బాబు పాలనతో రాష్ట్రం పాతికేళ్లు వెనక్కి | YS Sharmila Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

బాబు పాలనతో రాష్ట్రం పాతికేళ్లు వెనక్కి

Published Tue, Mar 26 2019 4:51 AM | Last Updated on Tue, Mar 26 2019 10:00 AM

YS Sharmila Comments On Chandrababu At  - Sakshi

సాక్షి, అమరావతి: చంద్రబాబు అవినీతి పాలనతో రాష్ట్రం 25 ఏళ్లు వెనక్కి పోయిందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు. భూతద్దం పెట్టి వెతికినా రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడా కనిపించదన్నారు. వైఎస్సార్‌ హయాంలో కళకళలాడిన రాష్ట్రాన్ని ఇప్పుడు చూస్తే ఎంతో బాధేస్తుందన్నారు. రుణమాఫీ జరగక, గిట్టుబాటు ధరల్లేక.. రైతులు, ఉద్యోగ అవకాశాల్లేక యువత, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ రాష్ట్రానికి మంచి రోజులు రావాలంటే జగనన్న పాలన రావాల్సిన అవసరముందన్నారు. జగనన్నకు ఒక్కసారి అవకాశమిస్తే.. రాజన్న రాజ్యం తీసుకొస్తారని భరోసా ఇచ్చారు. సోమవారం విజయవాడలోని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో కలిసి షర్మిల మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆమె మాటల్లోనే.. 

వైఎస్సార్‌ హయాంలో అంతటా సంతోషమే..
‘‘ఈ ఎన్నికలు అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌కే చాలా కీలకం. రాష్ట్ర విభజన జరిగి, ప్రత్యేక హోదా రాని నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ఈ ఎన్నికలు చాలా కీలకం. వైఎస్‌ రాజశేఖరరెడ్డి కూతురిగా కాకుండా ఒక సామాన్యురాలిగా కొన్ని విషయాలు మాట్లాడతాను. ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులేమిటి? భూతద్దం పెట్టుకొని వెదికినా ఎక్కడైనా అభివృద్ధి కనిపిస్తుందా? ఎన్ని పెట్టుబడులు వచ్చాయి? ఎన్ని పరిశ్రమలు వచ్చాయి? ఉద్యోగాలొస్తున్నాయా? వ్యవసాయం మనకు వెన్నెముక కదా.. మరి రైతు బాగుపడుతున్నాడా? పేదవాడు సంతోషంగా ఉన్నాడా? పేద విద్యార్థికి భరోసా ఉందా? ఒకప్పుడు రాజశేఖరరెడ్డిగారి హయాంలో కళకళలాడిన రాష్ట్రమేనా ఇది.. అని ఒక్కసారి ఆలోచన చేస్తే చాలా బాధవేస్తోంది. రాజశేఖరరెడ్డి గారి హయాంలో పేద కుటుంబం సంతోషంగా ఉండేది. రైతు కుటుంబం ధైర్యంగా ఉండేది. పంటకు గిట్టుబాటు ధర ఉండేది. ప్రతి వ్యక్తికి ఉపాధి ఉండేది. పేద విద్యార్థి గొప్ప చదవులు ఉచితంగా చదువుకునేలా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఉండేది. పేదవాడు కూడా కార్పొరేట్‌ ఆస్పత్రికు వెళ్లి వైద్యం చేయించుకునేందుకు ఆరోగ్య శ్రీ ఉండేది. ప్రతి మహిళకు భరోసా ఉండేది. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రతి వర్గానికి మేలు చేసిన నాయకుడు మన రాజశేఖరరెడ్డి గారు. 

బాబు మొదటి సంతకానికే విలువ లేదు..
కానీ చంద్రబాబు హయాంలో ఎలా ఉంది? రాష్ట్రం పాతికేళ్లు వెనక్కి నెట్టబడినట్టుగా లేదా? మొదటి ఐదు సంతకాలు పెట్టిన చంద్రబాబు.. కనీసం మొదటి సంతకానికైనా విలువనిచ్చాడా? అధికారంలోకి రావడానికి రైతులకు మొత్తం రుణ మాఫీ అని వాగ్ధానం చేసి.. అదే మొదటి సంతకమవుతుందని చెప్పి.. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ రుణమాఫీ మీద సంతకం పెట్టకుండా.. దీనిపై ఓ కమిటీ వేస్తున్నట్లు మొదటి సంతకం పెట్టాడు. ఆ రోజు రైతుల మొత్తం రుణం రూ.87 వేల కోట్లు. ఈయన వేసిన కోటయ్య కమిటీ ఏమో.. ఆ రూ.87 వేల కోట్లను కాస్తా వివిధ సాకులు చూపించి రూ.24 వేల కోట్లకు కుదించింది. చంద్రబాబు ఈ రోజు వరకు అది కూడా పూర్తిగా చెల్లించలేదు. అంటే కేవలం అధికారం కోసం అబద్ధపు వాగ్ధానాలిచ్చాడంటే.. చంద్రబాబుది అధికార దాహం కాదా?

పసుపు కుంకుమ పేరుతో మభ్య పెట్టే యత్నం
డ్వాక్రా మహిళలకు మొత్తం రుణమాఫీ చేస్తానని చెప్పాడు. కానీ ఇటీవల ఆ శాఖకు సంబంధించిన మంత్రి పరిటాల సునీత అసెంబ్లీలో సమాధానమిస్తూ.. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేసే ఉద్దేశం లేదని ప్రకటించలేదా? ఆరోజు డ్వాక్రా మహిళలకున్న మొత్తం రుణం రూ.14 వేల కోట్లు. ఆయన వల్ల ఈరోజు మొత్తం రుణం రూ.25 వేల కోట్లకు చేరింది. అటు రూ.14 వేల కోట్లు కాకుండా.. రూ.24 వేల కోట్లు కాకుండా.. కేవలం రూ.6 వేల కోట్లతో భిక్షమేసినట్లు.. పసుపు, కుంకుమ అని పేరు పెట్టి ఓ బిల్డప్‌ ఇచ్చి.. వాళ్లకేదో గొప్ప మేలు చేస్తున్నట్లు మభ్యపెట్టే ప్రయత్నం చేయడం లేదా? ఒక్క రూపాయి రుణమాఫీ చేయకుండా ఇలా మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నాడంటే మహిళలను వంచించడం కాదా? ఒక సామాన్యురాలిగా అడుగుతున్నా.

రాజధానిలో రాజమౌళి గ్రాఫిక్స్‌..
పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.14 వేల కోట్లు నుంచి రూ.60 వేల కోట్లకు పెంచారు. కమీషన్ల ద్వారా లాభపడాలని, వాళ్లకు కావాల్సిన వారికి నామినేషన్‌ పద్ధతిలో ఇచ్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం నుంచి పోలవరంప్రాజెక్టును లాగేసుకున్నారు. ఈ ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తానని చంద్రబాబు వాగ్దానం చేశారు. చంద్రబాబుకు నిజంగానే మాట మీద నిలబడే నైజమే ఉంటే ఈ రోజు పోలవరం పూర్తయ్యేది కాదా? అమరావతి.. నాలుగు వేల ఎకరాలు.. ఎకరం రూ.3–4 కోట్ల విలువచేసే భూమిని కేవలం రూ.50 లక్షలకు తన బినామీలకు అమ్మేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టలేదా? ఇది అన్యాయం కాదా? రాజధానిపై రాజామౌళి దర్శకత్వంలో గ్రాఫిక్స్‌ చూపించారు. మనవాళ్లు సరిపోరని సింగపూర్‌ నుంచి ప్లానర్స్‌ను రప్పించారు. త్రీడి మోడళ్లను చూపించడం తప్ప ఇప్పటికి ఒక్క శాశ్వత భవనమైనా కట్టించారా? కానీ హైదరాబాద్‌లో తన ఇంటి కోసం చంద్రబాబు వందల కోట్ల ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసింది నిజం కాదా?  

విద్యార్థుల భవిష్యత్‌ను నాశనం చేశారు.
పేద విద్యార్థులు గొప్ప చదువులు చదువుకోకపోతే పేదరికం నుంచి బయటపడలేరని వైఎస్సార్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని అమలు చేశారు. కానీ చంద్రబాబు మాత్రం మేము ఫీజు మొత్తం ఇవ్వం.. కొంచెమే ఇస్తామని చెప్పి చివరకు అది కూడా ఇవ్వకపోతే ఎంతోమంది విద్యార్థులు చదువులు మానేయాల్సి వచ్చింది. చంద్రబాబు విద్యార్థుల భవిష్యత్‌ను ఖూనీ చేశారు. ఇక పేదవారు కూడా కార్పొరేట్‌ ఆస్పతిలో వైద్యం చేయించుకోవాలని వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక దీన్ని కూడా ఛిన్నాభిన్నం చేశారు. ఆరోగ్యశ్రీ జాబితా నుంచి ఎన్నో కార్పొరేట్‌ ఆస్పత్రులను తొలగించి.. పేదవాళ్లు కేవలం గవర్నమెంట్‌ ఆస్పత్రికే వెళ్లాల్సిన పరిస్థితి కల్పించారు. ఇది అమానుషం కాదా? చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులకు జబ్బులొస్తే గవర్నమెంట్‌ ఆస్పతికి వెళ్తారా? మంచి వైద్యం అందక పేదవాళ్లు చనిపోతే ఆ పాపం చంద్రబాబుది కాదా? 

బాబు సుపుత్రుడు లోకేశ్‌కి మాత్రమే జాబు..
బాబు వస్తే జాబు వస్తుందన్నారు. ఎవరికి వచ్చింది? చంద్రబాబు సుపుత్రుడు లోకేశ్‌కు మాత్రమే వచ్చింది. ఏకంగా మూడు శాఖలకు మంత్రిని చేశారు. జయంతికి, వర్ధంతికి కూడా తేడా తెలియని వ్యక్తి లోకేశ్‌. ‘అ, ఆ లు రావు కానీ అగ్రతాంబూలం నాకే’ అన్న చందాన ఒక ఎన్నికలో కూడా గెలవని వ్యక్తికి ఏ అర్హత, అనుభవం ఉందని మూడు శాఖలకు మంత్రిని చేశారు? చంద్రబాబు తన కొడుకుకు మూడు ఉద్యోగాలు ఇవ్వొచ్చు.. కానీ సామాన్య ప్రజలకు ఉద్యోగాలు ఉండవు.. నోటిఫికేషన్లూ ఇవ్వరు. ఇది దుర్మార్గం కాదా.. స్వార్థం కాదా.. అని నేను ఒక సామాన్యురాలిగా అడుగుతున్నా. తెలంగాణలో కేసీఆర్‌ కుమారుడు కేటీఆర్‌కు ఐటీ శాఖ ఇచ్చారని.. చంద్రబాబు కూడా ఆయన కుమారుడికి ఐటీ శాఖ ఇచ్చారు. కేటీఆర్‌ లాగా లోకేశ్‌ కూడా గొప్ప కంపెనీలు ఏమైనా తెచ్చాడా అని చూస్తే.. వీళ్లు గొప్పగా మైక్రోసాఫ్ట్‌ వస్తుందని ప్రచారం చేసిన 12 గంటల్లోనే.. మాకా ఉద్దేశం లేదని ఆ కంపెనీ యాజమాన్యం ప్రకటించింది. 

ప్రజల డేటాను దొంగలించారు.. 
కేవలం ప్రభుత్వం వద్ద మాత్రమే ఉండాల్సిన ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని లోకేశ్‌ దొంగతనం చేసి తనకు కావాల్సిన ప్రైవేట్‌ కంపెనీలకు ఇచ్చుకున్నాడు. ఏ కుటుంబంలో ఎంత మంది మహిళలున్నారు.. ఏ అకౌంట్‌లో ఎంత డబ్బు ఉన్నదనే విషయం ప్రైవేటు కంపెనీల చేతుల్లో పెట్టేశారు. దీనికి కారణం ఎవరో చంద్రబాబుకు తెలియదా? ఇప్పటికైనా ఆ డేటాను స్వాధీనం చేసుకుని దోషులను శిక్షిస్తారనుకుంటే.. అలా చేయకపోగా.. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఆరోపణలు చేయడం సిగ్గుచేటు. బాబు, మోదీ జోడీ కలసి ఆంధ్రకు రావాల్సిన ప్రత్యేక హోదాను ఎగ్గొటారు. బీజేపీ మనకు ద్రోహం చేసిందంటే దానికి కారణం చంద్రబాబే. హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అని అసెంబ్లీలో చంద్రబాబు ధన్యవాద తీర్మానం పెట్టలేదా? హోదా కోసం పోరాడతామంటే జైల్లో పెడతామని చంద్రబాబు బెదిరించలేదా? హోదా వచ్చిన రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయని చంద్రబాబు హేళన చేయలేదా? ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ హోదా కోసం పోరాటంలో భాగంగా విశాఖ వెళ్తే ఎయిర్‌పోర్ట్‌లో నిర్బంధించలేదా? వైఎస్సార్‌సీపీ నాయకులు హోదా కోసం అసెంబ్లీని ముట్టడిస్తే చంద్రబాబు వారిని అరెస్ట్‌ చేయించి ఉద్యమాన్ని అణచివేయడం నిజం కాదా? రాష్ట్రానికి కీలకమైన  ప్రత్యేకహోదాను నీరుగార్చిన చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా వేస్తామని చెప్పి ఈ ఐదేళ్లలో ఒక్కరికైనా రూ.25 వేలు ఇచ్చారా? ఎన్నికల హామీల్లో భాగంగా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు. కాలేజీ విద్యార్థులకు ఐపాడ్‌ ఇస్తాం అన్నారు.. ఇచ్చారా? ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు...ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి అన్నారు.. ఇవ్వలేదు. ఐదేళ్లలో నెలకు రూ.2 వేల ప్రకారం దాదాపు రూ.1.25 లక్షలు చంద్రబాబు ప్రతి ఇంటికీ బాకీ పడ్డారు. ప్రతి పేదవాడికి మూడు సెంట్ల భూమి, పక్కా ఇళ్లు అన్నారు.. కట్టించారా? చేనేతల మరమగ్గాలకు పూర్తి రుణమాఫీ అన్నారు. రూ.2 కే 25 లీటర్ల మినరల్‌ వాటర్‌ అన్నారు. వీటిలో ఏదీ అమలు చేయలేదు. నేను ఒక సామాన్యురాలిగా అడుగుతున్నా.

జన్మభూమి కమిటీలతో దోపిడీ
స్థానిక ప్రజాప్రతినిధులను పక్కనపెట్టి జన్మభూమి కమిటీలను నియమించి దోపిడీ చేశారు. లంచగొండితనం, దౌర్జన్యాలను ప్రోత్సహించడం, ఎక్కడ చూసిన మాఫియా అవినీతి, ఇసుక దగ్గర నుంచి వేల ఎకరాల భూస్కామ్‌ల వరకు, ప్రాజెక్టుల నుంచి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల వరకు ఎంతో అవినీతి జరిగిందనే విషయాన్ని ప్రజలు గమనించాలి. గత ఎన్నికల్లో చంద్రబాబు 600 హామీలు ఇచ్చారు. ఒక్కటి కూడా పూర్తిగా నిలబెట్టుకోలేదు. ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకున్నాను అని చెప్పి ఓట్లు అడగాల్సిన చంద్రబాబు ఆ విషయం చెప్పకుండా ఇప్పుడు మళ్లీ చందమామను తెచ్చి ఇస్తాను అంటే ప్రజలు నమ్మాలా..? చంద్రబాబు ప్రజల కోసం కాదు.. పదవి కోసం పథకాలు వేస్తారు. నిప్పు అని చెప్పుకుంటే.. తుప్పు నిప్పు అవుతుందా..? సెల్ఫ్‌డబ్బా కొట్టుకుంటే అది వాస్తవం అవుతుందా..?  ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా అమరావతిలో ఒక్క శాశ్వత భవనమైనా ఎందుకు లేదు? చేతనైతే నిజం చెప్పాలి.  

హోదా కోసం జగన్‌ ఢిల్లీలో ధర్నా చేశారు
ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు జగనన్న ఢిల్లీలో ధర్నాలు చేశారు. రాష్ట్రంలో రోజుల తరబడి నిరాహారదీక్షలు చేశారు. బంద్‌లు, రాస్తారోకోలు, ధర్నాలు, మానవహారాలు, కొవ్వొత్తుల ర్యాలీలు.. ఇలా ఈ ఐదేళ్లలో ఎన్నో కార్యక్రమాలు చేశారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాసం కూడా పెట్టారు. రాజీనామాలూ చేశారు. వైఎస్‌ జగన్‌ ఊరురా తిరిగి ప్రత్యేక హోదాపై పోరాటం చేయకపోతే, చంద్రబాబు నోట నుంచి ప్రత్యేకహోదా మాట వచ్చి ఉండేదా? హోదా వద్దు.. ప్యాకేజీ కావాలన్న చంద్రబాబును యూటర్న్‌ తీసుకునేలా చేసింది జగనన్న కాదా? ముందు హోదా అంటారు... తర్వాత ప్యాకేజీ అంటారు... ఇప్పుడు మళ్లీ హోదా అంటున్నారు... ముందేమో బీజేపీతో పొత్తు.. నేడు కాంగ్రెస్‌తో పొత్తు.. చంద్రబాబుది రోజుకో మాట, పూటకో వేషం ... ఆయనను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుతో పారిపోవాలి.  

ఓటేసే ముందు ఒక్క సారి ఆలోచించాలి
ఎన్నికల్లో ఓటేసే ముందు ప్రజలంతా ఆలోచించాలి. ఒక వైపు తండ్రి లాంటి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి.. ఎన్టీఆర్‌ పార్టీని కబ్జా చేసిన వ్యక్తి .. ఎన్టీఆర్‌ కుటుంబాన్ని వాడుకుని పక్కన పడేసిన వ్యక్తి. చంద్రబాబు ఎలాంటి వ్యక్తో ఆలోచించాలి. వ్యవసాయం దండగ అన్నాడు... ఉచిత విద్యుత్‌ను హేళన చేశాడు... రైతులు బషీర్‌బాగ్‌లో ఆందోళన చేస్తే వారిని కాల్చిపారేశాడు... గత ఎన్నికల్లో ఏఒక్క హామీ అమలు చేయలేదు. జగనన్న తొమ్మిదేళ్లు విలువలతో కూడిన రాజకీయాలు చేశారు. కాంగ్రెస్‌ను వీడితే కేసులు పెడతారని అనాడే తెలుసు, అప్పడే బెదిరింపులకు గురిచేశారు. జగనన్న అవినీతే చేసి ఉంటే కాంగ్రెస్‌ పార్టీని అప్పట్లో వీడేవాడా? ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం ఈ తొమ్మిదేళ్లు ఎన్నో కష్టాలు పడుతూ వైఎస్సార్‌సీపీని సగర్వంగా నడిపించారు. 3,684 కిమీ పాదయాత్ర ద్వారా జగనన్న కోట్లాది మంది ప్రజల కష్టాలను తెలుసుకున్నారు.

నాన్నలాగా కులాలకు వర్గాలకు అతీతంగా అందరికీ మేలు చేద్దామని ఆశపడుతున్నాడు. ఒక్క అవకాశం ఇవ్వకూడదా? మంచికి, చెడుకు జరుగుతున్న పోరాటంలో మంచినే గెలిపించాలి. ఆలోచించి ఓటేయాలి. అనుభవం ఉందని చెప్పుకొని అధికారంలోకి వచ్చి ఆ తర్వాత అందరినీ మోసం చేశారు. ఎందులో అనుభవం ఉంది. వెన్నుపోటు, స్వార్ధ రాజకీయాలు చేయడంలో, గోబెల్స్‌ ప్రచారంలో, ఆడ మగా తేడా లేకుండా క్యారెక్టర్‌ అసాసినేషన్‌ చేయడం (వ్యక్తిత్వ హననానికి పాల్పడటం)లో, హత్యలు చేయడం, మోసం చేయడం, హత్యలు చేసిన వారికి అభయం ఇవ్వడంలో అనుభవం ఉంది. అనంతపురంలో బహిరంగంగా తహసీల్దార్‌ కార్యాలయంలో ప్రసాద్‌రెడ్డి, తాడిపత్రిలో విజయభాస్కర్‌రెడ్డితో పాటు పలువురిని హత్యలు చేయించారు. గుంటూరులో నాగార్జున యూనివర్శిటీలో రిషితేశ్వరి మృతికి బాబూరావు కారణమని తెలిసి ఎందుకు చర్యలు తీసుకోలేదు? వనజాక్షిని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని జుట్టుపట్టుకుని ఈడ్చుకువెళ్లాడు. చంద్రబాబు ఏం చేయగలిగారు? అదే ఎమ్మెల్యేకు తిరిగి టిక్కెట్‌ ఇచ్చాడు. చంద్రబాబును మించిన దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు మరొకరు ఉండడు అని పిల్లను ఇచ్చిన ఎన్టీఆర్‌ అన్నారు. ప్రజలు దూరదృష్టితో ఆలోచించాలి. 

రాష్ట్రంలో పరిస్థితి గురించి ఆలోచించండి...
రాజ్యసభలో కేంద్రమంత్రి మాట్లాడుతూ పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ చాలా కిందిస్థాయిలో ఉందని చెప్పారు.  వ్యవసాయ దిగుబడిలో ఏపీ వెనుకబడి ఉందని వ్యవసాయ శాఖ చెప్పింది. ఒకప్పుడు  సుభిక్షంగా ఉన్న రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చింది. ఆంధ్రరాష్ట్రాన్ని అంతగా ప్రేమించిన వైఎస్సార్‌ కూతురిగా రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి చూసి బాధపడుతున్నా. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం దుర్మార్గుల చేతిలో చిక్కి అల్లాడుతోంది. ఇప్పుడు ప్రజలు పొరపాటు చేస్తే ఆంద్రప్రదేశ్‌ మళ్లీ పాతికేళ్లు వెనక్కు వెళ్తుంది. ఎన్నికలు పిల్లల భవిష్యత్తుకు చాలా కీలకం. మంచికి చెడుకు జరిగే పోరాటంలో మంచిని గెలిపించండి. సీఎం స్థానంలో ఉండేవాడు మంచివాడైతేనే ప్రజలకు మేలు కలుగుతుంది. ఆలోచించి ఓటేయండి.

డైరెక్టర్‌ చంద్రబాబు...యాక్టర్‌ పవన్‌ కల్యాణ్‌
పవన్‌ కల్యాణ్‌ ఒక యాక్టర్‌. డైరెక్టర్‌ చెప్పిందే యాక్టర్‌ చేస్తారు. పవన్‌ కల్యాణ్‌ రాజకీయ సినిమాకు చంద్రబాబు డైరెక్టర్‌.. జనసేనకు ఓటేస్తే చంద్రబాబుకు ఓటేసినట్లే. పవన్‌ నామినేషన్‌ వేయడానికి వెళ్తే అక్కడ పచ్చపార్టీ క్యాడర్‌ కనిపిస్తుంది.  

చంద్రబాబు ఐదేళ్లూ గాడిదలు కాశారా?
తెలంగాణ సీఎం కేసిఆర్‌కు చంద్రబాబుకు మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని చంద్రబాబు ఎలా అంటారు? అక్కడ కేసీఆర్‌ బంపర్‌ మెజారిటితో గెలిచారు. ఇక్కడేమో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బంపర్‌ మెజారిటీతో గెలవబోతోందని సర్వేలన్నీ చెబుతున్నాయి. ఈ రెండింటికీ లింకు కనిపిస్తోందా? మీ భవిష్యత్తు నా బాధ్యత అని చంద్రబాబు అంటున్నారు. ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? గాడిదలు కాశారా?..’’ అని షర్మిల నిలదీశారు.  కేంద్రం నుంచి నిధులు సరిగా రావడం లేదని సీఎం అంటున్నారని విలేకరులు ప్రశ్నించగా.. ఆ విషయం çబీజేపి నాయకురాలు పురందేశ్వరిని అడిగితే తనకంటే బాగా సమాధానం చెబుతారని అన్నారు. ఎన్నికల్లో తాను ప్రచారం చేసినా చేయకపోయినా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బంపర్‌ మెజారిటితో గెలుస్తుందని చెప్పారు. వైఎస్‌ కుటుంబంలో గొడవల వల్ల వివేకానంద రెడ్డిని కుటుంబసభ్యులే హత్య చేశారని చంద్రబాబు అంటున్నారని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘ఫ్యామిలీలో గొడవలు ఉంటే హత్యలు చేసుకుంటారా? మా పెదనాన్న జార్జిరెడ్డి లేరు. రెండో స్థానంలో ఉన్న మా నాన్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి లేరు.

ప్రస్తుతం ఇంటికి పెద్ద వ్యక్తిగా వివేకానందరెడ్డి ఉన్నారు. అలాంటి వ్యక్తిని కుటుంబ సభ్యులు హత్య చేసుకుంటారా? వివేకానందరెడ్డి హత్యను చూస్తే చేసింది మనుషులా? మృగాలా? అనిపిస్తుంది. బాధితులం మేం. బాధితులనే టార్గెట్‌ చేస్తే బాధితులేంచేస్తారు? ఒక వ్యూహంతో చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారు. వివేకానంద రెడ్డిపై మేము థర్డ్‌ పార్టీ విచారణకు డిమాండ్‌ చేస్తుంటే పవన్‌ కల్యాణ్‌ ఎందుకు అడగటం లేదు? మేం ఏమంటున్నాం. వైఎస్‌ రాజశేఖరరెడ్డి తండ్రి రాజారెడ్డిని చంపింది టీడీపీ వారే. అప్పుడు చంద్రబాబే ముఖ్యమంత్రి. ఇప్పుడు వివేకానందరెడ్డి హత్య జరిగింది. ఇప్పుడూ సీఎం చంద్రబాబే. నిజంగానే చంద్రబాబుకు ఏపాపం తెలియకపోతే తెలుగుదేశం పార్టీకి గానీ, మంత్రి ఆదినారాయణరెడ్డికి గానీ ఈ హత్యతో సంబంధం లేకపోతే థర్డ్‌ పార్టీ విచారణకు ఎందుకు అంగీకరించడం లేదు? దమ్ముంటే ధర్డ్‌ పార్టీ విచారణ వేయమని చెప్పండి..’ అని అన్నారు.

29వ తేదీ నుంచి ప్రచారం
29వ తేదీ మంగళగిరి నుండి ప్రచారం ప్రారంభిస్తామని విలేకరులు అడిగిన ప్రశ్నకు షర్మిల జవాబిచ్చారు. వైఎస్‌ విజయమ్మ కూడా ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు. మంగళగిరి నుంచే ఎందుకు ప్రారంభిస్తున్నారనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘పప్పుగారున్నారని.. అందుకే అక్కడి నుంచి ప్రచారం ప్రారంభిస్తున్నాను..’ అంటూ ఛలోక్తి విసిరారు. ఆంధ్రప్రదేశ్‌ అప్పులపాలైందని మీరు అన్నారు...ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్‌సీపీ ఇస్తున్న హామీలు ఎలా అమలుచేయగలరు? అని అడిగిన ప్రశ్నకు..  ‘వాటి గురించి ప్లానింగ్‌ ఉంది కాబట్టే జగన్‌ హామీ ఇచ్చారు. వైఎస్సార్‌సీపీని గెలిపిస్తే వాటిని అమలు చేసి చూపిస్తాం..’ అని చెప్పారు. ఐదేళ్ల కింద ఎన్నికల్లో ప్రచారం నిర్వహించి ఆ తర్వాత సమస్యలపై ప్రశ్నించలేదు...మళ్లీ ఎన్నికలు వచ్చాయి కదా అని వచ్చారు అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘నేను రాజకీయాలలో ఉన్నానా? నేను ఎమ్మెల్యే, ఎంపీని కాదు.. సామాన్యురాలిని. సామాన్యులు ఎప్పుడైనా ప్రశ్నించవచ్చు. ఇది కీలకమైన సమయం ఇప్పుడు పొరపాటు చేస్తే చరిత్ర మనల్ని క్షమించదు..’ అని చెప్పారు.  అంతకుముందు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘ ప్రజలకు అండగా నిలబడతామని అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజల సొత్తు ఏ విధంగా దోచుకోబడింది.. ఏ విధంగా మోసగించారు.. వ్యవస్థలను మేనేజ్‌ చేసుకుంటూ పరిపాలన ఎలా సాగించారు అన్నది మనం అందరం  చూశాం. దీనిపై వచ్చే ఏప్రిల్‌ 11వ తేదీన జరిగే ఎన్నికలలో ప్రజల తీర్పు ఇవ్వబోతున్నారు..’ అని అన్నారు.  

‘‘బీజేపీ మనకు ద్రోహం చేసిందంటే దానికి కారణం చంద్రబాబే. ‘హోదా వద్దు .. ప్యాకేజీ ముద్దు’ అని అసెంబ్లీలో చంద్రబాబు ధన్యవాద తీర్మానం పెట్టలేదా?..’’ 

చంద్రబాబుకు నిజం చెప్పడం చేతకాదు.. ముందు హోదా అంటారు.. తర్వాత ప్యాకేజీ అంటారు.. ఇప్పుడు మళ్లీ హోదా అంటున్నారు.. ముందేమో బీజేపీతో పొత్తు.. నేడు కాంగ్రెస్‌తో పొత్తు.. 
చంద్రబాబుది రోజుకో మాట, పూటకో వేషం.. ఆయనను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుతో పారిపోవాలి..’’ 

అబద్ధాలు చెబుతున్న చంద్రబాబు పెద్దమనిషి ఎలా అవుతారు..? నిప్పు అని చెప్పుకుంటే.. తుప్పు నిప్పు అవుతుందా..? సెల్ఫ్‌డబ్బా కొట్టుకుంటే అది వాస్తవం అవుతుందా..? ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్లలోనే హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానని చంద్రబాబు సెల్ఫ్‌డబ్బా కొట్టుకుంటున్నారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా అమరావతిలో ఒక్క శాశ్వత భవనమైనా ఎందుకు లేదు? అసత్యానికి మారుపేరు చంద్రబాబు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement