ఆ డబ్బులు మీ వడ్డీలకైనా సరిపోయాయా? : జగన్‌ | YS Jagan Speech In Machilipatnam Public Meeting | Sakshi
Sakshi News home page

పసుపు కుంకుమ డబ్బులు మీ వడ్డీలకైనా సరిపోయాయా?

Published Mon, Apr 8 2019 1:26 PM | Last Updated on Mon, Apr 8 2019 4:42 PM

YS Jagan Speech In Machilipatnam Public Meeting - Sakshi

సాక్షి, మచిలీపట్నం : ‘సరిగ్గా ఎన్నికల మందు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన పసుపు-కుంకుమ పథకం డబ్బులు డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాల వడ్డీలకైనా సరిపోయాయా?’ అని ప్రతిపక్షనేత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రశ్నించారు. సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేసి చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలను దారుణంగా మోసం చేశారని ధ్వజమెత్తారు. ఆయన ఇచ్చే పసుపు కుంకుమ డబ్బులు.. డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలకు చెల్లించే వడ్డీలకు కూడా సరిపోవని వివరించారు. రుణమాఫీ పేరిట రైతులను కూడా దారుణంగా మోసం చేశాడని మండిపడ్డారు. ఎన్నికల ముందు అన్నదాత సుఖీభవ అంటూ ముష్టివేస్తున్నారని విమర్శించారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. అధికారంలోకి రాగానే నవరత్నాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతామని హామీ ఇచ్చారు. ఇళ్లు లేని ప్రతి ఒక్కరికి స్థలాలతో పాటు ఇళ్లు కట్టిస్తామన్నారు. చంద్రబాబు చేసే కుట్రలను గమనించాలని, ఆయన ఐదేళ్ల పాలనపై ఒకసారి ఆలోచన చేయాలని ప్రజలను కోరారు. మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేర్ని వెంకట్రామయ్య(నాని), మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థి వల్లభనేని బాలశౌరిలను ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ సభలో ఆయన ఏమన్నారంటే.. 

33 వేల ఎకరాలు అవసరం లేదు..
నా పాదయాత్ర ఈ నియోజకవర్గం మీదుగా కూడా జరిగింది. ఇక్కడ పోర్ట్‌ వస్తుందని.. పోర్ట్‌ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఇక్కడి ప్రజలు 12 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి 2008లో ఈ పోర్ట్‌కు శంకుస్థాపన చేశారు. ఆయన మరణాంతరం దాన్ని పట్టించుకునే నాదుడే లేడు. ఈ పోర్ట్‌ నిర్మాణం కోసం వైఎస్సార్‌ 4800 ఎకరాలు అవసరమని చెబితే.. అప్పట్లో చంద్రబాబు దీన్ని వ్యతిరేకించి.. 1800 ఎకరాల ప్రభుత్వ భూమి సరిపోతుందన్నారు. 2014 ఎన్నికల ప్రచారం సందర్బంగా ఇదే విషయం ప్రస్తావిస్తూ.. 1800 ఎకరాల ప్రభుత్వ భూమిలో కట్టిస్తానని హామీ ఇచ్చారు. అయన అధికారంలోకి వచ్చాడు.. 1800 ఎకరాల ప్రభుత్వ భూమి పోయింది.. 4800 ఎకరాలు పోయింది. ఏకంగా 33 వేల ఎకరాలకు నోటీఫికేషన్‌ ఇస్తూ రాత్రికి రాత్రే జీవో జారీ చేశారు. ఆ భూనిర్వాసితులు ఆ డబ్బులతో వారి కూతుళ్ల పెళ్లిలు కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు. నేను కూడా ఇక్కడికి మూడు సార్లు వచ్చాను. ఈ విషయంపై అందరికి అండగా నేను ఉన్నాను అని ఆనాడు భరోసా ఇచ్చా. భూములు కోల్పోయిన ఆ ప్రతి రైతన్నకు చెబుతున్నా33 వేల ఎకరాలు అవసరం లేదు. అదే 4800 ఎకరాల్లోనే పోర్ట్‌ను నిర్మిస్తామని హామీ ఇస్తున్నాను.
 
ప్రకాశం బ్యారేజీ నుంచి వస్తున్న నీరు బందరు వరకు కూడా రావడం లేదు. ఐదేళ్లుగా రెండు పంటలకు కనీసం ఒక పంట పండని పరిస్థితి ఉంది. వైఎస్సార్‌ హయాంలో కృష్ణా డెల్టా ఆధునీకరణ పనులు మొదలుపెట్టారు. కానీ చంద్రబాబు మాత్రం ఆ కృష్ణా డెల్టా ఆధునీకరణ పనులు గాలికొదిలేశారు. ఓవైపు నీరు లేక పంటలు పండని పరిస్థితి ఉంటే.. మరోవైపు  పంటలకు గిట్టుబాటు ధరలేదు. మినుములు, వరికి కనీస మద్దతు ధర లభించడంలేదు. భూకబ్జాదారులు స్మశానాలు, బహిరంగ టాయిలెట్స్‌ను కూడా వదలడం లేదు. 

ప్రతి ఒక్కరికి ఇళ్లు..
ప్రభుత్వ భూములు, సబ్సిడీ సిమెంట్‌, లిఫ్ట్‌ కూడా లేని ప్లాట్‌ నిర్మాణానికి రూ.3 లక్షలు అవుతుంది. కానీ చంద్రబాబు మాత్రం రూ.6 లక్షలకు అమ్ముతున్నారు. వీటిలో కేంద్రప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలపి రూ.3 లక్షలు ఇస్తుందంటా.. బాగానే ఉంది. కానీ మిగతా రూ.3 లక్షలు 20 నెలల పాటు ప్రతి నెల రూ.3 వేలు కడుతూ ఉండాలట. లంచాలు తీసుకొనిదే చంద్రబాబు.. ఆ లంచాలకు పెదవాడు కడుతూ పోవాలంట. ఫ్లాట్స్‌ ఇస్తే వద్దనకండి.. తీసుకొండి. అధికారంలోకి రాగానే.. జగన్‌ అనే నేను.. ఆ మూడు లక్షల అప్పును మాఫీ చేస్తానని హామీ ఇస్తున్నాను.

ఒక్కసారి నాన్నగారి హయాంను గుర్తుకు తెచ్చుకోండి. ప్రతి పేదవాడికి ఇళ్లే కాదు.. ఇంటిస్థలం కూడా ఇచ్చారు. ఇక్కడ 10 వేల మంది ఇళ్ల స్థలాలకోసం దరఖాస్తు పెట్టుకున్నారని నాని చెప్పాడు. అధికారంలోకి రాగానే ఎంత మంది ఉన్నా.. అందరికి ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్లు కట్టిస్తామని హామీ ఇస్తున్నాను. ఇదే మచిలీపట్నంలో దాదాపుగా 50 వేలమంది రోల్డ్‌ గోల్డ్‌ తయారీ మీద ఆధారపడి బతుకుతున్నారు. దీని ప్రాధాన్యతను గుర్తించి నాన్నగారు ఇమిటేషన్‌ జ్యూవెలరీ పార్క్‌ను ఏర్పాటు చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఆ పార్క్‌కు నీరు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. కరెంట్‌ చార్జీలు వైఎస్సార్‌ హయాంలో యూనిట్‌కు రూ. 3.75 ఉంటే ఇప్పుడు రూ.7 నుంచి రూ.9 వసూలుచేస్తున్నారు. ఆ పార్క్‌పై 50వేల మంది బతుకుతున్నారు. ఇలా చార్జీలు పెంచితే వారు ఎలా బతుకుతారు? మనపార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నీళ్లు ఇవ్వడమే కాదు.. కరెంట్‌ చార్జీలు నాన్నగారి హయాం మాదిరే రూ.3.75కు కూడా తగ్గిస్తాం.

మత్య్సకారులకు రూ.10వేలు ఇస్తాం..
ఇక్కడ మత్య్సకారులు ఎక్కువే. ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు వేట సెలవు. ఈ హాలిడే ప్రకటించినప్పుడు రూ.4 వేలు ఇస్తామన్నారు. ఎంత మందికి ఇచ్చారు? అని అడుగుతున్నా. ఆ ప్రతి మత్య్సకార సోదరుడికి వేట విరామ సమయంలో రూ.10 వేలు ఇస్తాం. ప్రతి కుటుంబానికి గ్రామ వాలంటీర్‌ గ్రామ సెక్రటేరియట్‌తో అనుసంధానమై తలుపు తట్టి మరి డోర్‌ డెలవరీ చేసిపోతాడు. చంద్రబాబు పాలనపై ఆలోచన చేయండి. ఆయన ఐదేళ్ల పాలనలో మోసం.. మోసం.. మోసం అనే మూడు పదాలే కనిపిస్తాయి.

పసుపు-కుంకుమ మోసం..
ఈ మధ్యకాలంలో ఆడవారిని మోసం చేయడానికి పసుపు కుంకుమ అంటూ చంద్రబాబు బిల్డప్‌ ఇస్తున్నారు. ప్రతి అక్క, చెల్లెమ్మను అడుగుతున్నా..  చంద్రబాబు ప్రభుత్వ హయాంలో డ్వాక్రా మహిళలకు సున్న వడ్డీ రుణాలు ఇచ్చారా? ఎందుకంటే సున్నా వడ్డీ పథకాన్ని మే 2016 నుంచే రద్దు చేశారు. పొదుపు సంఘాల్లో చాలా గ్రూప్‌లున్నాయి. కొందరు రూ.5 లక్షలు, మరొకొందరు రూ.7 లక్షలు, ఇంకొందరు రూ.10 లక్షలు రుణాలుగా తీసుకుంటారు. ఇలా ఐదు లక్షలు తీసుకున్న వారు.. ఐదేళ్లలో రూ. లక్ష 80వేలు వడ్డీ కిందే కట్టారు. రూ.7 లక్షలు తీసుకున్నావారు. రూ.2 లక్షల 50వేలు కట్టారు. రూ.10 లక్షల తీసుకున్నవారు..రూ. 3 లక్షల 60 వేలు వడ్డీల కిందే కట్టారు. సున్నా వడ్డీలు రద్దవ్వడం వల్ల ఇలా లక్షల్లో వడ్డీ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు సరిగ్గా ఎన్నికల ముందు పసుపు కుంకుమతో ఒక్కో గ్రూప్‌కు రూ. లక్ష ఇస్తున్నారు. కనీసం ఇది వడ్డీలకైనా సరిపోయిందా? ఆలోచన చేయమని అడుగుతున్నా? సున్నా వడ్డీ రుణాలు రద్దు చేసి ఎలా మోసం చేశారో బేరిజు వేసుకోమని కోరుతున్నా.

ముష్టి వేసినట్లు..
రైతన్నల రుణాలు చంద్రబాబు అధికారం చేపట్టే నాటికి రూ. 87,612 కోట్లు ఉన్నాయి. ఈ ఐదేళ్లలో అవి రూ. లక్షా 50వేల కోట్లకు ఎగబాకాయి. తొలి సంతకం కింద రూ. 24వేల కోట్ల రుణామాఫి పైల్‌పై సంతకం పెట్టారు. ఐదేళ్లలో కేవలం రూ.14వేల కోట్లు మాత్రమే ఇచ్చాడు. ఆ 87,612 కోట్ల మీద రూపాయి వడ్డీ వేసుకున్నా.. రైతన్నలు రూ.40 వేల కోట్లు వడ్డీ కింద కట్టారు. ఈ మోసాన్ని చూడమని కోరుతున్నా. అన్నదాత సుఖీభవ కింద ఎన్నికలు ముందు ఇప్పుడు ముష్టి వేస్తున్నట్లు ఇస్తున్నారు. జాబు రావాలంటే బాబు రావాలని అన్నాడు. జాబు రాకుంటే రెండు వేలు ఇస్తానన్నాడు. ఎన్నికల ముందు ముష్టివేసినట్లు రూ. వెయ్యి ఇచ్చి దారుణంగా మోసం చేశాడు.

2014లో చంద్రబాబు చెప్పిన మేనిఫోస్టో అంశాలు.. వ్యవసాయ రుణాలు మాఫీ.. అయ్యాయా? రూ.5వేల కోట్లతో ధరల స్థీరికరణ.. పెట్టారా? గుడిసెలు లేని రాష్ట్రం? కనిపించిందా?బెల్ట్‌ షాపుల రద్దు.. అయ్యిందా? ప్రత్యేక పోలీసు వ్యవస్థ ఉందా? యువతకు ఉద్యోగం, ఉపాధి, ఇంటి ఇంటికి ఉద్యోగం.. వచ్చిందా? పేదపిల్లలకు కేజీ నుంచి పీజీ విద్య. ఎన్టీఆర్‌ సుజల స్రవంతి కింద ఇంటింటికి రూ.2కే 20 లీట్లర మంచినీటి వాటర్‌ క్యాన్‌.. వచ్చిందా? అవినీతి రహిత సుపరిపాలన జరిగిందా? ఒక్కసారి ఆలోచించండి. మళ్లీ 2019లో కూడా అదే ఫొటోతో అదే ప్రణాళికలో మరోసారి మోసం చేయడానికి సిద్దమయ్యారు. పైగా ఈ మేనిఫెస్టోలో 2014లోని హామీలన్నీ పూర్తిగా అమలుచేశామని పేర్కొన్నారు. అయ్యాయా? ఈ మోసాలను గమనించమని కోరుతున్నా..

ఎన్నికలు వచ్చే సరికి చంద్రబాబు కుట్రలు మరింత పెరుగుతాయి. ఆయన చేయని మోసం ఉండదు.  ప్రతిగ్రామానికి మూటలు మూటలు డబ్బులు పంపిస్తారు. ఓటు కొనేందుకు ప్రతి ఒక్కరి చేతిలో రూ.3వేలు పెడతారు. మీరందరూ గ్రామాలకు వెళ్లండి ప్రతి ఒక్కరిని కలిసి నవరత్నాల గురించి చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3వేలకు మోసపోవద్దని చెప్పండి. 20 రోజులు ఓపిక పడితే జగనన్న ప్రభుత్వం వస్తుందని చెప్పండి. జగనన్న వచ్చిన తర్వాత జరిగే సంక్షేమాన్ని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి.’ అని వైఎస్‌ జగన్‌ కోరారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement