ఆదివారం రాత్రి ప్రకాశం జిల్లా చీరాల గడియారం స్తంభం సెంటరులో ఎన్నికల ప్రచార సభకు హాజరైన జనసందోహంలో ఓ భాగం.. ప్రసంగిస్తున్న షర్మిల
సాక్షి, అమరావతి బ్యూరో, అద్దంకి, చీరాల: ‘ఈ ఎన్నికలు మనకు, మన పిల్లల భవిష్యత్తుకు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చాలా కీలకం. అందుకే అంతా బైబై బాబు.. అని చెప్పి ఆయన్ను ఇంటికి పంపండి..’ అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సోదరి షర్మిల ప్రజలను కోరారు. బస్సు యాత్ర ప్రారంభించిన షర్మిల మూడో రోజైన ఆదివారం అమరావతి మండలం లేమల్లె నుంచి రోడ్‌షో ప్రారంభించారు. గుంటూరు జిల్లా పెదకూరపాడు, నరసరావుపేట, ప్రకాశం జిల్లా సంతమాగులూరు, చీరాలలో కిక్కిరిసిన ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడారు. ఈ సభల్లో షర్మిల ఏమన్నారంటే వివరాలు ఆమె మాటల్లోనే..
అందరినీ దగా చేసిన బాబు..
‘‘రాజన్న రాజ్యంలో ప్రతి కుటుంబం సంతోషంగా ఉండేది. రైతులు, మహిళలు, విద్యార్థులు.. ఇలా అంతా భరోసాగా గడిపారు. ఫోన్ చేసిన 20 నిమిషాలకే కుయ్ కుయ్ అంటూ వచ్చే 108 ఉండేది. ముఖ్యమంత్రి హోదాలో అందరికీ మేలు చేసిన వ్యక్తి వైఎస్సార్. కులమతాలు, పార్టీలకు అతీతంగా వైఎస్ రాజశేఖరరెడ్డి అందరికీ మేలు చేశారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలనలో ఏ ఒక్క వర్గమైనా సంతోషంగా ఉందా? టీడీపీ నేతలు మినహా ఎవరైనా సంతోషంగా ఉన్నారా? రైతులు, డ్వాక్రా మహిళలకు పూర్తి రుణమాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చాక వారిని ఘోరంగా దగా చేశారు చంద్రబాబు. పసుపు – కుంకుమ అంటూ మభ్యపెడుతూ ఎంగిలి చెయ్యి విదిలిస్తున్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని హామీ ఇచ్చి మోసగించారు. ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారు. ఈ భారం భరించలేక ఎంతోమంది మధ్యలోనే చదువులు మానేస్తున్నారు. పేదలు ప్రభుత్వ ఆస్పత్రికే వెళ్లాలని శాసించాడు చంద్రబాబు. చంద్రబాబు కుటుంబంలో ఎవరికైనా జబ్బు చేస్తే ప్రభుత్వ ఆస్పత్రికి వెళతారా?
దొంగబాబును నమ్మితే నాశనమే..
మీ ఓటును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డబ్బులతో కొనాలని చూస్తున్నాడు. ఆయన ఎంత డబ్బిచ్చినా తీసుకోండి. కానీ ఆయన మీకున్న బకాయిలకు ఎంత డబ్బులిచ్చినా సరిపోదు. మీ భవిష్యత్తు నా బాధ్యత అంటూ తిరుగుతున్నాడు దొంగబాబు. మళ్లీ పదవి ఇస్తే అమరావతిని అమెరికా చేస్తాడట. మీ భవిష్యత్తు మరోసారి ఆయన చేతిలో పెడితే సర్వ నాశనం చేసేస్తాడు. ఆంధ్రప్రదేశ్ పాతాళానికి దిగజారుతుంది. దయచేసి ఆ పొరపాటు చేయకండి. జగనన్న ముఖ్యమంత్రి అయితే మళ్లీ రైతే రాజవుతాడు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంతోపాటు రాజన్న కలను సాకారం చేసేందుకు ప్రతి ఎకరాకూ నీళ్లిస్తారు’’
రాజన్నకే ఓటేస్తున్నట్లు భావించండి..
మీరంతా మండుటెండలను సైతం లెక్క చేయకుండా మాకోసం పనులు మానుకుని వచ్చారు. దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, మీరు దీవిస్తున్నారు. 11వ తేదీన ఎన్నికల్లో ఓటు వేసే సమయంలో ఒక్క క్షణం రాజన్న గురించి తలుచుకుని ఆయన కుమారుడికి ఒక్క అవకాశం ఇవ్వండి. చల్లటి గాలి వీచే ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి జగనన్నను గెలిపించండి. ఫ్యాన్ గుర్తుపై మీరు వేసే ప్రతి ఓటూ రాజన్నకే వేస్తున్నట్లేనని భావించండి.
ఇంత అసమర్థ సీఎం అవసరమా?
పోలవరం పూర్తి కాలేదు. అమరావతిలో ఒక్క శాశ్వత భవనం కూడా కట్టలేదు. హోదాను నీరుగార్చాడు. ఇంత అసమర్థ సీఎం మనకు అవసరమా? అందుకే బైబై బాబూ.. అంటూ అంతా చెప్పండి. రాష్ట్రానికి ఊపిరి లాంటి ప్రత్యేక హోదాను చంద్రబాబు నీరుగార్చినా జగనన్న ఊరూరా తిరిగి ప్రాణం పోశారు. ఇవాళ హోదా బతికి ఉందంటే
కారణం జగనన్న కాదా?
సీఎం ఎలా ఉండాలో వైఎస్సార్ చూపించారు
వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నది కేవలం ఐదేళ్లే.. ఒక ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి. తన ప్రజల గురించి ఇలాంటి ఆలోచనలు చేయాలి అని చేసి చూపించారు రాజశేఖరరెడ్డి. గత ఐదేళ్లుగా చంద్రబాబు సీఎంగా ఉన్నారు. ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండకూడదో, ఏ పనులు చేయకూడదో అవన్నీ చేశారు చంద్రబాబు.ఆయనది రెండు నాల్కల ధోరణి.అందుకే రెండు వేళ్లు చూపిస్తుంటారు.
ఇది పుత్రవాత్సల్యం కాదా?
బాబొస్తే జాబొస్తుందన్నారు. కానీ చంద్రబాబు కుమారుడు లోకేష్‌కు మాత్రమే వచ్చింది. ఈ పప్పుగారికేమో కనీసం జయంతికి, వర్థంతికి కూడా తెలియదు. ఒక్క ఎన్నికలో కూడా గెలవలేదు. ఏ అనుభవం, అర్హత ఉందని మూడు శాఖలకు మంత్రిని చేశారు? ఇది పుత్రవాత్సల్యం కాదా? ఈ పప్పుగారు ఏమైనా చాలా సమర్థుడా? చంద్రబాబు కుమారుడికైతే మూడు ఉద్యోగాలు.. యువతకు మాత్రం ఉద్యోగాలు లేవు.
అందుకే రెండు వేళ్లు చూపిస్తుంటాడు..
బాబు–మోదీ జోడీ కలసి మన రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను ఎగ్గొట్టారు. హోదాను నీరుగార్చేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. గత ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా అన్నారు. ఎన్నికలయ్యాక ప్యాకేజీ అన్నారు. ఇప్పుడు మళ్లీ హోదా అంటున్నారు. రేపు ఏమంటాడో ఆయనకే తెలియదు. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తన్నాడు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తంటున్నాడు. రోజుకో వేషం, పూటకో మాట. అందుకే రెండు వేళ్లు చూపిస్తూ తిరుగుతుంటారు. ఆయన్ను మించిన దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు మరొకడు ఉండడని ఎన్టీఆరే స్వయంగా చెప్పారు.
మాకు ఆ అవసరం లేదు..
కేసీఆర్‌తో పొత్తు కోసం వెంపర్లాడింది చంద్రబాబు కాదా? హరికృష్ణ మృతదేహం పక్కనే నిలబడి కనీసం ఇంగితం లేకుండా టీఆర్‌ఎస్‌తో పొత్తు గురించి మాట్లాడాడు. బీజేపీతో నాలుగేళ్లు సంసారం చేసి మాపై ఆరోపణలు చేస్తున్నాడు. మాకు బీజేపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్.. ఎవరితోనూ పొత్తు లేదు. మాకు ఆ అవసరం కూడా లేదు. సింహం సింగిల్‌గానే వస్తుంది. వైఎస్సార్ సీపీ పొత్తులు లేకుండా సింగిల్‌గానే బంపర్ మెజార్టీతో గెలుస్తుందని దేశంలోని అన్ని సర్వేలు చెబుతున్నాయి.
రైతులను పిట్టల్లా కాల్పించిన బాబు
చంద్రబాబు వ్యవసాయం దండగన్నాడు. ఉచిత విద్యుత్తును హేళన చేశాడు. రైతులు అప్పుల పాలై ఆందోళన చేస్తే హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో పిట్టల్ని కాల్చినట్టు కాల్పించాడు. హృదయం లేని వ్యక్తి చంద్రబాబు. గత ఎన్నికల్లో 600కిపైగా హామీలిచ్చి ఒక్కటీ నిలబెట్టుకోకుండా ఇప్పుడు కొత్త హామీలిస్తున్నాడు. నిన్ను నమ్మం బాబూ అనిఅంతా చెప్పండి. చంద్రబాబుకు వాగ్దానాలను నిలబెట్టుకునే దమ్ముంటే మీకిచ్చిన హామీలను బకాయిలతో సహా చెల్లించమని నిలదీయండి. ఆడపిల్ల పుడితే రూ.25 వేలు చొప్పున ఇస్తానన్నాడు. కాలేజీ విద్యార్థులకు ఐప్యాడ్లు, మహిళలకు స్మార్ట్ ఫోన్లు ఇస్తానన్నాడు. ఎవరికైనా ఇచ్చాడా? ఎన్నికలలోపు హామీలను నెరవేర్చమని మీరంతా చంద్రబాబును నిలదీయండి. అది మీ హక్కు. ఇంటికో ఉద్యోగం లేదంటే రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తానని హామీ ఇచ్చాడు. ఆ లెక్కన చంద్రబాబు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి నెలకు రూ.2 వేల చొప్పున ఐదేళ్లకుగానూ రూ. 1.20 లక్షలు బాకీ పడ్డారు. చంద్రబాబు ఓట్లు అడిగేందుకు వచ్చినప్పుడు ఆ బాకీలు తీర్చమని అంతా నిలదీయండి.
Comments
Please login to add a commentAdd a comment