రౌడీయిజం రాజ్యమేలుతోంది: వైఎస్‌ జగన్‌ | YS Jagan Speech In Piduguralla Public Meeting | Sakshi
Sakshi News home page

గురజాలలో రౌడీయిజం రాజ్యమేలుతోంది: వైఎస్‌ జగన్‌

Published Wed, Apr 3 2019 1:50 PM | Last Updated on Wed, Apr 3 2019 3:45 PM

YS Jagan Speech In Piduguralla Public Meeting - Sakshi

సాక్షి, పిడుగురాళ్ల (గుంటూరు జిల్లా) : గురజాల నియోజకవర్గంలో రౌడీయిజం రాజ్యమేలుతోందని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌ రావు మైనింగ్‌ మాఫియా సృష్టించారని, ఈ దోపిడీని అరికట్టాల్సిన సీఎం చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు నారా లోకేష్‌ యరపతినేనితో బాగాలు పంచుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం గుంటూరు జిల్లా, గురజాల నియోజవకవర్గం పిడుగురాళ్లలో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఎన్నికల ముందు చంద్రబాబు తమ పథకాలను కాపీ కొట్టి మరోసారి మోసం చేయడానికి సిద్దమయ్యారన్నారు. పసుపు కుంకుమ పథకానికి మోసపోవద్దని, అధికారంలోకి రాగానే నవరత్నాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతామని భరోసా ఇచ్చారు. గురజాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాసు మహేష్‌రెడ్డి‌‌, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలను ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ సభలో ఆయన ఏమన్నారంటే..

తాగు నీటి సమస్యను పట్టించుకోలేదు..
‘పక్కనే నాగర్జునసాగర్‌ ఉంటుంది.. కానీ తాగడానికి మంచి నీళ్లు ఉండవ్‌. ఐదేళ్ల పాలనలో ఎన్నడు ఈ సమస్యను పట్టించుకోలేదు. ఎన్నికలు ముందు చంద్రబాబు సుపుత్రుడు నారా లోకేష్‌ వచ్చి బుగ్గవాగు నుంచి కృష్ణ నీళ్లు తెస్తామని టెంకాయ కొడుతాడు. ఐదేళ్లు గుర్తుకురాని నీటి సమస్య ఎన్నికల ముందే గుర్తుకు వస్తుంది. రైతన్నలకు సాగు నీరు లేదు. పత్తికి గిట్టుబాటు ధరలేదు. మిర్చి పంటకు క్వింటాల్‌ రూ.6వేలు కూడా రావడం లేదు. 70 గ్రామాలు పూర్తిగా తాగు నీరులేక ఇబ్బందులు పడుతున్నాయి. లక్ష మంది పైచిలుకు నివాసం ఉంటున్న పిడుగురాళ్లలో కనీసం 100 పడకల ఆసుపత్రి లేదు. ఏదైనా ప్రమాదం జరిగితే గుంటూరుకు వెళ్లే పరిస్థితి. గురజాలలో యరపతినేని అనే దిక్కుమాలిన ఎమ్మెల్యే ఉన్నారు. మైనింగ్‌ వ్యాపారంతో గనులను దోపిడీ చేస్తున్నారు. కోర్టులు సైతం ఇక్కడ మైనింగ్‌, మాఫియా జరిగిందని రూ.కోట్లు జరిమాన వేసే పరిస్థితి ఏర్పడింది. మైనింగ్‌ దోపిడీని అరికట్టాల్సిన సీఎం ఆయన కొడుకు యరపతినేనితో బాగాలను పంచుకుంటున్నారు. రూ.100 కోట్లు జప్తు చేయమని కోర్టు ఆదేశిస్తే.. చంద్రబాబు జేబులోని సీఐడీతో విచారణ చేయించి.. ఆ సొమ్మును యరపతినేని నుంచి వసూలు చేయకుండా చిన్నిచిన్న మైనింగ్‌ కంపెనీలను బెదరిస్తూ నోటీసులు పంపిస్తున్నారు. థియేటర్ల యజమానులు డబ్బులు ఇవ్వకుంటే సినిమా థియేటర్లు మూసే పరిస్థితి ఉంది. పేకట క్లబ్బులు, మైనింగ్‌ మాఫియాతో ఇక్కడ రౌడీయిజం రాజ్యమేలుతోంది. ఇలాంటి తరుణంలో చంద్రబాబు ఐదేళ్ల పాలనపై ఆలోచన చేయమని కోరుతున్నా. ఆయన పాలన మోసం, అబద్దాలు, అవినీతి, అన్యాయం అనే పదాలతో నిండిపోయింది.

ఒక్కసారి ఆలోచించండి..
21 నెలల కిందట మన పార్టీ ప్లీనరీలో నవరత్నాలు ప్రకటించాం. పాదయాత్రతో ప్రతి పేదవాడి, రైతన్న దగ్గరకు తీసుకు వెళ్లాం. వారి సూచనలు, విన్నపాలతో కొన్ని మార్పులు కూడా చేశాం. మన వాగ్ధానాలు మంచి మనసు నుంచి పుడితే.. చంద్రబాబుకు వాగ్ధానాలు మాత్రం ఓటమి భయంతో పుట్టాయి. రైతన్నలకు పెట్టుబడికి సాయంగా రూ.50 వేలు ఉచితంగా చేతికి అందిస్తామని 21 నెలల కింద మనం వాగ్ధానం చేశాం. కానీ చంద్రబాబు మాత్రం ఐదేళ్లు రైతన్నలను పూర్తిగా మోసం చేసి.. ఎన్నికలకు ముందు మన పథకాన్ని కాపీ కొడుతూ అన్నదాత సుఖీభవ అంటూ మోసం చేసేందుకు మరోసారి సిద్దమయ్యారు. చంద్రబాబు మాట నమ్మి పూర్తిగా మోసపోయిన డ్వాక్రా మహిళల బాధలను చూసి.. ఎన్నికల తేదివరకు ఎంత రుణం ఉంటుందో అంత మొత్తాన్ని వారి చేతికే అందిస్తామని నవరత్నాల్లో ప్రకటించాం. 3648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రతి అక్కకు ఈ విషయం చెబుతూ భరోసా కల్పించాం. కానీ చంద్రబాబు మాత్రం డ్వాక్రా మహిళలను దారుణంగా మోసం చేసి.. సున్నా వడ్డీ రుణాలను ఎగరగొట్టి.. ఇప్పుడు పసుపు-కుంకుమ అని కొత్త సినిమా చూపిస్తున్నారు. పొదుపు సంఘాల అక్కా చెల్లెమ్మలకు ఉన్న 28 వేల కోట్ల రుణాలు నేరుగా చేతికే ఇస్తామని చెప్పిన మనమెక్కడా.. పసుపు కుంకుమతో ముష్టివేసినట్లు ఇస్తానన్న రూ.6 వేల కోట్లు ఎక్కడా? ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇస్తామని.. జాబు రావాలంటే బాబు రావాలని చెప్పిన మాటలను గుర్తుకు తెచ్చుకోమని కోరుతున్నా. ఉద్యోగం రాకుంటే నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి.. ఎన్నికల ముందు ముష్టి వేసినట్లు కొంత మందికి ఇస్తూ.. ప్రకటనలు ఇచ్చుకుంటున్న ఈ అన్యాయపు పాలనను చూడమని కోరుతున్నా. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేకహోదాను తీసుకొస్తామని చెప్పి.. ఆ తరువాత ఆ అంశాన్ని అటకెక్కించిన తీరు.. రెండు లక్షల 30 వేల ఉద్యోగాలు భర్తీ చేయని ఈ ప్రభుత్వంపై ఆలోచన చేయమని కోరుతున్నా. లక్షా 20వేల నిరుద్యోగ భృతి ఎగరగొట్టిన ఈయన పాలనను గమనించమని కోరుతున్నా.

గత చరిత్రను గుర్తుతెచ్చుకోండి..
ఎన్నికలకు వచ్చేసరికి అన్ని రకాల స్కీంలతో మోసం చేయడానికి చంద్రబాబు సిద్దంగా ఉంటారు. ఈయన మోసాలకు అండగా అమ్ముడుపోయిన మీడియా ఉంది. వీరంతా కలిసికట్టుగా చేస్తున్న మోసాలు చూడమని కోరుతున్నా. 1994 సంవత్సరంలో చంద్రబాబు అధికారంలోకి రావడం కోసం.. రూ.2లకే బియ్యం, సంపూర్ణ మధ్యపాన నిషేదం వంటి వాగ్ధానాలు చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన మరుసటి ఏడాది 1995లో బియ్యాన్ని రూ.5.25 చేసి.. సంపూర్ణ మధ్య నిషేదాన్ని ఎత్తేసారు. ఈ విషయాలను గుర్తు తెచ్చుకోని చంద్రబాబు నైజాన్ని చూడమని కోరుతున్నా. అవే అన్యాయాలు.. మోసాలను చూడమని విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతిరోజు చంద్రబాబునాయుడు పాలనపై చర్చ జరగకూడదని, ఆయన పాలనపై చర్చ జరిగితే డిపాజిట్లు రావని, ఆయన పచ్చమీడియాతో రోజుకో పుకారు పుట్టిస్తున్నారు. దీనిపై చర్చపెట్టి.. పత్రికల్లో పతాక శీర్షీకలతో ప్రచురిస్తున్నారు. ఇలా చంద్రబాబు మోసపూరిత పాలన ప్రజలకు గుర్తురాకుండా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

జగనన్నతోనే సాధ్యమని తెలపండి..
ఎన్నికలు వచ్చే సరికి ఈ కుట్రలు మరింత పెరుగుతాయి. చంద్రబాబు చేయని మోసం ఉండదు.  ప్రతిగ్రామానికి మూటలు మూటలు డబ్బులు పంపించి. ఓటు కొనేందుకు ప్రతి ఒక్కరి చేతిలో రూ.3వేలు పెడతారు. మీరందరూ గ్రామాలకు వెళ్లండి ప్రతి ఒక్కరిని కలిసి నవరత్నాల గురించి చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3వేలకు మోసపోవద్దని చెప్పండి. 20 రోజులు ఓపిక పడితే జగనన్న ప్రభుత్వం వస్తుందని చెప్పండి. జగనన్న వచ్చిన తర్వాత జరిగే సంక్షేమాన్ని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. పిల్లలను బడులకు పంపిస్తే ఏడాదికి రూ.15వేలు ఇస్తాడని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో మన పిల్లల చదువుకు ఎంత ఖర్చైనా అన్న భరిస్తాడని చెప్పండి. డ్వాక్రా మహిళలకు ఎన్నికల నాటికి ఎంత రుణమున్నా.. ఎన్నికల నాటికి నాలుగు దఫాల్లో నేరుగా ఇస్తాడని తెలుపండి. లక్షాధికారులను చేస్తాడని ప్రతి అక్కా చెల్లెమ్మలకు చెప్పండి.  45 ఏళ్లు దాటిన ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనార్టీలకు రూ. 75 వేలు ఇస్తాడని చెప్పండి. ప్రతి ఏడాది మే నెలలో రూ.12500 చేతుల పెడతాడని ప్రతి రైతన్నకు చెప్పండి. సున్నా వడ్డీ రుణాలు జగనన్న రాజ్యంలోనే సాధ్యమని తెలపండి. గిట్టుబాటు ధరకు గ్యారెంటీ ఇస్తాడని తెలపండి. అవ్వా, తాతలకు మూడు వేల ఫించన్‌ మీ మనవడు ఇస్తాడని చెప్పండి. ఇళ్లు లేవని ప్రతి నిరుపేదను కలవండి. ప్రతి పేదవాడికి ఇళ్లు రావాలంటే జగనన్నతోనే సాధ్యమని తెలపండి. రాజన్న రాజ్యాన్ని జగన్‌ పాలనలో చూస్తామని చెప్పండి.’ అని వైఎస్‌ జగన్‌ కోరారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement