నేటి నుంచి ఏపీలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర | YS Jagan padayatra in AP from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఏపీలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర

Published Mon, Nov 6 2017 1:41 AM | Last Updated on Fri, Aug 10 2018 8:31 PM

YS Jagan padayatra in AP from today - Sakshi

సాక్షి ప్రతినిధి, కడప : అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు గడుస్తున్నా టీడీపీ ప్రభుత్వం ఒక్క హామీ నెరవేర్చక పోవడంతో రాష్ట్రంలో తల్లడిల్లుతున్న రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగులకు సాంత్వన చేకూర్చేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేటి నుంచి ప్రజా సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రజల కోరిక మేరకు ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు 180 రోజులు 3 వేల కిలో మీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. ఈ యాత్ర ద్వారా 125 నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజల బాధలు ప్రత్యక్షంగా చూసి.. సుమారు 2 కోట్ల మందిని స్వయంగా కలుసుకుంటారు. రాష్ట్రంలో ప్రభుత్వ తీరు వల్ల అన్ని వర్గాల వారు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

ఒక్కటంటే ఒక్క వర్గం వారు కూడా సంతోషంగా లేరు. ‘నేను అనుభవజ్ఞున్ని.. నన్ను నమ్మండి.. నేను మారాను’ అంటూ గత ఎన్నికలప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు లెక్కలేనన్ని హామీలిస్తూ ప్రజలముందుకు వెళ్లారు. హామీల వర్షం.. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రజలు ఆ పార్టీకి పట్టం కట్టారు. ఇది జరిగి ఇప్పటికి మూడున్నరేళ్లు గడిచాయి. ఈ మూడున్నరేళ్లలో ఈ ప్రభుత్వం అరచేతిలో అమరావతిని చూపడం తప్ప చేసిందేమీ లేదు. రైతులు, డ్వాక్రా అక్క చెల్లెళ్లు మాఫీ మాయా జాలంలో తీవ్రంగా నష్టపోయారు. సవాలక్ష షరతులు విధించి అరకొరగా విధిలించిన మాఫీ సొమ్ము బ్యాంకు అప్పులకు అయిన వడ్డీకి కూడా సరిపోలేదు. లక్షలాది ఉద్యోగాలు వస్తాయన్నారు. ఉద్యోగం రాకపోతే నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు.

కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు వేలాది మంది కాంట్రాక్టు ఉద్యోగుల ఉద్యోగాలు ఊడిపోయాయి. రోగమొస్తే పెద్ద దిక్కుగా ఉన్న ఆరోగ్య శ్రీ పథకం నిర్వీర్యమైపోయింది.  ‘వృద్ధాప్యంలో ఆసరాగా ఉన్న పింఛన్‌ ఉన్నట్లుండి ఆపేశారయ్యా.. ఎలా బతకాలయ్యా..’ అంటూ ఊరూరా వయో వృద్ధులు కన్నీళ్ల పర్యతమవుతున్నా ప్రభుత్వ పెద్దలు పట్టించుకున్న పాపాన పోలేదు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంపై నీలి నీడలు అలుముకున్నాయి. అనుభవజ్ఞుడనే ఆలోచనతో చంద్రబాబును గెలిపిస్తే రాజధాని నిర్మాణం విషయంలో మ్యాప్‌లు మార్చడం తప్ప ఒక్క ఇటుకా పడక 33 వేల ఎకరాల భూములు కోల్పోయామని రాజధాని రైతులు కుమిలిపోతున్నారు. అభివృద్ధి విషయంలో కాకుండా అవినీతిలో రాష్ట్రం అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. గ్రామాల్లో రోడ్ల నిర్మాణం నుంచి ప్రాజెక్టులు, రాజధాని నిర్మాణం వరకు అవినీతి సాగు చేస్తున్నారు. ఓట్లేసిన పాపానికి ఐదేళ్లు మౌనంగా రోదించాల్సిందే తప్ప ఏమీ చేయలేమని, తమ బాధలు తీర్చడానికి, తమ తరఫున పోరాటం చేయడానికి ఎవరో ఒక నాయకుడు రావాలని ప్రజలు సంకల్పించారు. ప్రజల సంకల్పం మేరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం నుంచి ప్రజా సంకల్ప యాత్రకు శ్రీకారం చుడుతున్నారు.

మరో చారిత్రక ఘట్టం
జగన్‌ చేపట్టనున్న ప్రజా సంకల్ప యాత్రకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ఆయన కోసం మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడానికి జగన్‌ జరిపిన ఓదార్పు యాత్ర రాజకీయ వర్గాల్లో పెద్ద సంచలనమే అయ్యింది. నేరుగా జనంలోకే వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని బాధితులకు నేనున్నానని భరోసా ఇచ్చారు. ఇప్పటికే నవరత్నాలు ప్రకటించి ఇంటింటికీ వీటిని తీసుకుని వెళ్లే కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు సన్నద్ధం అయ్యారు. ప్రజల కష్టాలు తెలుసుకుంటూ వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేయబోతున్నారు. నవరత్నాల హామీలను మరింత మెరుగు పరచేలా ప్రజల నుంచి వచ్చే సలహాలను స్వీకరించి ఎన్నికల నాటికి ప్రజలు దిద్దిన మేనిఫెస్టోను తీసుకు రావడం కోసం జగన్‌ సన్నద్ధమయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరినీ భాగస్వాములను చేయడానికి ఎన్ని కుట్రలు ఎదురైనా ఎదురించి సుదీర్ఘ యాత్ర ప్రారంభిస్తున్నారు. ఈ యాత్ర ఎలా సాగుతుంది? జగన్‌ ఏ విధంగా ముందడుగు వేయబోతున్నారు? అని అటు రాజకీయ వైరిపక్షాలు, ఇటు అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 

జిల్లాకు చేరుకున్న జనం
వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రారంభించే ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొనడం కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో జనం ఆదివారం రాత్రికే జిల్లాకు చేరుకున్నారు. పాదయాత్రకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరవుతారనే అంచనాతో పార్టీ వర్గాలు ప్రత్యేకంగా పార్కింగ్, భోజన సదుపాయం ఏర్పాటు చేశాయి. పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ శని, ఆదివారాల్లో జిల్లా వ్యాప్తంగా అభిమానులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాయి. ఇడుపులపాయ నుంచి వేంపల్లి దాకా ఎక్కడ చూసినా స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలతో ముంచెత్తారు.

అందరి ఆశీస్సులు
ప్రజల కోసం తాను చేస్తున్న పాదయాత్ర విఘ్నాలు లేకుండా విజయవంతం కావాలనీ, రాష్ట్ర ప్రజల కష్టాలు తొలగి సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరిపి గండి వీరాంజనేయ స్వామి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత కడప పెద్ద దర్గాలో ప్రార్థనలు చేసి మత పెద్దల ఆశీస్సులు పొందారు. ఈ సందర్బంగా జగన్‌ మాట్లాడుతూ.. ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కావాలని కోరుతూ ప్రార్థనాలయాలను దర్శించుకుంటున్నానని, అందులో భాగంగా ఉదయం పులివెందుల చర్చి, సాయంత్రం వేంపల్లె గండి శ్రీ వీరాంజనేయస్వామి ఆలయం, ప్రస్తుతం పెద్దదర్గాలను దర్శించుకున్నానన్నారు. దేశ, రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. దేవుని ఆశీస్సులు, ప్రజల దీవెనలు, అండదండలు కావాలని కోరారు.

ఇడుపులపాయకు చేరుకున్న జగన్‌.. కుటుంబ సభ్యులు
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు ఆయన తల్లి, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, భార్య వైఎస్‌ భారతి రెడ్డి, సోదరి షర్మిల ఆదివారం ఇడుపులపాయకు చేరుకున్నా రు. వీరితో పాటు పలువురు కుటుంబ సభ్యులు కూడా ఎస్టేట్‌కు వచ్చారు. సోమవారం ఉదయం జరిగే పాదయాత్ర ప్రారంభ కార్యక్రమంలో వారు పాల్గొనబోతున్నారు.

2003లో వైఎస్సార్‌ ప్రజా ప్రస్థానం
 వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడిగా 2003 ఏప్రిల్‌ 9న రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ప్రజా ప్రస్థానం పాదయాత్ర ప్రారంభించారు. మండుటెండను లెక్క చేయక, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ 1464 కిలోమీటర్లు పాదయాత్ర చేసి జూలై 15వ తేదీన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగించారు.

2012లో షర్మిల మరో ప్రజా ప్రస్థానం
 వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమ అరెస్టు నేపథ్యంలో పార్టీ కేడర్‌లో, ప్రజల్లో ధైర్యం నింపడానికి ఆయన సోదరి షర్మిల 2012 అక్టోబర్‌ 18న ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ నుంచి మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ప్రారంభించారు. (ఉమ్మడి రాష్ట్రంలో) 14 జిల్లాల మీదుగా 3,112 కిలోమీటర్లు నడిచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద పాదయాత్ర ముగించారు.

నేటి నుంచి జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర
 వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నవంబర్‌ 6వ తేదీ (నేడు) ఇడుపుల పాయలోని వైఎస్‌ ఘాట్‌ నుంచి ప్రజాసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్రకు సంకల్పించారు. ఉదయం 8.30 గంటలకు వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ప్రార్థనల అనంతరం 9.30 గంటలకు సభలో పాల్గొని పాదయాత్ర ప్రారంభిస్తారు.

నేడు పాదయాత్ర ఇలా..
సాక్షి ప్రతినిధి, కడప : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభిస్తారని పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, కడప పార్లమెంటు నియోజక వర్గ పార్టీ అధ్యక్షుడు సురేశ్‌బాబు తెలిపారు. ఉదయం 8.30 గంటలకు వైఎస్‌ జగన్‌ వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద కుటుంబ సభ్యులతో కలసి నివాళులర్పించి 9 గంటలకు సభావేదికకు చేరుకుంటారని చెప్పారు.

9.30 గంటలకు పాదయాత్ర ప్రారంభించి మారుతినగర్‌ మీదుగా మధ్యాహ్నం 1 గంటకు భోజన విరామ ప్రాంతానికి చేరుకుంటారని చెప్పారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభించి వీరన్నగట్టుపల్లె కూడలిలో పార్టీ జెండా ఆవిష్కరణ చేస్తారని, అక్కడి నుంచి కుమ్మరాంపల్లె మీదుగా వేంపల్లె శివారులో ఏర్పాటు చేసిన రాత్రి బసకు చేరుకుంటారని వారు తెలిపారు. జగన్‌కు రాత్రి విడిది కోసం టెంట్‌లు ఏర్పాటు చేశారు. ఆయన టెంట్‌లోనే నిద్రపోతారు. ప్రతి రోజు ఉదయం తన కోసం వచ్చిన వారితో పాటు, పార్టీ కార్యకర్తలు, నాయకులను కలుసుకుంటారు. రోజూ ఉదయం 7 కిలో మీటర్లు, సాయంత్రం 7 కిలో మీటర్ల చొప్పున పాదయాత్ర చేసేలా కార్యక్రమం ఖరారు చేశారు. మంగళవారం మధ్యాహ్నానికి పాదయాత్ర కమలాపురం నియోజకవర్గంలోని వీరపునాయునిపల్లె మండలంలోకి ప్రవేశిస్తుంది. రాత్రి ఈ మండలంలోనే ఆయన బస చేస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement