జగమెరుగని యాత్ర | YS Jagan Prajasankalpayatra at the end stage | Sakshi
Sakshi News home page

జగమెరుగని యాత్ర

Published Tue, Jan 8 2019 5:20 AM | Last Updated on Tue, Jan 8 2019 8:58 AM

YS Jagan Prajasankalpayatra at the end stage - Sakshi

సాక్షి, అమరావతి: మొత్తం 341 రోజులు.. 3,648 కిలోమీటర్లు.. ప్రతి పల్లెను పలుకరిస్తూ.. కోటి 25 లక్షల మందికి పైగా ప్రజలను ప్రత్యక్షంగా కలుస్తూ వారితో మమేకం...తెలుగు గడ్డపై కనీవినీ ఎరుగని ఇలాంటి పాదయాత్ర చరిత్రలో మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు...ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయలోని దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్మృతివనం (వైఎస్సార్‌ ఘాట్‌) నుంచి 2017 నవంబర్‌ 6వ తేదీన చేపట్టిన ‘ప్రజా సంకల్పయాత్ర’ ఈనెల 9వ తేదీన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనుంది. అప్పటికి ఈ అపూర్వ పాదయాత్ర 3,648 కిలోమీటర్ల మైలురాయిని చేరుకోనుంది. రాష్ట్రంలోని దాదాపు 2,516 గ్రామాల మీదుగా సాగే ప్రతిపక్ష నేత పాదయాత్రలో బుధవారం నాటికి 124 బహిరంగ సభలు (ఇప్పటికి 123 సభలు) పూర్తవుతాయి. చిన్న పట్టణాల్లో ఈ సభలకు కనిష్టంగా 30 వేల నుంచి గరిష్టంగా 50 వేల మంది వరకు జనం తరలివచ్చారు. ముఖ్య పట్టణాలు, నగరాల్లో జనం పోటెత్తడంతో 60 వేల నుంచి లక్ష మందికిపైగా హాజరైనట్లు అంచనా. ఈ లెక్కన బహిరంగ సభల్లోనే ఒక్కో సభకు సరాసరిన 60 వేల మంది హాజరైనట్లు భావించినా మొత్తం 74.40 లక్షల మంది హాజరైనట్టు లెక్క.  



కోట్ల మందిని కలుసుకుంటూ... 
ప్రతిపక్షనేత తన వెంట నడిచిన వారితోపాటు గ్రామాల్లో బారులు తీరిన ప్రజలను రోజుకు కనిష్టంగా 15 వేల మందిని స్వయంగా కలుసుకున్నారు. 341 రోజుల పాదయాత్రలో ప్రతిపక్ష నేతను కలిసే వారి సంఖ్య 51.15 లక్షలు అవుతోంది. మొత్తంగా చూస్తే 1.25 కోట్ల మందికిపైగా ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని వారితో మమేకమై ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాగించిన ఈ పాదయాత్ర ఓ అరుదైన ఘట్టంగా చరిత్రపుటల్లోకెక్కనుంది. మరోపక్క ఆత్మీయ సమావేశాలకూ వేలసంఖ్యలో ఆయా వర్గాల ప్రజలు హాజరయ్యారు. వీరితో పాటు ప్రసారమాధ్యమాల ద్వారా పాదయాత్ర, బహిరంగ సభలను వీక్షించిన దేశ విదేశాల్లోని కోట్లాది తెలుగు ప్రజలందరినీ కలుపుకొంటే ఈ సంఖ్య భారీగానే ఉండనుంది.  

పోటెత్తిన జనసంద్రం.. 
ముగింపురోజు నాటికి పాదయాత్ర గ్రామాల సంఖ్య 2,516కి  చేరనుంది. 231 మండల కేంద్రాలు, 54 మున్సిపాలిటీలు, 8 నగరాలు, మహానగరాల మీదుగా సాగిన జగన్‌ పాదయాత్రకు జనం అడుగడుగునా వెల్లువెత్తారు. ప్రతిపక్షనేతను కలసి  సమస్యలు చెప్పుకునేందుకు, టీడీపీ సర్కారు అరాచకాలు, అక్రమాలు, అవినీతిని వివరించేందుకు ప్రతిపక్ష నేతను కలిసేందుకు బారులుతీరారు. ఫొటోలు దిగేందుకు, సెల్ఫీలు తీసుకొనేందుకు పోటీపడ్డారు. వృద్ధులు, యువత, మహిళలు, విద్యార్ధులు, యువత, నిరుద్యోగులు, ఉద్యోగులు, చిరుద్యోగులు, వివిధ సామాజికవర్గాల ప్రతినిధులు, కర్షకులు, కార్మికులు ఇలా అన్ని వర్గాల ప్రజలు వైఎస్‌ జగన్‌ను కలిసేందుకు కదలి వచ్చారు. పాదయాత్ర గ్రామాల మీదుగా సాగినప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు, రైతు కూలీలు పరుగు పరుగున వచ్చిన దృశ్యాలు అనేకం. పట్టణాలు, నగరాల్లో ప్రతిపక్ష నేతను అనుసరిస్తూ పాదయాత్రలో మమేకమైన వారి సంఖ్య వేలల్లోనే ఉంది. ప్రతిపక్ష నేతను కలిసేందుకు రోడ్ల వెంబడి బారులు తీరారు. మేడలు, మిద్దెలు ఎక్కి వైఎస్‌ జగన్‌ను చూసేందుకు, ఆయన ప్రసంగాన్ని వినేందుకు జనం పోటెత్తారు. తమ ప్రియతమ నాయకుడు,  ప్రతిపక్ష నేతను కళ్లారా తిలకించి ఆయన ప్రసంగాన్ని వినేందుకు పోటెత్తిన జనంతో బహిరంగ సభలు జనసంద్రంలా మారాయి. పాదయాత్ర గుంటూరు జిల్లా నుంచి కృష్ణా జిల్లాలోకి ప్రవేశించినప్పుడు కనకదుర్గమ్మ వారధి జనప్రవాహంతో నిండిపోయింది. అలాగే తూర్పు గోదావరి జిల్లాలోకి యాత్ర చేరుకున్నప్పుడు రాజమండ్రి వద్ద  గోదావరిపై ఉన్న రైల్‌ కమ్‌ రోడ్‌ బ్రిడ్జి జనవారధిగా మారింది. విశాఖలో కంచరపాలెం వద్ద జరిగిన సభ నగర చరిత్రలోనే మైలురాయిగా నిలిచింది. 

రాజకీయ అజెండాగా మారిన ‘ప్రత్యేక హోదా’ 
వైఎస్‌ జగన్‌ పాదయాత్ర రాష్ట్రంలోనే కాకుండా జాతీయస్థాయిలోనూ ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. పలు సమస్యలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజల్లో భరోసా, స్థైర్యాన్ని నింపుతూ సాగిన ఈ పాదయాత్ర అధికార టీడీపీని బెంబేలెత్తించగా బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల్లో గుబులు రేపింది. రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో వేడిని రగిల్చింది. ప్రత్యేక హోదా అంశాన్ని రాజకీయ అజెండాగా మార్చి రాష్ట్ర ప్రజల ఆశలకు కొత్త ఊపిరులూదింది. ప్రజలందరూ ప్రత్యేక హోదాపైనే ఆశలు పెట్టుకోగా అదే హామీతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు స్వార్థ ప్రయోజనాలు, ఓటుకు కోట్లు కేసు భయంతో హోదాను కేంద్రానికి తాకట్టుపెట్టారు. అయితే దాదాపు ఐదేళ్ల పాటు నిరంతర పోరాటం ద్వారా ప్రజలను జాగృతం చేసి ప్రత్యేక హోదా నినాదాన్ని వైఎస్‌ జగన్‌ సజీవంగా ఉంచారు. ప్రత్యేక హోదా సాధన కోసం తమ ఎంపీలతో రాజీనామా చేయించి ఈ అంశాన్ని ప్రధాన అజెండాగా మార్చారు. హోదాపై పలుమార్లు మాటమార్చి ‘యూటర్న్‌’ తీసుకున్న చంద్రబాబు ఎన్నికలు సమీపించడంతో గత్యంతరం లేక ప్రత్యేక హోదా బాట పట్టారు. వైఎస్సార్‌ సీపీ ఎంపీల రాజీనామాలతో చంద్రబాబు మరోదారి లేక కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి ఎన్డీఏ నుంచి వైదొలగారు. 

నవరత్నాలతో భరోసా.. 
టీడీపీ పాలనలో విచ్చలవిడిగా సాగుతున్న అరాచకాలు, అక్రమాలు, అవినీతి, దుర్మార్గాల గురించి పాదయాత్ర పొడవునా ప్రజలు ప్రతిపక్షనేతతో మొరపెట్టుకున్నారు. పెన్షన్లు, ఇళ్ల మంజూరులో జన్మభూమి కమిటీల దందాలు, టీడీపీ నేతల భూ కబ్జాలు, ఇసుక దందాలు, అక్రమంగా గనుల తవ్వకాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. టీడీపీ ప్రజాకంటక పాలన నుంచి తమను ఆదుకోవాలని ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, అసంఘటిత కార్మికులు కోరారు.  వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో తమ పార్టీ అధికారంలోకి రాగానే చేపట్టనున్న పలు కార్యక్రమాల గురించి పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభల్లో వైఎస్‌ జగన్‌ ప్రస్తావించారు. వైఎస్సార్‌ సీపీ ప్రకటించిన నవరత్నాల హామీ ద్వారా ప్రజలకు భరోసా కల్పించారు. ఇవే కాకుండా పాదయాత్రలో తన దృష్టికి వచ్చే సమస్యలపైనా తాము అధికారంలోకి రాగానే ఎలాంటి చర్యలు తీసుకుంటామో జగన్‌ స్పష్టంగా వివరిస్తున్నారు. ప్రతి సభలోనూ ప్రతిపక్షనేత ప్రసంగం ప్రజలను ఆకట్టుకోవడంతోపాటు సర్కారు అరాచకాలపై లోతుగా ఆలోచించేలా సాగింది. ఇక వివిధ కులాలు, సామాజిక వర్గాల ప్రజలతో వైఎస్‌ జగన్‌ నిర్వహించిన ఆత్మీయ సమావేశాలు వారికి ఎంతో భరోసాను కల్పించాయి. తూర్పు గోదావరి జిల్లాలో పర్యటన సమయంలో కాపుల రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంతో పాటు వారిని ఆదుకునేందుకు కాపు కార్పొరేషన్‌కు ఏటా రూ.10 వేల కోట్ల నిధిని సమకూరుస్తామని ప్రతిపక్ష నేత ప్రకటన చేశారు. 

స్పష్టమైన కార్యాచరణ 
పాదయాత్ర పొడవునా అనాథలు, అణగారిన వర్గాలను ఓదారుస్తూ వైఎస్‌ జగన్‌ ముందుకు కదిలారు. నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానం రద్దు, ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ, మెగా డీఎస్సీ తదితర హామీలతో భరోసా కల్పించారు. వివిధ కులాల సంక్షేమానికి ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ డెయిరీలు, చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ, తిత్లీ తుపాను బాధితులకు పరిహారం మొత్తాన్ని చెల్లిస్తామని వైఎస్‌ జగన్‌ స్పష్టమైన ప్రకటన చేసి వారికి స్థైర్యాన్ని కల్పించారు. 

ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం 
పాదయాత్ర సందర్భంగా విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో పర్యటన అనంతరం హైదరాబాద్‌కు పయనమైన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయత్నం రాష్ట్ర ప్రజలనే కాకుండా జాతీయ స్థాయిలోనూ అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. టీడీపీ నేత హర్షవర్థన్‌ చౌదరి నిర్వహిస్తున్న క్యాంటీన్‌లో పనిచేసే దుండగుడు ఎయిర్‌పోర్టు వీఐపీ లాంజ్‌లో పదునైన ఆయుధంతో హత్యాయత్నానికి పాల్పడగా వైఎస్‌ జగన్‌ అప్రమత్తమై పక్కకు తప్పుకోవడంతో ఆయన భుజంపై కత్తి దిగబడింది. సంఘటన జరిగిన గంటల వ్యవధిలోనే డీజీపీ ఆర్పీ ఠాకూర్,  ముఖ్యమంత్రి చంద్రబాబు కేసు దర్యాప్తును నీరుగార్చేలా వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. 
 
ముగింపు సభకు భారీ ఏర్పాట్లు   
ఇచ్ఛాపురం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి :  జననేత జగన్‌ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ నెల 9వతేదీన  ఇచ్ఛాపురం ఆర్టీసీ పాత బస్టాండ్‌ వద్ద జరిగే భారీ బహిరంగ సభకు పెద్దఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. పాదయాత్రలో ఇప్పటికే ఇచ్ఛాపురం సమీపంలోకి వచ్చిన జగన్‌ కొత్త కొజ్జీరియా గ్రామం నుంచి 9వ తేదీ ఉదయం తన పాదయాత్రను ప్రారంభించి లొద్దపుట్టి గ్రామం వద్ద మధ్యాహ్న భోజన విరామం కోసం ఆగుతారు. అక్కడి నుంచి మధ్యాహ్న విరామం తరువాత జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న విజయసంకల్ప స్తూపం వద్దకు బయలు దేరుతారు. తన యాత్ర ముగింపు సూచకంగా ఆకర్షణీయంగా నిర్మించిన ఈ స్తూపాన్ని జగన్‌ ఆవిష్కరించి..ఆ తరువాత అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలోని ఇచ్ఛాపురం పట్టణంలోకి అడుగుపెట్టి బహిరంగ సభాస్థలికి చేరుకుంటారు. తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేసిన ప్రజాప్రస్థానం పాదయాత్ర విజయస్తూపం, తన సోదరి షర్మిల చేసిన మరో ప్రజాప్రస్థానం స్తూపం మీదుగా జగన్‌ బహిరంగ సభకు వెళతారు. అక్కడితో ఆయన చారిత్రాత్మకమైన పాదయాత్ర ముగుస్తుంది. బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ సాక్షితో మాట్లాడుతూ 341వ రోజు యాత్ర ముగింపు రోజున జగన్‌ సుమారు 9 కిలోమీటర్ల మేరకు నడిచే అవకాశం ఉందన్నారు. ఇడుపులపాయలోని వైఎస్‌ సమాధి వద్ద తొలి అడుగు పడిన జగన్‌ పాదయాత్రకు చివరి అడుగు ఇచ్ఛాపురం బస్టాండులో పూర్తవుతుందన్నారు. జగన్‌ యాత్ర ముగింపు అపూర్వ ఘట్టాన్ని కళ్ళారా చూసేందుకు, ఆయన సందేశం వినేందుకు ఆసక్తితో ప్రజలు, పార్టీ శ్రేణులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉందని ఆయన వివరించారు. రాష్ట్ర పార్టీ ప్రముఖ నేతలంతా హాజరవుతున్నట్లు రఘురామ్‌ తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ ప్రారంభం అవుతుందన్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వివరించారు. 

విజయసంకల్పం స్తూపానికి తుది మెరుగులు 
మరో రెండు రోజుల్లో యాత్ర ముగుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం విజయసంకల్పం స్తూపానికి రాత్రింబవళ్లు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇప్పటికే స్తూపంపై వైఎస్‌ చిత్రాలను, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోలను అమర్చారు. నిర్మాణం పటిష్టంగా జరుగుతోందని.. మొత్తం మీద దీన్నొక దర్శనీయమైన స్థలంగా తీర్చి దిద్దేందుకు నిర్వాహకులు కృషిచేస్తున్నారని రఘురామ్‌ వివరించారు.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement