సాక్షి, అనంతపురం : వాచ్‌మెన్‌లు, స్వీపర్లకే అనంతపురం నిరుద్యోగులను పరిమితం చేయడం దుర్మార్గమని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అన్న పిలుపు’లో భాగంగా సోమవారం ఆయన అనంతపురంలో తటస్థులతో సమావేశమయ్యారు. నగరంలోని శ్రీ 7 కన్వెన్షన్ హాలులో జరిగిన ఈ ముఖాముఖిలో తటస్థులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలపై వైఎస్ జగన్ భరోసా కల్పించారు.
కియా కార్ల పరిశ్రమతో..
కియా కార్ల పరిశ్రమ వల్ల ఏం ప్రయోజనం లేదని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని విమర్శించారు. అనంతపురం నిరుద్యోగులను వాచ్‌మెన్‌లు, స్వీపర్లకే పరిమితం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా చట్టం చేస్తామన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలను విస్తృతంగా ఏర్పాటు చేస్తామని, నిరుద్యోగులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు.
చంద్రబాబు సర్కార్ ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లను మూసివేస్తోందని, విద్యార్థులకు సకాలంలో పుస్తకాలు ఇవ్వడం లేదని తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే విద్య, వైద్య సదుపాయాలు పెంచుతామన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని, ఉపాధి హామీ కూలీల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. యూనివర్సిటీల్లో అధ్యాపకుల కొరత సిగ్గు చేటని, రూ. 20 కోట్ల బకాయిలు తనకే రావాలని సాక్షాత్తు మోహన్ బాబు వంటి వారు ఆవేదన చెందుతున్నారన్నారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోతే కాలేజీలు ఎలా నడుస్తాయని ప్రశ్నించారు.
తాను ప్రభుత్వాస్పత్రికి వెళ్లేలా..
ప్రభుత్వ ఆసుపత్రులన్నీ వృథా అన్నట్లు టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, లోకేష్ కనుసన్నల్లో నడిచే మెడాల్ సంస్థకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్తపరీక్ష కాంట్రాక్టు పనులు అప్పగించి దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికారంలోకి రాగానే వైద్య వ్యవస్థలో సమూల ప్రక్షాళన చేస్తామన్నారు. తాను కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేసుకునే స్థాయికి తీసుకెళ్తానన్నారు. సర్కార్ ఆసుపత్రుల్లో అన్ని మౌళిక సదుపాయాలు కల్పించి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వైద్యం చేయించుకునేలా వ్యవస్థలో మార్పు తీసుకొస్తామన్నారు. రాజకీయాల్లో విలువలు తేవాలన్న వైఎస్ జగన్ సంకల్పం అభిందనీయమని, తమ అభిప్రాయం తీసుకోవడం శుభపరిణామమని ఈ సందర్భంగా తటస్థులు కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment