బాబు కుయుక్తులకు మోసపోవద్దు | Ys Jagan promises jobs, support to farmers | Sakshi
Sakshi News home page

బాబు కుయుక్తులకు మోసపోవద్దు

Published Fri, Feb 8 2019 2:12 AM | Last Updated on Fri, Feb 8 2019 2:10 PM

Ys Jagan promises jobs, support to farmers - Sakshi

చంద్రబాబు ప్రజలకు చెప్పిందేదిచేయలేదు. చేసిందేమిటో తెలుసా? రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచేయడం.ఆ దోచిన సొమ్ములో నుంచి ఆ పెద్ద మనిషి బిస్కెట్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాడు. ఓటుకు రూ.2 వేలు,
రూ.3 వేలు ఇచ్చే కార్యక్రమం చేస్తాడు. మీరందరూ అప్రమత్తంగా ఉండండి. – ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌


►ఎన్నికలు దగ్గరపడే కొద్దీ చంద్రబాబు ఎల్లో మీడియాను వాడుకుని లగడపాటితో దొంగ సర్వేలు కూడా చేయిస్తాడని మీకు చెబుతున్నా. ఎన్నికలు దగ్గరకొచ్చేసరికి ఏమేం చేయాలో అన్నీ చేస్తాడు. చంద్రబాబు గురించి నేను చెప్పాల్సిన పని లేదు. వాటిన్నింటినీ తిప్పికొట్టేందుకు మీరు సిద్ధంగా ఉండాలి.  
 
► రెండు రోజుల కిందట విడుదలైన ఈయన గారి బడ్జెట్‌ సినిమా సూపర్‌ డూపర్‌ ప్లాప్‌.  ఎన్నికల్లో ప్రజలు ఎవరినైతే ఆశీర్వదిస్తారో వారు బడ్జెట్‌ ప్రవేశ పెడతారు. కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు తన హయాంలోకి రాని ఆరవ బడ్జెట్‌ను రూ.2.26 లక్షల కోట్లతో ప్రవేశపెట్టి ప్రజల చెవుల్లో పూలు పెట్టారు. ఈయన తీరు చూస్తుంటే మునుపటి కొకరు.. తల్లికి అన్నం పెట్టని వాడు అవసరం పడేసరికి చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట.. అన్నట్లుంది.    

కడప నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి :  ఓటమి భయంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలకు అనేక తాయిలాలు ప్రకటిస్తున్నారని, ఆయన కుయుక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పుడు చంద్రబాబు ప్రకటిస్తున్నవన్నీ ఇదివరకే తాను ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఎన్నికల సమర శంఖారావం కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన కడప నగరంలోని మున్సిపల్‌ స్టేడియంలో పార్టీ బూత్‌ కమిటీ సభ్యులు, కన్వీనర్ల సభలో పాల్గొన్నారు. చంద్రబాబు అన్యాయమైన రణనీతిని,దుర్నీతిని ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఒక్కొక్క స్కీమ్‌ను ప్రకటిస్తున్నారని అన్నారు. చంద్రబాబు మోసపూరిత విధానాలపై ప్రజలను చైతన్య వంతులను చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సభ్యుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ సభలో జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

మీరంతా అప్రమత్తంగా ఉండాలి 
‘‘మనమంతా చంద్రబాబు అన్యాయమైన రణనీతిని చూశాం. చంద్రబాబు నాయుడు ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఏమేం చేస్తున్నారో.. ఏమేం చేయబోతున్నారో మనందరికీ తెలుస్తోంది. గ్రామాలలో ఓటరు లిస్టులలో పేర్లను తొలగిస్తున్నారు. దొంగ సర్వేలు చేస్తున్నారు. దొంగ సర్వేలతో వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేసే వారిని వెతుకుతున్నారు. వెతికి తొలగించాలని ఆరాట పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరందరూ అప్రమత్తంగా ఉండాలి. గ్రామాల్లో ఓటరు లిస్టుల్లో పేర్లు చూడండి. తొలగించిన పేర్లు వెంటనే నమోదయ్యేలా ఫారం–6ని పూర్తి చేసి అందించండి. మీరందరూ ఆ పనిపై ప్రత్యేక దృష్టి పెట్టండి. ఎన్నికలు వచ్చేసరికి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు డబ్బులు పంపకం చేస్తారు. మూటలు, మూటలు డబ్బులు పంపిస్తారు. ఓటరు లిస్టులో మన పేరు, మన వాళ్లందరి పేర్లు ఉండేలా చూసుకోవాలి. రెండో వైపు చంద్రబాబు రెండు ఓట్లు చొప్పున ఎక్కిస్తున్నారు. మనం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. అక్షరాల 59,18,000 దొంగ ఓట్లు ఉన్నాయని ఫిర్యాదు చేశాను. 

ఎన్నికల వేళ రోజుకో స్కీమ్‌ 
ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి కాబట్టి సీఎం చంద్రబాబు రోజుకొక స్కీమ్‌ ప్రకటిస్తారు. చంద్రబాబు నాటకాల గురించి మీకు తెలుసు. అబద్ధాలు చెప్పడంలో ఆయన్ను మించిన వారు లేరు. రోజుకొక సినిమా చూపించేస్తాడు. చంద్రబాబు చెప్పే అబద్ధాలు, మోసాలన్నింటికీ ఆయన ఎల్లో మీడియా అండగా ఉంటుంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు, ఈటీవీ, ఏబీఎన్, టీవీ–5 చానళ్లు ఉన్నాయి. ఇవే కాదు ఇంకా ఏమేం ఉన్నాయో నాకంటే మీకే బాగా తెలుసు. ఇవాళ మనం యుద్ధం చేసేది ఒక్క చంద్రబాబుతోనే కాదు...ఆయన్ను మోస్తున్న ఎల్లో మీడియాతో కూడా యుద్ధం చేయబోతున్నాం. అందరికీ ఒకటే చెప్పండి. చంద్రబాబు మాటలను నమ్మవద్దని చెప్పండి. ఐదేళ్ల క్రితం చంద్రబాబుకు ఓటేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. 2014లో మోసం చేసిన ఆయన మళ్లీ ఎన్నికలు వస్తున్న తరుణంలో మరో ఘరానా మోసం చేయడానికి సిద్ధమవుతున్నాడు. 

అందరికీ చెప్పండి.. 
బాబు ఇచ్చే రూ.2 వేలు, రూ.3 వేలకు ఏ ఒక్కరూ మోసపోవద్దని ప్రతి అక్కకు, చెల్లికి, అవ్వకు, తాతకు, సోదరుడికి, స్నేహితుడికి చెప్పండి. అమ్మా.. అన్నొస్తాడు.. అక్కా అన్నొస్తాడు.. చెల్లీ అన్నొస్తాడు.. అన్న వచ్చిన వెంటనే మన పిల్లలను బడికి పంపిస్తాడు.. సంవత్సరానికి రూ.15 వేలు ఇస్తాడని చెప్పండి. ప్రతి సంవత్సరం మే నెలలో రూ.12,500 రైతన్న చేతిలో పెట్టబోతున్నానని ప్రతి అన్నకు చెప్పండి. 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కలకు రూ.75 వేలు నాలుగేళ్లలో ఉచితంగా ఇస్తారని సగర్వంగా చెప్పండి. మహిళా సంఘాలకు సంబంధించిన డ్వాక్రా రుణాలన్నింటినీ ఎన్నికల నాటికి ఎంత ఉంటే అంత నాలుగేళ్లలో మీ చేతికి ఇస్తారని చెప్పండి. వడ్డీ లేకుండా రుణాలు ఇస్తారని చెప్పండి. ప్రతి అవ్వకు చెప్పండి.. ప్రతి తాతకు చెప్పండి.. చంద్రబాబు ఇస్తున్న రూ.2 వేలను చూసి మోసపోవద్దని. అన్న అంతకుమునుపే అధికారంలోకి వస్తే రూ.2 వేలు పింఛన్‌ ఇస్తానని చెప్పడంతోనే చంద్రబాబు భయపడి ఎన్నికలకు రెండు నెలలు ముందు ఇస్తున్నాడని చెప్పండి. అన్న ముఖ్యమంత్రి కాగానే రూ.2 వేల నుంచి పెంచుకుంటూ పోయి రూ.3 వేలు చేస్తానని చెప్పండి. పిల్లలను చదువుకునేలా చేసి ఇంజనీర్లను, డాక్టర్లను చేసే బాధ్యత అన్న తీసుకుంటారని చెప్పండి. ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోలేక ఇబ్బందులు పడే పేద రోగులకు కేవలం వెయ్యి రూపాయలు దాటితే ఎన్ని లక్షలైనా అన్నే భరిస్తాడని చెప్పండి. నవరత్నాల్లో ఉన్న ప్రతి పథకాన్ని ప్రజలకు వివరించండి.   

2014లో చెప్పిందేదీ చెయ్యలేదు 
చంద్రబాబు 2014 ఎన్నికలప్పుడు ప్రజలకు అది చేస్తాను.. ఇది చేస్తాను.. అని హామీ ఇచ్చి ఎన్నికలప్పుడు తొలి సినిమా చూపించాడు. ఆ సినిమాలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులను మోసం చేశారు. బెల్ట్‌ షాపులు తొలగిస్తానన్నాడు.  కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులందరినీ క్రమబద్దీకరిస్తానన్నాడు. ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాలకు ఏటా నోటిఫికేషన్‌ ఇస్తానన్నాడు. ప్రతి ఇంటికి 20 లీటర్ల మినరల్‌ వాటర్‌ రూ.2కే ఇస్తానన్నాడు. మూడేళ్లలో పోలవరం పూర్తి చేస్తానన్నాడు. ఏవోవో చెప్పాడు. చివరికి ఏమీ చేయలేదు. మ్యానిఫెస్టోలో ఒక్కో కులానికి ఒక్కొక్క పేజీ కేటాయించాడు. తుదకు మోసం చేశాడు. చివరికి కాపులను బీసీలుగా చేస్తానని చెప్పి మోసం చేస్తున్నాడు.  

చంద్రబాబు రెండో సినిమా 
ఎన్నికలకు ఆరు నెలల ముందు.. మూడు నెలల కోసమనే సినిమా రెండోది. ఇది ఈ మధ్యకాలంలోనే తీశారు.  నాలుగేళ్లు బీజేపీతో కలిసి కాపురం చేశాడు. ఇప్పుడేమో పోరాటం చేస్తున్నట్లు నటిస్తున్నాడు. పోలవరం ప్రాజెక్టు కట్టకుండానే.. పునాది రాయితోనే జాతికి అంకితం చేసి చరిత్ర సృష్టించానంటాడు. ప్రత్యేక హోదాపై ఏం మాట్లాడ లేదు. ఇప్పుడు ఎన్నికలకు ఆరు నెలల ముందు నల్లచొక్కా వేసుకుంటాడు. తానే ధర్మపోరాటం చేస్తున్నానంటాడు. డ్వాక్రా అక్కా చెల్లెమ్మల రుణమాఫీ ఊసే ఎత్తడు. ఈ రుణాలు బాబు ముఖ్యమంత్రి కాకమునుపు రూ.14 వేల కోట్లు ఉంటే, ఇప్పటికి వడ్డీలపై వడ్డీలు పడి తడిసి మోపెడై అక్షరాల రూ.25 వేల కోట్లకు చేరాయి. అయినా చంద్రబాబు తాను చేసిన తప్పును ఒప్పుకోడు. పైగా డ్రామాకు తెర తీస్తాడు. ఆ డ్రామా పేరు పసుపు – కుంకుమ.  

ఈ సినిమా గురించి అందరికీ చెప్పండి.. 
ఈ పెద్దమనిషి చంద్రబాబు 2014కు ముందు బీసీ డిక్లరేషన్‌ ప్రకటించాడు. అందుకు సంబంధించి మ్యానిఫెస్టోలో బీసీ కులాలకు సంబంధించి 119 హామీలు ఇచ్చి వాటన్నింటినీ విస్మరించాడు.  అంగన్‌వాడీలకు, ఆశ వర్కర్లకు, వీఆర్‌ఏలకు, హోం గార్డులకు జీతాలు పెంచాలనే ఆలోచన చేయడు. జగన్‌ పెంచుతాననేసరికి ఇప్పుడు వీళ్లంతా గుర్తుకొచ్చారు. బాబు తీరు చూస్తుంటే 57 నెలలు కడుపు మాడ్చి ఎన్నికలకు ముందు మూడు నెలలు అన్నం పెట్టే వారిని ఏమనాలో మిమ్మల్నే అడుగుతున్నా. చెప్పండి.. అన్నా అనలా? లేక దున్నా అనలా? 1983లో ఎన్నికలకు ఎనిమిది నెలల ముందు ఎన్టీఆర్‌ ప్రజల్లోకి వచ్చారు. ఎన్నికల్లో తనను గెలిపిస్తే రూ.2కు కిలో బియ్యం ఇస్తానని ప్రకటించారు. దాంతో ఎన్టీఆర్‌ గ్రాఫ్‌ పెరిగింది. అప్పటి సీఎం కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఆ వెంటనే రూ.1.90కే కిలో బియ్యం అన్నారు. ఆయన మాటలను ప్రజలు విశ్వసించలేదు. ఇవాళ చంద్రబాబు చేస్తున్నది కూడా ఇదే. ఒక రాక్షసుడు పంచభక్ష పరమాన్నాలు పెట్టి రమ్మంటే వెళతామా? ’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.   
ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు సి.రామచంద్రయ్య, సజ్జల రామక్రిష్ణారెడ్డి, మాజీ మంత్రులు వైఎస్‌ వివేకానందరెడ్డి, డా. ఖలీల్‌బాషా, మాజీ ఎంపీలు పి.వీ మిథున్‌రెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డి, జెడ్పీ ఛైర్మెన్‌ గూడూరు రవి, ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాల్‌రెడ్డి, డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యేలు కొరుముట్ల శ్రీనివాసులు, షేక్‌ బెపారి అంజద్‌బాషా, శెట్టిపల్లి రఘురామిరెడ్డి, పి.రవీంద్రనాథ్‌రెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, మేయర్‌ సురేష్‌బాబు, రాజంపేట పార్లమెంటరీ జిల్లా అ««ధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు పోచంరెడ్డి సుబ్బారెడ్డి, ముండ్ల వెంకటశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

కడప గడ్డ నాకు చాలా ఇచ్చింది  
‘ఈ గడ్డ (కడప) నాకు, నా కుటుంబానికి చాలా ఇచ్చింది. మూడు దశాబ్దాలుగా ఈ జిల్లా వాసులు రాజకీయంగా మా వెన్నంటే ఉన్నారు. 1978లో నాన్నగారు మొట్ట మొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. 2009లో చనిపోయారు. 31 సంవత్సరాలపాటు నాన్నగారిని ఈ జిల్లా గుండెల్లో పెట్టుకుని చూసుకుంది. నాన్నగారు తన జీవితంలో 5 సంవత్సరాల మూడు నెలలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2009లో నాన్న చనిపోయినపుడు చాలా బాధనిపించింది. ఆ బాధలో నుంచి బయట పడటానికి నాకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? మీ గుండె చప్పుడు నుంచే వచ్చింది. నాన్న ఎక్కడికీ పోలేదు.. చనిపోతూ ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడని ధైర్యం వచ్చింది. నాన్న గారు పోయిన తర్వాత జగన్‌ అనే నన్ను కొడుకుగా ఆదరించింది ఈ జిల్లా. మీరు ఆదరించారు కాబట్టే, దీవించి పంపారు కాబట్టే రాష్ట్రం వైపు నేను కన్నెత్తి చూడగలుగుతున్నా. ఈ జిల్లాలో మరీ ముఖ్యంగా గ్రామ గ్రామాన.. అన్నా.. తోడుగా మేమున్నామంటూ ఎన్నికల బాధ్యతలు పూర్తిగా తామే తీసుకుంటున్నందుకు బూత్‌ కమిటీలకు.. ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అన్న, ప్రతి సోదరుడు, స్నేహితునికి, అవ్వ తాతలందరికీ శిరస్సు వంచి కృతజ్ఞతలు చెబుతున్నా. 

మీకు తగిలిన దెబ్బ నా గుండెకూ తగిలింది..
పదేళ్లుగా మీరంతా ఎలా ఉన్నారో నాకు తెలుసు. ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసు. అవమానాలు సహించారు. కేసులు భరించారు. లాఠీ దెబ్బలు తిన్నారు. కొందరు ఆస్తులు పోగొట్టుకున్నారు. మరికొందరు కుటుంబ సభ్యుల ప్రాణాలు సైతం పోగొట్టుకోవడం చూశాను. ఈ పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం. దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. మీకు తగిలిన ప్రతి దెబ్బ నా గుండెకు కూడా తగిలిందన్న విషయాన్ని కచ్చితంగా చెబుతున్నా. రేపు పొద్దున దేవుడు, ప్రజలు ఆశీర్వాదిస్తారన్న నమ్మకం నాకుంది. నేను మీకందరికీ ఒకే మాట చెబుతున్నాను. మీ బాగోగులన్నీ నేను చూసుకుంటానని గట్టిగా చెబుతున్నా. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా మిమ్మల్ని పైకి తీసుకొస్తా. అన్ని రాజకీయ పార్టీల్లో కార్యకర్తలు అంటారు.. కానీ వైఎస్సార్‌ సీపీలో ఉన్న మీరంతా నా కుటుంబ సభ్యులని చెబుతాను. రేపు మనందరి ప్రభుత్వం వచ్చాక కులం, మతం, ప్రాంతం, వర్గం, రాజకీయాలు, పార్టీలు చూడకుండా ప్రతి సంక్షేమ పథకం ప్రతి పేద వాడికి అందించడంలో మీ అందరి పాత్ర క్రియాశీలకంగా ఉంటుంది. ఫిబ్రవరి నెలాఖరులో ఎన్నికల షెడ్యూల్‌ వస్తుందంటున్నారు. వైఎస్సార్‌ సీపీని గెలిపించే బాధ్యత మీ భుజస్కంధాలపై ఉంది.

రాజధాని కడుతున్నట్లుగా బిల్డప్‌ 
ఐదు బడ్జెట్‌లు అయిపోయాయి. ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఆరవ బడ్జెట్‌ ప్రవేశ పెట్టాడు. రానున్న కాలంలో మనకు కాని ఆరవ బడ్జెట్‌ను అధికారం లేని బడ్జెట్‌ను ప్రవేశ పెట్టి ఏమంటాడో తెలుసా? ఐదు వేల కోట్లు రైతుల కోసం కేటాయిస్తున్నానంటాడు.  రైతులకు వడ్డీలు కూడా సరిపోని విధంగా చేసిన రైతుల రుణమాఫీ విషయంలో నాలుగు, ఐదు విడతల కింద ఇచ్చిన చెక్కులు బౌన్స్‌ అవుతున్నాయని రైతులు చెబుతున్నారు. అందుకు సంబంధించే రూ.8,200 కోట్లు బకాయిలు ఉన్నా పెద్ద మనిషి పట్టించుకోలేదు. రాజధాని నగరమంటాడు. వేల ఎకరాల భూములు తనకు నచ్చిన వాళ్లకు, బినామీలకు, అనుయాయులకు ఇష్టమొచ్చిన రేట్లకు అమ్ముకుంటాడు. రాజధాని కట్టడు.. కడుతున్నట్లుగా బిల్డప్‌ ఇస్తాడు. నాలుగున్నరేళ్లుగా పిల్లలకు జాబు ఇస్తానన్నాడు జాడలేదు. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు లేవు. రాష్ట్రం విడిపోయేటప్పుడు 1.42 లక్షల జాబులు ఖాళీగా ఉన్నాయి. తర్వాత కాలంలో రిటైర్డ్‌ అయిన వారు 90 వేలకు చేరారు. మొత్తంగా 2.40 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్నా ఎవరికీ ఇవ్వడు. నిరుద్యోగ భృతి రూ.2 వేలు లేదు. ఎన్నికలకు ముందు మాత్రం రూ.వెయ్యి ఇస్తాడు. కోటి 70 లక్షల ఇళ్లకు భృతి ఇవ్వాల్సి ఉంటే.. తగ్గించి తగ్గించి 3 లక్షలకు తెచ్చాడు. నాలుగున్నరేళ్లు అధికారంలో ఉన్నా పెన్షన్లు పెంచాలన్న ఆలోచన రాదు. మనం అధికారంలోకి వస్తే పెంచుతామన్న భయంతో మూడు నెలల ముందు రూ.2 వేలు ఇచ్చేస్తామని చెబుతాడు. జగన్‌.. రైతుల ట్రాక్టర్లకు, ఆటోలకు ట్యాక్సులు రద్దు చేస్తాడని, ప్రతి ఏడాది రూ.10 వేలు ఇస్తాడని గ్రహించి ఇంతలోపే బాబు ఏం చేశాడో తెలుసా? ఆటో డ్రైవర్‌ వద్దకు వెళ్లి ఖాళీ చొక్కా వేసుకుంటాడు. ఆటోవాలాలకు రోడ్డు ట్యాక్స్‌ లేదంటాడు. రైతు ట్రాక్టర్లకు ట్యాక్స్‌ లేదంటాడు. ప్రతి పేదవానికి సంబంధించిన సామాజిక వర్గానికి కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తానన్నాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement