సాక్షి, కుప్పం (చిత్తూరు) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చంద్రమౌళిని గెలిపిస్తే మంత్రిని చేసి కుప్పం ప్రజలకు మేలు చేస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించారు. 30 ఏళ్లుగా కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. ఇందులో 14 ఏళ్లు సీఏంగా ఉండి కూడా కుప్పం ప్రజల సమస్యలు పట్టించుకోలదేని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఏపీ అక్షరాస్యత 67 శాతమని, కానీ 14 ఏళ్లు సీఎంగా.. 30 ఏళ్లు ఎమ్మెల్యేగా చంద్రబాబు ప్రాతినిథ్యం వహించిన ఈ కుప్పంలో అక్షరాస్యత మాత్రం కేవలం 61.8 శాతమేనన్నారు. చాలా గ్రామాల్లో ప్రాథమిక విద్యను కూడా పూర్తి చేయని పరిస్థితులు ఉన్నాయని తెలిపారు.
ఈ నియోజకవర్గంలో కనీసం డిగ్రీ, పాల్‌టెక్నిక్ కాలేజీలు కూడా చంద్రబాబు పెట్టించలేదని, దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే ఈ రెండు కాలేజీలు వచ్చాయన్నారు. సొంత కుటుంబ సభ్యులనే దారుణంగా మోసం చేసిన చంద్రబాబును నమ్మవద్దని ప్రజలను కోరారు. అధికారంలోకి రాగానే నవరత్నాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతామని భరోసా ఇచ్చారు. కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కె. చంద్రమౌళి, చిత్తూరు ఎంపీ నల్లకొండగారి రెడ్డప్పలను ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ సభలో ఆయన ఏమన్నారంటే..
30 ఏళ్లు ఎమ్మెల్యే.. 14 ఏళ్లు ముఖ్యమంత్రి..
‘కుప్పం ప్రజల ఆగచాట్లు చూస్తుంటే చంద్రబాబు వంటి మనిషి ప్రపంచంలోనే ఎవరు ఉండరనిపిస్తోంది. 1978లో చలంద్రగరి నుంచి చంద్రబాబు తొలిసారి ఎమ్మెల్యగా ఎన్నికయ్యారు. అనంతరం మంత్రి పదవి కూడా చేపట్టారు. ఆ తరువాత జరిగిన 1983 ఎన్నికల్లో ఈ చంద్రగిరి నియోజకవర్గం నుంచి 17వేల 200 ఓట్లతో దారుణంగా ఓడిపోయారు. ఆ తర్వాత.. కూతురుని ఇచ్చిన మామా దివంగత నేత ఎన్టీఆర్ పక్కన చేరారు. 1985లో పోటీ చేయలేదు. 1989లో చంద్రగిరిని వదిలేశారు. బీసీలు ఎక్కువగా ఉన్నారని, వారినైతే సులువుగా మోసం చేయవచ్చని కుప్పంను ఎంచుకున్నారు. బీసీలు ఎక్కువగా ఉన్న చోట వారికే అవకాశం ఇవ్వాలని ఏ రాజకీయపార్టీ అయినా ఆలోచిస్తుంది. కానీ చంద్రబాబు ఈ సీటివ్వకుండా గుంజేసుకున్నారు. 30 ఏళ్లు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. ఇందులో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. కానీ ఈ కుప్పంలో ఏం అభివృద్ధి జరిగింది? చంద్రబాబు బీసీ కాకపోయినా.. బీసీలంతా ఆయనకే ఓటేశారు. మరి ఆయన ఏం చేశారు?
కనీసం డిగ్రీ కాలేజీ కూడా..
నియోజకవర్గంలో గణేశ్‌పురం వద్ద పాలారు ప్రాజెక్ట్ నిర్మాణానికి చంద్రబాబు ఏ రోజు ముందుకు రాలేదు. ఆ దివంగత నేత రాజశేఖర రెడ్డి పాలారు ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్ట్ ఇక్కడికి వస్తే తాను ఏం చేయలేదని ఇక్కడి ప్రజలు తిడుతారని.. ఓట్లేసిన ప్రజలతోనే కుట్రలు పన్నారు. తమిళనాడు ప్రభుత్వంతో చేతులు కలిపి ఈ ప్రాజెక్ట్ రాకుండా అడ్డుకున్నారు. ఏపీలో 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత 67 శాతం. కానీ 14 ఏళ్లు సీఎంగా.. 30 ఏళ్లు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన చంద్రబాబు నియోజకవర్గంలో మాత్రం కేవలం 61.8 శాతం అక్షరాస్యతే. చాలా గ్రామాల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేయని పరిస్థితి ఉంది. ఈ నియోజకవర్గంలో కనీసం డిగ్రీ కాలేజీ, పాల్‌టెక్నిక్ కాలేజీలను కూడా చంద్రబాబు పెట్టించలేదు. వైఎస్సార్‌హయాంలోనే ఈ రెండు కాలేజీలు వచ్చాయి. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక కూలి పనుల కోసం బెంగళూరుకు వలస వెళ్తున్నారు. ఇక్కడి గుడిపల్లిలోనే ఆరోగ్యశ్రీ పథకాన్ని వైఎస్సార్ ప్రారంభించారు. కానీ ఇవాళ ఆరోగ్యశ్రీ కార్డున్నా ఎందుకు పనికి రావడం లేదు. కుప్పంలో బంతి, చామంతి పూలు సాగు ఎక్కువగా ఉంటుంది. గిట్టుబాటు కావాలంటే బంతి కేజీరూ.20, చామంతి రూ.30 ఉండాలి. బంతిపూలకు ఒక్కరూపాయి ధర పలికి పూలను రోడ్డుపై పడేస్తున్నారు. ప్రభుత్వం తరపున మార్కెట్ యార్డ్ కూడా లేదు. ప్రయివేట్ తరపున ఉన్న మార్కెట్ యార్డ్‌లో రైతులకు న్యాయం జరగడం లేదు. రైతన్నల కోసం కోల్డ్‌స్టోరేజ్‌లు లేవు. ఇక్కడ బోర్లపైనే వ్యవసాయం ఎక్కువగా ఉంది. 9 గంటలపాటు ఉచిత విద్యుత్ హామీ ఇచ్చిన బాబు.. సొంత నియోజకవర్గంలో కూడా అమలు చేయలేదు.
వైఎస్సార్ 60 వేల ఇళ్లు కట్టిస్తే..
9 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు 18 వేల ఇళ్లు కట్టిస్తే.. వైఎస్సార్ తన పాలనలో 60 వేల ఇళ్లు కట్టించారు. మళ్లీ ఐదేళ్ల చంద్రబాబు పాలనలో 5,500 ఇళ్లులు మాత్రమే కట్టించారు. ఒక్కసారి ఆలోచన చేయండి. కొన్నినెలల పాటు కుప్పంలో సెక్షన్ 30ని అమల్లోకి తీసుకొచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలపై తప్పుడు కేసులు పెట్టించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కేసులను ఎత్తేస్తానని హామీ ఇస్తున్నాను. కుప్పంలో పథకాల అమల్లో పక్షపాతం కనిపిస్తోంది. ఉపాధి హామీ పనుల్లో అవినీతి చోటుచేసుకుంది. మూడు సార్లు సీఎం అయినా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు న్యాయం జరగలేదు.
పెద్దన్నగా ఎలా ఉంటారు..
సొంత తమ్ముడినే చిన్నచూపు చూసిన చంద్రబాబు.. రాష్ట్రప్రజలకు పెద్దన్నలా ఎలా ఉంటారు? ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సంగం వాటా ఇవ్వాలని చట్టం చేస్తే.. తల్లి పేరున ఉన్న ఆస్తిని తమ్ముళ్లు, చెల్లెళ్లకు పంచకుండా.. కొడుకు పేరున రాయించాడు. సొంత తమ్ముడికి, చెల్లెల్లకు, పిల్లినిచ్చిన మామకే వెన్నుపొడిచిన వ్యక్తి రాష్ట్రప్రజలకు పెద్దకొడుకు ఎలా అవుతాడు.? చరిత్రలో డ్వాక్రా అక్కాచెల్లెమ్మలను మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతోంది. ఇప్పుడు పసుపు కుంకుమ పేరిట ఎన్నికల ముందు కొత్త సినిమా చూపిస్తున్నారు. సొంత మామపెట్టిన పార్టీలో చేరి.. ఆయన పదవి, పార్టీ, గుర్తు, జెండా, ట్రస్ట్‌ను లాక్కొన్న చంద్రబాబు నాయుడిని నమ్మవచ్చా? అని అడుగుతున్నా.
సొంత బావమరిది చనిపోయాడనే బాధను మరిచి.. భౌతిక కాయం పక్కన్నే పెట్టుకొని కేటీఆర్‌తో పొత్తుకు యత్నించారు... అది కుదరకపోవడంతో కేసీఆర్‌ను బూచిగా చూపిస్తూ.. ఇప్పుడు జనాలను రెచ్చగొడుతున్నాడు. సొంత కుటుంబంలోనే ఓ అన్నగా.. అల్లుడిగా.. ఓ బావగా ఇన్ని మోసాలు చేసిన చంద్రబాబు రాష్ట్రప్రజలకు అన్నగా.. పెద్దకొడుకుగా ఎలా మేలు చేస్తాడు? బీసీల సీటును కాజేసిన ఈ వ్యక్తి.. వైఎస్సార్‌సీపీ అనుకూలమైన ఓట్లను తొలగించి గత ఎన్నికల్లో గెలిచాడు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు 119 హామీలు ఇచ్చారు. వాటిలో ఒక్కటైనా అమలు చేశారా? ఆ మేనిఫెస్టోను మాయం చేశారు. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నా. బీసీకులానికి చెందిన ఐఏఎస్ అధికారి చంద్రమౌళిని ఇక్కడి నుంచి నిలబెడుతున్నాను. అయనను గెలిపించండి.. నా కేబినెట్‌లో మంత్రిగా పెట్టుకుని మీ అందరికి మేలు చేస్తాను.’ అని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment