
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘అన్నా.. ఎన్నికలప్పుడు చంద్రబాబు మాటలు నమ్మి ఆయనకు ఓట్లు వేసి గెలిపించాం. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా మా కష్టాలు తీరడం లేదు. ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగడం లేదు. మీరొస్తేనే మా బతుకులు బాగు పడతాయి’ అని వివిధ వర్గాల ప్రజలు ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి విన్నవించారు.
ప్రజా సంకల్ప యాత్ర 107వ రోజు గురువారం ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం నుంచి చీరాల నియోజకవర్గ శివారు వరకు కొనసాగింది. పాదయాత్రలో ప్రజలు ఓ వైపు తమ కష్టాలు చెప్పుకుంటుంటే మరో వైపు తమ కష్టాలు వినే నాయకుడు వచ్చాడంటూ జనం ఘన స్వాగతం పలికారు.
రాజన్న బిడ్డ వస్తున్నాడని తెలిసి పొలాల్లో పని చేస్తున్న రైతులు, కూలీలు ఆయన్ను చూసేందుకు ఆరాటపడ్డారు. తనను కలసిన అవ్వాతాతలు, అక్క చెల్లెళ్లు, అన్నదాతలు, అన్నదమ్ములను జగన్ ఆత్మీయంగా పలకరిస్తూ.. వారి కన్నీళ్లు తుడుస్తూ.. నేనున్నానని భరోసా ఇస్తూ ముందుకు సాగారు.