శనివారం గుంటూరు జిల్లా తాడికొండలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తున్న షర్మిల. హాజరైన జనసందోహంలో ఓ భాగం
పోలవరం ప్రాజెక్టు అంచనాలను కమీషన్ల కోసం రూ.60 వేల కోట్లకు పెంచాడు. అమరావతి పేరుతో వేల ఎకరాలను తన బినామీలకు రాసిచ్చేశాడు. కేంద్ర ప్రభుత్వం రాజధానికి రూ.2,500 కోట్లు ఇస్తే శాశ్వత భవనం ఒక్కటి కూడా నిర్మించలేదు. ఇంత చేతకాని సీఎం మనకు అవసరమా? ఐదేళ్లలో శాశ్వత భవనం ఒక్కటి కూడా నిర్మించలేని వ్యక్తి ఇంకో ఐదేళ్లు అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నంబర్‌వన్‌గా చేస్తాడట.
‘బాబొస్తే జాబొస్తుందన్నాడు. ఎవరికి వచ్చింది? చంద్రబాబు కుమారుడు లోకేష్‌కే వచ్చింది.ఈ పప్పు గారికి కనీసం జయంతికి, వర్థంతికి కూడా తేడా తెలియదు. ఏకంగా మూడు శాఖలకు మంత్రై కూర్చున్నాడు. ఒక్క ఎన్నికలో కూడా గెలవలేదు ఈ పప్పు. ఏ అర్హత ఉందని ఈ పప్పును జనాల నెత్తిన రుద్దారు? చంద్రబాబును అడుగుతున్నా ఇది పుత్రవాత్సల్యం కాదా? చిన్న పిల్లలకు చాకెట్లు ఇచ్చినట్లు, కుక్క పిల్లలకు బిస్కెట్లు వేసినట్లుగా కాకుండా చంద్రబాబుకు దమ్ముంటే గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవాలి. మన రాష్ట్రం మళ్లీ కళకళలాడాలంటే జగనన్న రావాలి.
అంతా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలి’
– శనివారం గుంటూరు ఎన్నికల ప్రచారంలో షర్మిల
సాక్షి, అమరావతి బ్యూరో: గత ఎన్నికల సమయంలో 600కిపైగా హామీలిచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చని సీఎం చంద్రబాబును బకాయిలు చెల్లించాల్సిందిగా ప్రజలంతా నిలదీయాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సోదరి షర్మిల పిలుపునిచ్చారు. చంద్రబాబు నుంచి బాకీలు వసూలు చేసుకోవడం ప్రజల హక్కన్నారు. ఎన్నికలు జరిగేలోగా.. హామీ ఇచ్చిన ప్రకారం బకాయిలన్నీ వడ్డీతో కలిపి చెల్లించాలని చంద్రబాబును గట్టిగా అడగాలని సూచించారు. ‘మీ భవిష్యత్తు – నా బాధ్యత’ అంటున్న చంద్రబాబుకు గత ఐదేళ్లుగా ఆ విషయం గుర్తు లేదా? అని షర్మిల ప్రశ్నించారు. తొమిదేళ్లకుపైగా ప్రజల్లోనే ఉంటూ విలువలతో కూడిన రాజకీయం చేస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. బస్సు యాత్ర చేపట్టిన షర్మిల రెండో రోజైన శనివారం ఉదయం గుంటూరు జిల్లా నందివెలుగు నుంచి బయల్దేరి గుంటూరు తూర్పు, పశ్చిమ, తాడికొండ నియోజకవర్గాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడారు. ఈ సభల్లో షర్మిల ఏమన్నారో ఆమె మాటల్లోనే..
నాడు వైఎస్సార్ భరోసా.. నేడు బాబు వంచన
‘‘వైఎస్సార్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు భరోసాగా జీవించారు. కులం, మతం, ప్రాంతం, ఏ పార్టీ అనే తేడాలు లేకుండా అందరికీ మేలు చేశారు. ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా చార్జీలు పెంచకుండా సంక్షేమ పథకాలను అద్భుతంగా అమలు చేసిన రికార్డు వైఎస్సార్ సొంతం. చంద్రబాబు పాలన వంచనతో సాగుతోంది. మొదటి సంతకానికే దిక్కు లేకుండా పోయింది. రుణమాఫీ అని వాగ్దానం చేసి రైతులను ఘోరంగా దగా చేసిన వ్యక్తి చంద్రబాబు. డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని ఐదేళ్లు గడిచినా పైసా కూడా మాఫీ చేయలేదు. ఇప్పుడు బిక్షం వేసినట్లు పసుపు– కుంకుమ అనే పవిత్రమైన పేరుతో మహిళలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఎంగిలి చేయి విదిలిస్తున్న బాబుకు మహిళలంతా బుద్ధి చెప్పాలి.
ఒక్కటైనా భవనం కట్టలేని సీఎం అవసరమా?
పోలవరం ప్రాజెక్టు అంచనాలను కమీషన్ల కోసం రూ.15 వేల కోట్ల నుంచి రూ.60 వేల కోట్లకు పెంచాడు. అమరావతి పేరుతో వేల ఎకరాలను తన బినామీలకు రాసిచ్చేశాడు. కేంద్ర ప్రభుత్వం రాజధానికి రూ.2,500 కోట్లు ఇస్తే శాశ్వత భవనం ఒక్కటి కూడా నిర్మించలేదు. ఇంత చేతకాని సీఎం మనకు అవసరమా? ఐదేళ్లలో శాశ్వత భవనం ఒక్కటి కూడా నిర్మించలేని వ్యక్తి ఇంకో ఐదేళ్లు అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నంబర్‌వన్‌గా చేస్తాడట. మన చెవిలో పువ్వులు ఏమైనా కనిపిస్తున్నాయా? బాబు–మోదీ జోడీ కలసి న్యాయబద్ధంగా మనకు రావాల్సిన, మన హక్కైన ప్రత్యేక హోదాను ఎగ్గొట్టారు. బీజేపీ మనకు ఇంత ద్రోహం తలపెట్టే సాహసం చేయడానికి కారణం చంద్రబాబే. ఆయన ఎదురు ప్రశ్నించడని వాళ్లకు గట్టి నమ్మకం. హోదాను నీరుగార్చే ప్రతి ప్రయత్నం చేశాడు చంద్రబాబు. గత ఎన్నికలకు ముందు హోదా అన్నాడు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్యాకేజీ అన్నాడు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు రావడంతో హోదా అంటున్నాడు. రేపు ఎన్నికలు అయిపోయిన తరువాత మళ్లీ ఏమంటాడో తెలియదు.
జగనన్న పోరాడకుంటే బాబు హోదా అనేవారా?
జగనన్న హోదా కోసం ఢిల్లీలో ధర్నా చేశాడు. రోజుల తరబడి నిరాహార దీక్షలు, బంద్‌లు, ధర్నాలు చేశారు. ప్రతి జిల్లాలో యువభేరీలు నిర్వహించి యువతను జాగృతం చేశాడు. వైఎస్సార్ సీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టి హోదా కోసం రాజీనామాలు కూడా చేశారు. జగనన్న ఊరూరా తిరిగి హోదా కోసం పోరాడకుంటే ఈరోజు చంద్రబాబు నోట హోదా కావాలి అనే మాట వచ్చేదా?
హరికృష్ణ శవం సాక్షిగా...
కేసీఆర్‌తో పొత్తు కోసం వెంపర్లాడింది చంద్రబాబే. హరికృష్ణ మృతదేహం పక్కనే నిలబడి ఏమాత్రం ఇంగితం లేకుండా టీఆర్‌ఎస్‌తో పొత్తుల గురించి మాట్లాడాడు. పొత్తుల కోసం ప్రయత్నించింది చంద్రబాబైతే మాకు కేసీఆర్‌తో పొత్తు ఉందని నిస్సిగ్గుగా ఆరోపణలు చేస్తున్నాడు. బీజేపీతో పొత్తు పెట్టుకుని నాలుగేళ్లు సంసారం చేసింది చంద్రబాబు. ఇప్పుడు మాకు బీజేపీతో పొత్తు ఉందని ఆరోపణలు చేస్తున్నాడు. మాకు కేసీఆర్‌తో, బీజేపీతో, కాంగ్రెస్‌తో ఎలాంటి పొత్తులు లేవు. మాకు ఆ అవసరం కూడా లేదు. ఎందుకంటే సింహం సింగిల్‌గానే వస్తుంది. వైఎస్సార్‌సీపీ ఎలాంటి పొత్తులు లేకుండానే ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలవబోతోందని దేశంలోని ప్రతి సర్వే చెబుతోంది.
బాకీ వసూలు మీ హక్కు..
చంద్రబాబు. 600 హామీలిచ్చి ఐదేళ్లలో ప్రజలకు ఎన్నిసార్లు వెన్నుపోటు పొడిచాడో మనమంతా చూశాం. ఎన్నికలు రావడంతో మళ్లీ ఎర వేస్తున్నాడు. కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య అని హామీ ఇచ్చాడు. ఈ ఐదేళ్లలో తల్లిదండ్రులు వారి పిల్లల కోసం చెల్లించిన ఫీజులు వడ్డీతో సహా చంద్రబాబు బకాయి పడ్డారు. ఆడపిల్ల పుడితే రూ.25 వేలు ఇస్తానన్నాడు. కాలేజీ విద్యార్థులకు ఐప్యాడ్లు ఇస్తానన్నాడు. మహిళలకు స్మార్ట్‌ఫోన్ ఇస్తానన్నాడు. ఈ బాకీలన్నీ ఎన్నికల లోపు తీర్చమని అడగండి. ఇంటికో ఉద్యోగం లేదంటే రూ.2 వేల చొప్పున భృతి చెల్లిస్తానన్నాడు. ఆ లెక్కన ఐదేళ్లకు రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ బాకీ పడ్డ రూ.1.20 లక్షలు చెల్లించమని చంద్రబాబును నిలదీయండి. అది మీ హక్కు. ప్రతి పేదవాడికీ 3 సెంట్ల చొప్పున భూమి ఇస్తానని వాగ్దానం చేశాడు చంద్రబాబు. పక్కా ఇళ్లన్నాడు. అమరావతి, విశాఖపట్నంలో వేల ఎకరాలను స్వాహా చేశాడు.ఆ భూమి అంతా మీదే. మీ భూమిని మీకు రాసిచ్చేయమని అడగండి. మీకు ఎంత రుణం ఉంటే అంత రుణం చంద్రబాబు మీకు బాకీ పడినట్లే. మీ బాకీని తీర్చమని హక్కుగా అడగండి.
ఐదేళ్లు గాడిదలు కాశారా?
ఎన్నికలు రావడంతో మీ ఓటును డబ్బుతో కొనాలని చంద్రబాబు చూస్తున్నాడు. మీకు డబ్బిస్తే తీసుకోండి. కానీ చంద్రబాబు ఎంత డబ్బిచ్చినా మీ బాకీ మాత్రం తీరదని గుర్తు పెట్టుకోండి. ఐదేళ్లు దగా చేసి ఇప్పుడు మీ భవిష్యత్తు – నా బాధ్యత అంటూ చెప్పుకుని తిరుగుతున్నాడు దొంగబాబు. మరి గత ఐదేళ్లు మీ భవిష్యత్తు ఆయన బాధ్యత కాదా? ఆయన కుమారుడిది ఒక్కటే ఆయన బాధ్యతా? ఈ ఐదేళ్లూ గాడిదలు కాశాడా? నిన్ను నమ్మం బాబూ.. అని మొహంపైనే చెప్పండి.
ఈ తొమ్మిదేళ్లూ విలువలతో కూడిన రాజకీయం చేసింది జగనన్న మాత్రమే. మన రాష్ట్రం మళ్లీ కళకళలాడాలంటే జగనన్న రావాలి. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలి. ఏప్రిల్ 11వతేదీన మీరంతా ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాజన్నను మీ గుండెల్లో తలుచుకుని ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయండి. మీకు సేవ చేయాలని తపిస్తున్న జగనన్నను గెలిపించండి. బైబై బాబు..
బైబై బాబు.. ఇదే ప్రజా తీర్పు కావాలి’’
‘జగనన్న రావాలి’ సీడీ ఆవిష్కరించిన షర్మిల
గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కారుమూరి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో రూపొందించిన ‘జగనన్న రావాలి’ పాటల సీడీని షర్మిల శనివారం ఆవిష్కరించారు. నవరత్నాల పథకాలను వివరించేలా పాటలను రూపొందించినట్లు వెంకటరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు షేక్ సలీం, అశోక్, రవికిరణ్ రెడ్డి, ఉప్పుటూరి నర్సిరెడ్డి, చల్లా శేషురెడ్డి, భాస్కర్ రెడ్డి, వేమూరు నియోజకవర్గ యువజన విభాగం నేతలు పాల్గొన్నారు.
– పట్నంబజారు(గుంటూరు)
Comments
Please login to add a commentAdd a comment