ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, కాళ్ల: వైఎస్ జగన్ పాదయాత్ర కోసం పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు ఎదురు చేస్తున్నారన్నారని వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మే 14న పశ్చిమగోదావరి జిల్లాలోకి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రవేశిస్తుందని ఆయన తెలిపారు. కాళ్ల మండలం పెద అమిరంలో జిల్లాకు చెందిన వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కన్వీనర్లతో గురువారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఏలూరు వద్ద వైఎస్ జగన్ 2000 కిలోమీటర్ల మైలు రాయిని దాటతారని వెల్లడించారు. మే 14 తేదీకి ఎంతో ప్రాముఖ్యత ఉందని, 15 సంవత్సరాల క్రితం అదేరోజున వైఎస్ రాజశేఖరరెడ్డి ఇదే పశ్చిమగోదావరి జిల్లా పాదయాత్రలో ఉన్నారని గుర్తు చేశారు. జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగుతుందని, 12 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు ఉంటాయని చెప్పారు.
లోకేష్‌కి డబుల్ బొనాంజా
ప్రత్యేక హోదా రావాలనే తనతో పాటు వైఎస్సార్ సీపీ ఎంపిలు రాజీనామా చేశారని అన్నారు. రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలు రాజీనామా చేసి ఉంటే కేంద్రంపై ఒత్తిడి పెరిగి ప్రత్యేక హోదా వచ్చేది కాదా అని చంద్రబాబును ప్రశ్నించారు. రాష్ట్రంలోనే అతి ముఖ్యంగా పశ్చిమగోదావరి ప్రజలను చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. నిరుద్యోగ భృతి పేరుతో చంద్రబాబు రాష్ట్రంలోని యువతను మోసం చేసి తన కుమారుడు నారా లోకేష్‌కి మాత్రం డబుల్ బొనాంజా ఇచ్చారని దుయ్యబట్టారు. ఇప్పటి పరిస్థితుల్లో బీజేపీతో ఎవరైనా పొత్తు పెట్టుకుంటారా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీతోనే ఎన్నికల తర్వాత కలుస్తామని మొదట నుంచి చెబుతున్నామని సుబ్బారెడ్డి గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment