ప్రతి సంవత్సరం బడ్జెట్లో బీసీల సంక్షేమానికి రూ.10 వేల కోట్లు కేటాయిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ ప్రకారం ఈ నాలుగేళ్లలో రూ.40 వేల కోట్లు కేటాయించి ఉండాలి. తీరా చూస్తే 2014–15లో కేవలం రూ.2,242 కోట్లు, 2015–16లో రూ.2,573 కోట్లు, 2016–17లో రూ.4,500 కోట్లు, 2017–18లో రూ.4,700 కోట్లు కేటాయించారు. మొత్తం మీద ఈ నాలుగేళ్లలో రూ.13,700 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇచ్చిన హామీలో 20 శాతం మాత్రమే నిధులు ఖర్చు చేసి బీసీలపై ప్రేమ ఉందని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉంది. – ప్రతిపక్ష నేత వైఎస్ జగన్
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : చంద్రబాబును నమ్మి మోసపోయిన బీసీలకు తాను అండగా ఉంటానని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీఅధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. అధికారంలోకి రాగానే నవరత్నాల పథకాలతో పేదలందరికీ మేలు జరిగేలా చూస్తానని, చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కని కులాలకు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. రాజమండ్రి పార్లమెంట్ సీటును తాము బీసీలకే ఇస్తామని ప్రకటించారు.
ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 185వ రోజు ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని మల్లవరం గ్రామంలో జరిగిన బీసీల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. చంద్రబాబుకు బీసీలపై నిజమైన ప్రేమ లేదని, వారిని ఎప్పుడు ఏ విధంగా వాడుకోవాలనే ఆలోచిస్తారని విమర్శించారు.
బాబు దృష్టిలో బీసీల అభివృద్ధి అంటే నాలుగు కత్తెర్లు, నాలుగు ఇస్త్రీ పెట్టెలు ఇవ్వడమేనని ఎద్దేవా చేశారు. నిజంగా పేదవాడికి మేలు జరుగుతుందా లేదా అనేది ఆలోచించకుండా రాజకీయంగా ఏది లాభం అనేలా పరిస్థితిని దిగజార్చారని మండిపడ్డారు. ఈ సమ్మేళనంలో జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే..
బీసీలకు చెందాల్సిన కుప్పంను బాబు ఆక్రమించాడు..
చంద్రబాబు గురించి ఇప్పటి తరం వారికి తెలీదు. అందుకే ఆయన గురించి చెబుతున్నా. ఆయన సొంత గ్రామం నారావారి పల్లె చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. 1978లో చంద్రబాబు ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 2,494 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. చంద్రబాబుకు మా నాన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో ఉన్న స్నేహం అందరికీ తెలిసిందే. నాన్నగారి సహకారంతో కాంగ్రెస్‌లో చంద్రబాబు మంత్రి కూడా అయ్యారు.
1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించాక అదే చంద్రగిరి నియోజకవర్గం నుంచి 1983లో మంత్రి హోదాలో చంద్రబాబు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 17,429 ఓట్ల భారీ తేడాతో ఓడిపోయాడు. సాధారణంగా మంత్రి పదవిలో ఉండే వ్యక్తి ఓడిపోవడం జరగదు. అలా ఓడిపోయాడంటే అంతకంటే దౌర్భగ్యం మరొకటి ఉండదు (సభికుల నుంచి కేరింతలు, అరుపులు, కేకలు). 1978 తర్వాత చంద్రబాబు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడే ఎన్టీ రామారావు కుమార్తెను వివాహం చేసుకున్నాడు.
1983 ఎన్నికల్లో ఓడిపోయాక తన అల్లుడే కదా అని ఆ పెద్దాయన ఎన్టీఆర్ చంద్రబాబును క్షమించి దగ్గరకు తీశారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌కు ఏం జరిగిందనేది మీ అందరికీ తెలుసు. ఇలాంటి వ్యక్తిని ఎందుకు దగ్గరకు తీశానా అని ఎన్టీఆర్ బాధపడేలా చేశారు. టీడీపీలో చేరాక 1985 ఎన్నికల్లో చంద్రబాబు పోటీ చేయలేదు. 1989 ఎన్నికల్లో చంద్రబాబు తన సొంత నియోజకవర్గం చంద్రగిరి నుంచి పోటీ చేస్తే ఓడిపోతానని భయపడి, బీసీలు ఎక్కువగా ఉండే కుప్పం నుంచి పోటీ చేశారు.
అప్పట్లో కుప్పంలో కూడా ఆయన కుంటుతూ కుంటుతూ 5 వేల మెజార్టీతో గెలిచాడు. ఇది ఆయన ఘనత. ఎంతసేపు బీసీలను ఎలా వాడుకోవాలనేదే తప్ప.. వారిపై ఆయనకు ఏమాత్రం ప్రేమ లేదు.
బీసీలు జడ్జీలు కాకుండా అడ్డుకున్నారు..
బీసీలు జడ్జీలు కాకుండా చంద్రబాబు ఎలా అడ్డుకున్నారో ఇటీవల హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఈశ్వరయ్య గౌడ్ బయటపెట్టారు. కొందరు బీసీ అభ్యర్థులను న్యాయమూర్తులుగా నియమించవద్దని చంద్రబాబు రాసిన లేఖను మీడియాకు విడుదల చేశారు. ఈ లేఖను (చేత్తో పట్టుకుని చూపిస్తూ) సాక్షి తప్ప, మరో పత్రికగాని, చానల్ గాని కవర్ చేయలేదు. చంద్రబాబు అంత గొప్పగా మీడియాను మేనేజ్ చేశారు. అమర్నాథ్‌గౌడ్ అనే న్యాయవాదిని జడ్జిగా నియమించవద్దని అడ్డుకుంటూ చంద్రబాబు ఈ లేఖ రాశారు.
అమర్నాథ్‌గౌడ్‌కు మేథోపరమైన ప్రతిభ లేదని, వృత్తిపరమైన, వ్యక్తిగతమైన నిబద్ధత, వ్యక్తిత్వం లేదని అడ్డుచెప్పారు. అందుకే ఆయన్ను న్యాయమూర్తిగా నియమించడం సరికాదని ఆ లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబుకు ఇవన్నీ ఉన్నట్టు ఇంకొకరిపై బురదజల్లారు. దీన్ని బట్టి చంద్రబాబుకు బీసీలపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోంది. ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు 110 ఎన్నికల వాగ్దానాలు చేసి, అమలు చేయలేదు.
చైతన్య, నారాయణ కార్పొరేట్ సూళ్లకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లను ఎడాపెడా మూసేశారు. ఇప్పటికే 600కుపైగా బీసీ హాస్టళ్లను మూసేశారు. ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల విషయంలో చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంది. కొన్ని నిర్ణయాలు తన స్థాయిలో లేవని తెలిసి కూడా చంద్రబాబు బీసీల ఓట్ల కోసం కుతంత్రాలు చేశారు. రజకులను ఎస్సీలుగా గుర్తించేందుకు చర్యలు తీసుకుంటానని వారికి హామీ ఇచ్చారు. కురువ, కురుబ కులాలను ఎస్టీలుగా గుర్తిస్తానని, వాల్మీకి, బోయలను ఎïస్టీలుగా గుర్తించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చాడు.
మత్స్యకారులను కూడా ఎస్టీలుగా గుర్తిస్తానని అన్నాడు. ఏ కులాన్ని అయినా ఎస్సీలు, ఎస్టీలుగా గుర్తించే అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉంది. అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కాదని తెలిసి కూడా బాబు వీరిని మోసం చేశారు. ఇవాళ ఏమంటున్నారంటే తాను చేయాల్సిన పని అయిపోయిందని, కేంద్రమే చేయడం లేదంటూ బురద జల్లుతున్నాడు. తాను చేయగలిగే పరిస్థితి లేనప్పుడు ఓట్ల కోసం చంద్రబాబు ఎందుకు అబద్ధాలు చెప్పాలి?
నాన్నగారు గుర్తొస్తారని..
నిరుపేదలు డాక్టర్, ఇంజనీర్, కలెక్టర్ వంటి ఉన్నత చదువులు చదువుకోవాలని దేశంలో మరెక్కడాలేని విధంగా విప్లవాత్మకంగా నాన్నగారు వైఎస్ రాజశేఖరరెడ్డి గారు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలులోకి తెచ్చారు. ఈ పథకం అమలు జరిగితే నాన్నగారు ఎక్కడ ప్రజలకు, విద్యార్థులకు గుర్తొస్తారోనని చంద్రబాబు దారుణంగా నిర్వీర్యం చేయడం చాలా బాధ కలిగిస్తోంది.
ఇవాళ చంద్రబాబు.. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల్లో ఫీజులు పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చాడు. కానీ ఆ మేరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ మాత్రం ఇవ్వకుండా పేద విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఏటా ఇంజనీరింగ్ విద్యకు లక్ష రూపాయల ఫీజు ఉంటే ప్రభుత్వం మాత్రం ముష్టి వేసినట్టు రూ.30 వేలు, రూ.35 వేలు ఇస్తోంది. రెండేళ్లుగా అది కూడా సరిగ్గా రావడం లేదని విద్యార్థులు చెబుతున్నారు.
నవరత్నాలతో బీసీలకు మేలు
మా నాన్నగారు వైఎస్ రాజశేఖరరెడ్డి సువర్ణ యుగాన్ని మళ్లీ తీసుకొచ్చేందుకు వీలుగా నవరత్నాలను తీసుకొచ్చాను. మీ పిల్లలు ఎంత పెద్ద చదువులు చదవాలనుకున్నా చదివించే బాధ్యత నాది. ఎంత ఖర్చు అయినా భరిస్తాం. ప్రతి విద్యార్థికి మెస్ చార్జీల కోసం ఏటా రూ.20 వేలు ఇస్తాం. మీ చిట్టి తల్లులు, మీ చిట్టి పిల్లలను బడికి పంపిన ప్రతీ తల్లికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తాను.
అవ్వా తాతలకు పెన్షన్ పెంచడానికి చంద్రబాబుకు మనసు రావడం లేదు కానీ, కమీషన్ల కోసం కాట్రాక్టర్లకు మాత్రం రేట్లు పెంచుతాడు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే అవ్వాతాతల పింఛన్‌ను రూ.2 వేలు చేస్తాను. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద అక్కలకు రూ.2 వేల పింఛన్ ఇస్తాను. పింఛన్ వయసును 45 ఏళ్లకే తగ్గిస్తాను’ అని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
ఈ సమ్మేళనంలో వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, నేతలు కారుమూరి నాగేశ్వరరావు, మేకా శేషుబాబు, కొయ్యే మోషేన్‌రాజు, కవురు శ్రీనివాస్, పిళ్లంగోళ్ల శ్రీలక్ష్మి మాట్లాడారు. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, కొవ్వూరు నియోజకవర్గ పార్టీ కన్వీనర్ తానేటి వనిత పాల్గొన్నారు.
బాబు పాలనలో బతకలేకపోతున్నామన్నా..
కంకటాల శ్రీనివాసరావు: శెట్టిబలిజ కులానికి చెందిన మేము తాడిచెట్లు గీతగీచి కల్లు అమ్ముకునేవాళ్లమన్నా. చంద్రబాబు వచ్చాక ఇంటింటికి మద్యం బెల్ట్‌షాపు పాయింట్ ఇచ్చి మా వృత్తి దెబ్బతీసి జీవనాధారం లేకుండా చేశాడు. ఈ పాలనలో మేము బతకడమే కష్టమైంది. ఇల్లు, మరుగుదొడ్డి, పింఛన్ కూడా ఇవ్వడంలేదు. పిల్లల్ని చదివించుకోలేకపోతున్నాం. కరెంటు బిల్లు కూడా కట్టలేక ఇబ్బందులు పడుతున్నాం.
జగన్: మీ అందరికీ ఒక విషయం చెబుతున్నా. రాజమండ్రి పార్లమెంట్ సీటు బీసీలకే ఇవ్వబోతున్నాం. ఇక్కడి నుంచే బీసీలకు ప్రాధాన్యత మొదలవుతుందని చెబుతున్నా.
కర్నాటి కన్నయ్య: సగర ఫెడరేషన్ వల్ల ఏ మాత్రం ఉపయోగం లేదు. అది అరచేతిలో బెల్లం పెట్టి మోచేతి వద్ద నాకించినట్టు ఉంది. తెలంగాణ మాదిరిగానే ఏపీలోనూ సగర కార్పొరేషన్ చేస్తే దాదాపు 35 లక్షల మందికి మేలు జరుగుతుంది. సగర, ఉప్పర కులాన్ని బీసీ–డి నుంచి బీసీ–ఏలోకి మారుస్తామని టీడీపీ మెనిఫెస్టోలో పెట్టి అమలు చేయలేదు. మీరు సీఎం అవ్వగానే మాకు చట్టసభల్లో రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి.
జగన్: నేరుగా చట్టసభల్లోకి పంపించలేకపోయిన కులాల వారికి ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇస్తున్నా.
గోపీ యాదవ్ : మా బావ గారికి రెండు కిడ్నీలు పాడైపోయాయి. రాజశేఖరరెడ్డి గారి దయ వల్ల ఆయన బతికాడు. ఇప్పుడు డయాలసిస్ చేయించాలంటే చంద్రబాబు ప్రభుత్వం ఆదుకునే పరిస్థితిలేదు.
జగన్: ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా మార్పు చేస్తాం. రూ.1000 వెయ్యి ఖర్చు దాటిన వైద్యాన్ని పూర్తిగా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తాం.
శ్రీనివాసరావు: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని తూర్పుకాపులు కరువు పరిస్థితుల్లో వందేళ్ల క్రితం ఏపీ, తెలంగాణలకు వలస వచ్చారు. ఆ మూడు జిల్లాల్లో కాకుండా మిగిలిన చోట బీసీలుగా గుర్తింపునకు నోచుకోకుండా ఇబ్బందులు పడుతున్నాం. వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమా అని ఈ రోజు ఏలూరులోనే పది మంది తూర్పు కాపుల పిల్లల డాక్టర్లుగా చదువుకుంటున్నారు. అందుకే ఏలూరు తూర్పుకాపు సంఘం భవనంలో వైఎస్ రాజశేఖరరెడ్డి నిలువెత్తు ఫొటో పెట్టుకున్నాం. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మా కులానికి చెందిన మంత్రి కళా వెంకట్రావుకు చెబితే మా సమస్య పరిష్కరించకపోగా ఆ మూడు జిల్లాకు వెళ్లి ఓబీసీ సర్టిఫికెట్ తెచ్చుకోవచ్చు కదా? అని సలహా ఇచ్చారన్నా. మా సమస్య పరిష్కరిస్తే మీ ఫొటోను మా ఇళ్లలో పెట్టుకుంటాం.
జగన్: ఎక్కడ పుట్టినా బీసీలో పుట్టిన వాడు ఎక్కడైనా బీసీగానే ఉంటాడు. ఈ జిల్లాలో సర్టిఫికెట్ ఇవ్వను, ఆ జిల్లాలో బీసీ సర్టిఫికెట్ ఇస్తానని అన్యాయం చేయడం దుర్మార్గమైన పని. మన ప్రభుత్వం వచ్చాక పూర్తిగా న్యాయం జరిగేలా చూస్తానని ఇదే జిల్లాలోని పాలకొల్లు సభలో చెప్పాను. ఓబీసీ విషయంలో మీరు, నేను కేంద్ర స్థాయిలో ప్రయత్నం చేద్దాం.
వీరన్న: రాష్ట్ర బీసీ జాబితాలో అనేక కులాలతోపాటు అత్యంత వెనుకబడి దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్న సుమారు 52 కులాలున్నాయి. హీనమైన కులాలుగా చూస్తూ అడుక్కుని తింటున్న సంచార జాతుల గురించి ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ఏదైనా అడిగితే చంద్రబాబు ప్రభుత్వం వాళ్లు జెండా మోశారా? వాళ్లు ఓటేశారా? అని అడిగే పరిస్థితి ఉంది. సంచార జాతుల వారిని ఆదుకోవాలి.
జగన్ : వారందరినీ అదుకుందాం.
Comments
Please login to add a commentAdd a comment