పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లులో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతున్న వైఎస్ జగన్
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి :
‘ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరి రూ.20 కోట్లు, రూ.30 కోట్లకు కొనుగోలు చేయడమే కాక, నిబంధనలను తుంగలో తొక్కి మంత్రుల్ని చేస్తారా? వారిపై అనర్హత వేటు పడకుండా వ్యవస్థలను మేనేజ్ చేస్తారా? మీకు దమ్ము, ధైర్యం ఉంటే వాళ్లను అనర్హులుగా ప్రకటించండి. సత్తా ఉంటే మీ పార్టీ గుర్తుపై పోటీ చేయించి గెలిపించుకోండి. ఒక్క హామీ నెరవేర్చని మీకు జనం ఓటు వేస్తారన్న నమ్మకం లేదు. కాబట్టే వారిని ఎన్నికల్లో గెలిపించుకునే సాహసం చేయని అసమర్థ ముఖ్యమంత్రి మీరు’ అంటూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు.
ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మంగళవారం 105వ రోజు ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లు గ్రామంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అబద్ధాలు, మోసాలు చేసే వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా కావాలా.. అని ప్రశ్నించారు. మనందరి ప్రభుత్వం రాగానే రైతులకు తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఏ ఒక్క రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రానివ్వనని హామీ ఇచ్చారు. ప్రతి రైతుకూ ఉచితంగా బోరు వేయిస్తామన్నారు. ఈ సభలో జగన్ ఇంకా ఏమన్నారంటే..
పైనుంచి కిందిదాకా అవినీతే
నాలుగేళ్ల పాలనలో అబద్ధాలు, మోసాలు, విచ్చలవిడిగా చట్టాలను ఉల్లంఘన చేయడం చూశాం. పైస్థాయి నుంచి కింది వరకు అవినీతి అన్నది విచ్చల విడిగా జరుగుతోంది. పైన చంద్రబాబు మట్టి మొదలు.. ఇసుక, మద్యం, బొగ్గు, కరెంటు కొనుగోలు, కాంట్రాక్టులు, రాజధాని భూములు, గుడి భూములను కూడా వదిలిపెట్టడం లేదు. అవినీతి డబ్బుతో తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు లంచం ఇస్తూ ఆడియో, వీడియో టేపులతో దొరికిపోయారు. మాములుగా ఎవరైనా ఉద్యోగి లంచం తీసుకుంటూ పట్టుబడితే ఆ ఉద్యోగిని సస్పెండ్ చేస్తారు.
మన రాష్ట్ర ముఖ్యమంత్రి అడ్డగోలుగా దొరికిపోయినా ఆయన రాజీనామా చేయడు.. ఆయన్ను అరెస్టు చేయరు. అడ్డగోలుగా చట్టాలను తుంగలో తొక్కుతున్నారు. 23 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొనుగోలు చేశారు. వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకుండా కాపాడుతున్నారు. మరో ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయి కాబట్టి మీ అందర్నీ అడుగుతున్నా.. మోసాలు, అబద్ధాలు చెప్పే వ్యక్తి సీఎం కావాలా? చెడిపో యిన ఈ రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ, విశ్వసనీయత రావాలి. అది జగన్ ఒక్కడి వల్లే కాదు, మీ అందరి తోడు, దీవెనలు కావాలి.
పొరపాటున ఈ చంద్రబాబును క్షమిస్తే రేపు పొద్దున ఏం జరుగుతుందో తెలుసా? చిన్న చిన్న అబద్ధాలు చెబితే నమ్మరని పెద్దవి చెబుతారు. ప్రతి ఒక్కరికి కేజీ బంగారం, ఇంటికో బెంజికారు అంటారు. ఇదీ నమ్మరని తెలిసి ప్రతి ఇంటికీ ఒక మనిషిని పంపించి రూ.3 వేలు డబ్బు కూడా ఇస్తామంటారు. డబ్బులు ఇస్తే వద్దూ అనొద్దు. రూ.3 వేలు కాకుండా రూ.5 వేలు గుంజండి. అదంతా మన డబ్బే.. మన జేబుల్లోంచి దోచేసిన డబ్బే. ఓటు వేసేటప్పుడు మాత్రం మీ మనస్సాక్షి ప్రకారం ఓటు వేయండి. మోసాలు చేసేవారిని, అబద్ధాలు చెప్పేవారిని బంగాళఖాతంలో కలపండి’’ అని జగన్ పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment