సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతి సొమ్ముతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటుకు రూ. 3 వేలు ఇస్తామంటూ గ్రామాల్లోకి డబ్బు మూటలు తరలిస్తారని విమర్శించారు. 55 నెలలు పాటు కడుపు మాడ్చి చివరి 3 నెలలు అన్నం పెడతానంటున్న వారిని ఏమనాలని ప్రశ్నించారు. చంద్రబాబు పుట్టిందే మోసం చేయడానికి అని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజారంజక పాలన అందించాలంటే రాక్షసులు, మోసగాళ్లతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అందుకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. చంద్రబాబు కుయుక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు.
సోమవారం అనంతపురం సమర శంఖారావం సభలో అశేషజనవాహిని ఉద్దేశించి ప్రసంగిస్తూ... ‘ అధికారంలో ఉన్న వాళ్లు ఎన్నో కష్టాలు పెట్టారు. తొమ్మిదేళ్లుగా నాతో పాటుగా మీరు కూడా ఎన్ని కష్టాలు అనుభవించారో తెలుసు. కొంతమందిపై అక్రమ కేసులు పెట్టారు. మరికొందరిని పథకాలను దూరం చేశారు. ఇంకొంత మంది కుటుంబ సభ్యులను కోల్పోయారు. మీకు తగిలిన ప్రతీ గాయం నా గుండెకు తగిలింది. 1280 మందిపై అక్రమ కేసులు పెట్టారు. అందుకే అధికారంలోకి రాగానే వాటన్నింటినీ ఎత్తివేస్తాం. కుల, మత, పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం. ఆర్థికంగా, సామాజికంగా అందరినీ ఆదుకుంటాం. ఎన్నికల షెడ్యూలు రాబోతుంది. వైఎస్సార్ సీపీ విజయంలో కీలక పాత్ర పోషించాల్సిన బాధ్యత మీపై ఉంది’ అని వ్యాఖ్యానించారు.
ఆయన ప్రసంగం కొనసాగిస్తూ... ‘ప్రస్తుతం చంద్రబాబుతో పాటు ఆయన మోసాలను, అబద్ధాలను మోసే ఎల్లో మీడియాతో మనం పోరాడాల్సి ఉంటుంది. అందుకే గ్రామాల్లో ప్రతీ ఒక్కరిని అప్రమత్తం చేయాల్సిన అవశ్యకత ఉంది. అమ్మా.. అక్కా.. అన్నా.. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దని చెప్పండి. మన అన్న ముఖ్యమంత్రి అవుతాడు. అప్పుడు పిల్లల్ని బడికి పంపిస్తే ‘అమ్మ ఒడి’ ద్వారా 15 వేల రూపాయలు ఇస్తాడని చెప్పండి. చేయూత అనే పథకం ద్వారా ప్రతీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, 4 దఫాలుగా 75 వేల రూపాయలు ఇస్తాడని చెప్పండి. పొదుపు సంఘాల్లో అక్కాచెల్లెళ్ల రుణాలు 4 దఫాలుగా మాఫీ చేస్తాడని చెప్పండి. అవ్వా, తాతల.. పెన్షన్ రూ. 2 వేల నుంచి 3 వేలకు పెంచుతాడని అందరికీ చెప్పండి. మన పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్లు అవుతారు. ఎన్ని లక్షలు ఖర్చయినా ఫర్వాలేదు. అన్న చూసుకుంటాడని చెప్పండి. వెయ్యి దాటితే ఆరోగ్య శ్రీ కిందకి తీసుకువచ్చి వైద్యం చేయిస్తాడని చెప్పండి. నవరత్నాల్లోని ప్రతీ అంశం అమలు చేస్తాడని చెప్పండి’ అని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు.
ఎక్కడికక్కడ దోచేశారు..
ఇప్పటికే మూడు ఫ్లాపు సినిమాలు తీసిన చంద్రబాబు.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరిన్ని సరికొత్త డ్రామాలకు తెరతీస్తారని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. ఆయన మొదటి సినిమా ‘2014 ఎన్నికల్లో’ భాగంగా...‘ రైతు, డ్వాక్రా రుణ మాఫీ, ధరల స్థిరీకరణ, కేజీ నుంచి పీజీ వరకు మన పిల్లలకు ఉచిత విద్య అన్నారు. ప్రతి పేదవాడికి ఇల్లు, ఇంటికో ఉద్యోగం.. లేకపోతే నెలకు రూ. 2 వేలు నిరుద్యోగ భృతి, ప్రతి ఏటా ఏపీపీఎస్సీసీ నోటిఫికేషన్లు.. ఉద్యోగాలన్నీ భర్తీ, ప్రతి ఇంటికి రూ. 2 కే 20 లీటర్లు మంచినీరు. ప్రత్యేక హోదా 5 ఏళ్ళు కాదు..15 ఏళ్ళు కావాలి. వాల్మీకి, కురువులను ఎస్టీలుగా... రజకులను ఎస్సీలుగా... గాండ్లను ఎస్సీలుగా.. మత్స్యకారుల్ని ఎస్టీలుగా చేరుస్తా. మూడేళ్ళలోనే పోలవరం పూర్తి చేస్తా. ఆపదలో మహిళలకు 5 నిమిషాల్లో సాయం. ఆంధ్ర రాష్ట్రానికి బులెట్ ట్రైన్ తెస్తా’ అని చంద్రబాబు హామీలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. గత నాలుగున్నరేళ్లుగా వీటిలో ఏ ఒక్క హామీ అమలు చేయలేదు సరికదా.. మట్టి, ఇసుక, బొగ్గు, భూములు, గుడి భూములు, కరెంటు కొనుగోళ్ళు.. అంటూ ఎక్కడికక్కడ దోచేశారని మండిపడ్డారు.
నాలుగేళ్లు కాపురం చేసి.. ఇప్పుడేమో నల్లచొక్కా వేస్తారు!
‘ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు.. పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు. బీజేపీతో చిలక-గోరింకల్లా కాపురం చేస్తారు. నాలుగేళ్ళు చంద్రబాబు బీజేపీ నేతలను, బీజేపీ నేతలు చంద్రబాబును పొగిడారు. ప్రత్యేక హోదా సంజీవనా? అని అడుగుతారు. హోదా పేరెత్తితే కేసులు పెట్టండని హుకుం జారీ చేస్తారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి కృతఙ్ఞతలు తెలుపుతారు. మోదీని పొగుడుతూ జనవరి 27, 2017న.. మన రాష్ట్రానికి చేసినట్టుగా ఏ రాష్ట్రానికైనా ఇంత సహాయం చేశారా? అని ఎదురు ప్రశ్న వేస్తారు. ఇన్ని విషయాలు మాట్లాడి.. నాలుగేళ్ళు బీజేపీ-పవన్ కల్యాణ్‌తో కాపురం చేసి.. ఇప్పుడేమో నల్ల చొక్కాలు వేసుకొని యుద్ధం, పోరాటం అంటారు. బీజేపీతో విడాకులు తీసుకొని.. ఢిల్లీకి పోయి.. పార్లమెంటు ముగిసిపోయిన తర్వాత దీక్ష చేస్తారు. ఎన్నికలకు మూడు నెలల ముందు పసుపు-కుంకుమ అంటారు. రైతు రుణ మాఫీ ఇంకా పూర్తి కాలేదు. 4, 5వ విడత రుణాల సంగతి దేవుడెరుగు.. అన్నదాతా సుఖీ భవ అంటారు. రాజధానిలో ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ కట్టరు. రాజధాని ఎక్కడ అని అడిగితే బాహుబలి సినిమా చూశారా? సినిమాలో సెట్టింగులు బాగున్నాయా? అని ఎదురు ప్రశ్న వేస్తారు’ అని చంద్రబాబు తీరును వైఎస్ జగన్ ఎండగట్టారు.
ఆనాడు జరిగిందే.. ఇప్పుడు జరగబోతోంది
కేవలం వారం రోజుల ముందు చంద్రబాబు ఆరవ బడ్జెట్ అనే మూడో సినిమా విడుదల చేశారన్న వైఎస్ జగన్... ‘ఏ ముఖ్యమంత్రి అయినా 5 బడ్జెట్లు ప్రవేశ పెడతారు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబు.. రూ. 2 లక్షల 26 వేల కోట్లతో ఆరవ బడ్జెట్ ప్రవేశ పెట్టి.. జగన్ పథకాలను కాపీ కొట్టారు. అది కూడా సగం సగమే. కాపీ కొట్టే వాడిని కాపీ రాయుడు అనొచ్చు. ఈయనకు అది కూడా సరిగ్గా చేతకాదు. 1983లో ఎన్టీఆర్ కొత్తగా రాజకీయాల్లో అడుగు పెట్టి రూ. 2లకే కిలో బియ్యం ఇస్తానని ప్రకటించారు. అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర రెడ్డి.. ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు రూ. 1.90కే బియ్యం ఇచ్చారు. అయినా ప్రజలు ఆయనకు గట్టిగా బుద్ధి చెప్పారు. 55 నెలలు కడుపు మాడ్చి చివరి మూడు నెలలు అన్నం పెడతానన్న చంద్రబాబుకు కూడా ఇదే జరుగబోతోంది’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment