ఉక్కు ఫ్యాక్టరీని నష్టాల్లోకి నెట్టారు : వైఎస్‌ షర్మిల | YS Sharmila At Kancharapalem Public Meeting | Sakshi
Sakshi News home page

ఉక్కు ఫ్యాక్టరీని నష్టాల్లోకి నెట్టారు : వైఎస్‌ షర్మిల

Published Mon, Apr 8 2019 9:54 PM | Last Updated on Mon, Apr 8 2019 10:08 PM

YS Sharmila At Kancharapalem Public Meeting - Sakshi

సాక్షి, విశాఖపట్నం : వైజాగ్‌ను మెట్రో సిటీ, బొటానికల్‌ సిటీ చేస్తానని గొప్పలు చెప్పిన బాబు.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నష్టాల్లోకి నెట్టేశారని వైఎస్‌ షర్మిల మండిపడ్డారు. కంచరపాలెంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో 24వేల మంది ఉద్యోగులు ఉంటే.. ప్రస్తుతం నాలుగు వేల మందే ఉన్నారని తెలిపారు. కొత్త ఉద్యోగాలు వస్తాయనకుంటే.. ఉన్న ఉద్యోగాలు పోతున్నాయన్నారు. విశాఖలో భూములను చంద్రబాబు తన బినామీలకు దారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. భాగస్వామ్య సదస్సుతో ఇరవై లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు కనీసం ఒక్కటి కూడా రాలేదని ఎద్దేవా చేశారు. తీర ప్రాంత రహదారి ఏర్పాటు చేస్తానన్నారు అది కూడా చేయలేకపోయారని దుయ్యబట్టారు. పూర్తి ప్రసంగం షర్మిల మాటల్లోనే..

మహానేత మరణాన్ని జీర్ణించుకోలేక 700మంది
‘కుల, మత, ప్రాంతం, పార్టీలాంటి తేడా లేకుండా ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసిన వ్యక్తి ఒక్క వైఎస్సార్ మాత్రమే. ప్రతి పేదవాడికి అండగా, ప్రతి రైతుకు ధైర్యంగా కలిగించేలా, ప్రతి మహిళకు భరోసా కలిగించేలా దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి పరిపాలన అందించారు. ఒక్క పైసా పన్ను పెంచకుండా గొప్ప పరిపాలన అందించిన రికార్డు వైఎస్సార్‌ది. అందుకే ఆయన చనిపోయినా కోట్ల మంది ప్రజల గుండెల్లో ఇంకా బతికే ఉన్నారు. ఆ మహానేత మరణాన్ని జీర్ణించుకోలేక 700మంది మరణించారు. కానీ, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎలా ఉన్నారు. వెన్నుపోటుకు, అబద్ధాలకు, అవినీతికి, అరాచకాలకు మారుపేరు బాబు. రైతు రుణమాఫీ అంటూ చేసిన మొదటి సంతకానికే దిక్కులేదు. డ్వాక్రామహిళలకు రుణమాఫీ చేస్తానన్నారు. ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు.  ఐదేళ్లు ఏమి చేయకుండా పసుపు కుంకుమ అంటూ భిక్షం వేస్తున్నట్లు ఇస్తున్నారు. ఎంగిలి చేయి విదిలిస్తున్నారు. అక్కా చెల్లెళ్లు మోసపోకండమ్మా. కేవలం​ మహిళలను మభ్యపెట్టడానికి చంద్రబాబు డబ్బులు ఇస్తున్నారు. 

కమిషన్ల కోసమే పోలవరం..
ఆరోగ్యశ్రీలో కార్పొరేట్‌ ఆస్పత్రులను తీసేశారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు అయితే కార్పొరేట్‌ ఆస్పత్రిలో చికిత్స చేసుకోవాలట. సామాన్యులు అయితే ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవాలట. ఇదెక్కడి న్యాయం? ఇది అమానుషం కాదా. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడం లేదు. పిల్లలకు ఫీజు కట్టలేక తల్లిదంద్రులు కట్టలేక అప్పులు పాలు అవుతున్నారు. తల్లిదంద్రులను అప్పుల పాలు చేయకుండా మధ్యలోనే చదువులు ఆపేస్తున్నారు. పోలవరం.. కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టు. కానీ కమిషన్‌ మింగొచ్చనని చంద్రబాబు ఆ ప్రాజెక్టును తీసుకున్నారు. 15వేల కోట్లు ఉన్న పోలవరం ప్రాజెక్టును 60వేలకోట్లకు పెంచారు. నిజానికి ఇది కేంద్రం చేయాల్సిన ప్రాజెక్టు. కానీ కమీషన్‌ కోసం చంద్రబాబు తీసుకున్నారు.  మూడేళ్లలో పూర్తి చేస్తా అన్నారు. చేశారా?  చిత్తశుద్ది ఉంటే పోలవరాన్ని నిర్మించేవారు.

అమ్మకు అన్నం పెట్టనోడు..
నాకు అనుభవం ఉందని, హైదరాబాద్‌ను నేనే కట్టానని, అమరావతిని నేనే కడతా అన్నారు. ఒక్క పర్మినెంట్‌ బిల్డింగ్‌ అయినా కట్టారా? కేంద్ర ప్రభుత్వం 2500 కోట్ల రూపాయలు ఇస్తే ఒక్క బిల్డింగ్‌ కట్టలేదు. ఏమైంది ఆ డబ్బంతా? ఆ డబ్బంత చంద్రబాబు బొజ్జలో ఉంది. అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు పెట్టిస్తాడట. ఐదేళ్లు సీఎంగా ఉండి అమరావతి ఒక్క పర్మినెంట్‌ బిల్డింగ్‌ కట్టలేదు కానీ ఇంకో ఐదేళ్లు ఇస్తే అమెరికా చేస్తారాట. మన చెవిలో పూలు పెడతాడట. క్యాబేజీలు పెడతాడట. నమ్ముతారా? నిన్ను నమ్మం బాబు అని తేల్చి చెప్పండి.


తమ్ముడు కూడా అన్నలాగే.. 
బీజేపీతో నాలుగేళ్లు సంసారం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఆ పార్టీతో మాకు పొత్తు అని ఆరోపిస్తున్నారు.. నిజంగా మాకు పొత్తు ఉంటే.. కేసులన్నీ మాఫీ చేసుకునేవాళ్లం కదా?. కేసీఆర్‌తో పొత్తుకు వెంపర్లాడింది చంద్రబాబే.. హరికృష్ణ శవం పక్కన ఉండి పొత్తులకోసం ప్రయత్నించాడు. పొత్తులన్నీ ఈయన పెట్టుకుని.. ఇప్పుడు మాకు పొత్తులున్నాయని అంటున్నారు. మాకు బీజేపీతో గానీ, కాంగ్రెస్‌తో గానీ, కేసీఆర్‌తో గానీ.. పొత్తులేదు.. సింహం సింగిల్‌గానే వస్తుంది...జగన్‌ సింగిల్‌ గానే వస్తాడు. పార్టీ సింగిల్‌ గానే వస్తోంది. దేశంలోని అన్ని సర్వేలు వైఎస్సార్‌సీపీ బంపర్‌ మెజార్టీ సాధిస్తుందని చెబుతున్నాయి. నక్కలే గుంపులు గుంపులుగా వస్తాయి. అందుకే..మమతా బెనర్జీ, ఫరూక్‌ అబ్దుల్లా, కేజ్రీవాల్, దేవేగౌడ, పవన్‌ కళ్యాన్‌లను తోడు తెచ్చుకున్నారు. పవన్‌ ఒక యాక్టర్‌.. డైరెక్టర్‌ చంద్రబాబు. యాక్టర్‌ ఏం చేయాలి.. డైరెక్టర్‌ చెప్పింది చెయ్యాలి.. అందుకే బాబు చెప్పినట్లు పవన్‌ చేస్తున్నారు. అందుకే జేడీ లక్ష్మీనారాయణ జనసేనలో చేరారు. పవన్‌ అన్న చిరంజీవి.. ఏం చేశారో గుర్తుంది కదా? కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. చివరకు హోల్‌సేల్‌గా కాంగ్రెస్‌కు అమ్మేశారు.. పవన్‌ కూడా జనసేనను హోల్‌సేల్‌గా అమ్మేస్తారు.. కాకపోతే టీడీపీకి అమ్మేస్తారు. 

ఈ నెల 11న ఎన్నికలు ఉన్నాయి. ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాజన్నను తలచుకోండి. రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న సీఎం కావాలి. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతుకి పెట్టుబడి సాయం కింద ప్రతి మే మాసంలో రూ. 12500 రూపాయలు ఇస్తారు.  గిట్టుబాటు ధరకై మూడు వేల కోట్ల రూపాయలతోతో ఒక నిధి ఏర్పాటు చేస్తారు. డ్వాక్రా రుణాలు నాలుగు విడతల్లో మాఫీ చేస్తారు. సున్నా వడ్డికే రుణాలు ఇస్తారు. కాలేజీ విద్యార్థులు ఏ కోర్సు అయినా చదవచ్చు. ఏ కోర్సు చదివిన ప్రభుత్వం ఉచితంగా చదివిస్తుంది. ఆరోగ్య శ్రీలో కార్పొరేట్‌ ఆస్పత్రిలను చేరుస్తాం. పిల్లలను బడికి పంపించడానికి తల్లిదండ్రులకు రూ. 15వేలు ఇస్తాం. అవ్వలకు తాతలకు పెన్షన్లు రూ. రెండు వేల నుంచి క్రమంగా మూడు వేలకు పెంచుతాం. వికలాంగులకు పెన్షన్లు మూడు వేలు ఇస్తాం. 45 సంవత్సరాల దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకి 75 వేల రూపాయిలు అందిస్తాం. విశాఖ నార్త్‌ నుంచి ద్రోణంరాజు శ్రీనివాస్‌.. విశాఖ వెస్ట్‌ విజయ్‌ ప్రసాద్‌ మల్లా.. ఎంపీ అభ్యర్థి  ఎంవీవీ సత్యనారాయణను భారీ మెజార్టీతో గెలిపించండ’ని ప్రజలను కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement