
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం రాత్రి 7.40 గంటల ప్రాంతంలో తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలో ఆయనకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. జననేతకు శాలువా కప్పి సత్కరించారు. ఇక, తిరుమలలో వైఎస్ జగన్‌కు టీటీడీ ఈవో అనీల్‌కుమార్ సింఘాల్, చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న సాదరంగా స్వాగతం పలికారు. వైఎస్ జగన్ వెంట పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నారాయణస్వామి, అనీల్ యాదవ్ తదితరులు ఉన్నారు.
వైఎస్ జగన్ రాత్రికి తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో బస చేస్తారు. బుధవారం ఉదయం కుటుంబసమేతంగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న తర్వాతే వైఎస్ జగన్ ఏ కార్యక్రమమైనా చేపట్టడం అనవాయితీగా వస్తోంది. ఈ నెల 30న సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ముందుగా శ్రీవారిని దర్శించుకుని రాష్ట్రానికి అన్నివిధాలా మేలు చేయాలని.. ప్రజారంజక, సుపరిపాలన అందించేలా ఆశీర్వదించాలని స్వామిని కోరనున్నారు.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అంతకుముందు ఆయన తాడేపల్లిలోని తన స్వగృహం నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకొని.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. రేణిగుంట ఎయిర్‌పోర్టు వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు, శ్రేణులు, వైఎస్ జగన్ అభిమానులు.. జననేతకు ఘనస్వాగతం పలికారు. కాన్వాయ్‌లోని తన వాహనం నుంచి దిగి మరీ.. వైఎస్ జగన్ అభిమానులకు, ప్రజలకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా తనను చుట్టుముట్టిన పార్టీ శ్రేణులు, అభిమానులతో కాసేపు ముచ్చటించారు. అభిమానులు అందించిన శాలువాలు, పుష్పగుచ్ఛాలను స్వీకరించారు. అనంతరం రేణిగుంట నుంచి రోడ్డుమార్గంలో వైఎస్ జగన్ తిరుమలకు చేరుకున్నారు.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం వైఎస్ జగన్ ప్రత్యేక విమానంలో తిరుపతి నుంచి వైఎస్సార్ జిల్లా కడపకు చేరనున్నారు. కడపలోని పెద్ద దర్గాను దర్శించుకుంటారు. ప్రత్యేక ప్రార్థన అనంతరం చాదర్‌ను సమర్పించనున్నారు. కడప దర్గాను సందర్శించిన అనంతరం చాపర్ ద్వారా కడప నుంచి పులివెందులకు చేరుకుంటారు. పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడ నుంచి ఇడుపులపాయకు వెళ్లి.. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధికి నివాళులు అర్పిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment