే కేవలం 1.5 శాతం మాత్రమే ఎక్కువ వచ్చాయన్నారు. 2014 తర్వాత ప్రత్యేక హోదా అంశాన్ని చంద్రబాబు మరచిపోయారని, ప్యాకేజీ ఇస్తామన్న కేంద్రం ప్రకటనను స్వాగతించడమే కాకుండా మళ్లీ యూటర్న్ తీసుకుని హోదా కావాలనడం ఎంత వరకూ సమంజసమని జగన్ నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో ప్రత్యేక హోదా ఇచ‍్చే వాళ్లతోనే కేంద్రంలో తమ మద్దతు ఉంటుందని జగన్ తెలియజేశారు. తాను చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు ఇతరులపై బాబు నెపం నెడుతున్నారన్నారు. చంద్రబాబు పగలు కాంగ్రెస్‌తో, రాత్రి బీజేపీతో సంసారం చేస్తున్నారని విమర్శించారు. రాబోవు ఎన్నికల్లో కేంద్రంలో ఏ పార్టీతో ఒప్పందంగానీ, పొత్తు గానీ ఉండదని తేల్చిచెప‍్పారు. పదేళ్లుగా ప్రజల మధ్య గడుపుతూ వారి సమస్యలు క్షుణ్ణంగా తెలుసుకున్నాని జగన్ ఈ సందర్భంగా తెలిపారు. పాదయాత్రలో కొన్ని లక్షల మందిని నేరుగా కలుసుకున్న విషయాన్ని జగన్ ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా తాము అధికారంలోకి వస్తామన్న నమ్మకుందని జగన్ ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే ప్రజలు మెచ్చే పరపాలన చేస్తానని జగన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment