సాక్షి, కొత్తవలస(విజయనగరం) : ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కొత్తవలస బహిరంగ సభలో ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చెప్పిన బల్ల ఆట కథ ఆకట్టుకుంది. ‘చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేసిన పాలనను చూస్తుంటే స్కూళ్లో పిల్లలు ఆడుకునే ఓ ఆట గుర్తుకొస్తుంది. ఈ ఆటలో ఓ బల్ల ఉంటుంది. ఒకవైపు ఒకరు మరోవైపు మరొకరు కూర్చుని ఆడుతుంటారు. ఈ ఆటలో బల్లపై ఒకవైపు బరువు ఉన్న వ్యక్తి కూర్చుంటే.. మరో వైపు బరువు లేని పిల్లవాడు లేస్తాడు.
ఇలానే బరువున్న చంద్రబాబు తన మామ దివంగత ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి బల్లపై కూర్చున్నారు. దీంతో బల్లపై మరోవైపు ఉన్న సబ్సిడీలు, సంక్షేమ పథకాలు, రాజకీయ విలువలు, ధర్మం అన్ని ఎగిరిపోయాయి. ఆయన సీఎం బల్లపై కూర్చున్నాడు మధ్య నిషేదం గోవిందా.. రెండు రూపాయల బియ్యం గోవిందా.. ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వరంగ ఉద్యోగాలు గోవిందా.. వ్యవసాయం, వర్షాలు, గిట్టుబాటు ధరలు అన్నీ గోవిందా.. రాజకీయ విలువలు కూడా గోవిందా గోవిందా.. దీంతో ప్రజలు మళ్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి దించేశారు. ప్రజలంతా ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఆదరించారు. ఆయన వచ్చి ఆ బల్లమీద కూర్చున్నాడు. దీంతో రైతులకు ఉచితంగా కరెంట్ వచ్చింది.
కరెంట్ బకాయిలు మాఫీ అయ్యాయి. ఫీజు రీయింబెర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ, కుయ్‌కుయ్ అంటూ 108, 104లు వచ్చాయి. దేశం మొత్తం 48 లక్షల ఇళ్లు కడితే ఆ దివంగత నేత ఒక్కడే ఉమ్మడి రాష్ట్రంలో 48 లక్షల ఇళ్లు కట్టించాడు. జలయజ్ఞంతో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్‌లను పూర్తిచేసే ప్రయత్నం చేశాడు. కరెంట్ చార్జీలు పెంచని పాలనంటే ఆయనదే. రెండు రూపాయలకు బియ్యం తీసుకొచ్చాడు. పెన్షన్‌లు వచ్చాయి. పేదలందిరికి భూపంపిణీ జరిగింది. మళ్లీ ఇవాళ చంద్రబాబు వచ్చారు. మళ్లీ బరువు ఎక్కువైంది. రైతుల సంక్షేమం పేరుతో రుణమాఫీలు అని మోసం చేశాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంకా రాలేదు. గిట్టుబాటు ధరలేదు. వ్యవసాయం భారంగా మారి రైతులు ఆత్మహత్య చేస్తుకుంటున్నారు.’ అని బల్ల ఆట కథతో చంద్రబాబు పాలనను వైఎస్ జగన్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment