టీడీపీకి హోల్‌సేల్‌గా అమ్మేస్తాడు: వైఎస్‌ షర్మిల | YS Sharmila Sharmila Speech In Narsapuram Public Meeting | Sakshi
Sakshi News home page

జనసేనను టీడీపీకి హోల్‌సేల్‌గా అమ్మేస్తాడు: వైఎస్‌ షర్మిల

Published Fri, Apr 5 2019 10:26 PM | Last Updated on Fri, Apr 5 2019 10:35 PM

YS Sharmila Sharmila Speech In Narsapuram Public Meeting - Sakshi

సాక్షి, నరసాపురం: చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌ పార్టీకి హోల్‌సేల్‌గా అమ్మేస్తే.. పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడో ఎప్పుడో ఒకసారి టీడీపీకి హోల్‌సేల్‌గా అమ్మేస్తారని వైఎస్‌ షర్మిల జోస్యం చెప్పారు. 2019 రాజకీయ సినిమాలో యాక్టర్‌ పవన్‌ కల్యాణ్‌ అయితే డైరెక్టర్‌ చంద్రబాబు నాయుడని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నర్సాపురంలో వైఎస్‌ షర్మిల ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఇంకా షర్మిల మాట్లాడుతూ..‘  ప్రతి పేదవాడు కార్పొరేటు ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకునే ఆరోగ్యశ్రీ ఉండేది. ఫోన్‌ చేస్తే 20 నిమిషాల్లో వచ్చే 108  ఉండేది. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని వైఎస్సార్‌ శ్రమించారు. ప్రతి పేదవాడికి ఇళ్లు ఇవ్వాలని ఆశపడ్డారు. ఐదేళ్లలో ఒక్క రూపాయి  చార్జీ పెంచకుండా.. ఏ పన్ను పెంచకుండా.. అన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేసి సీఎం ఎలా ఉండాలో వైఎస్సార్‌ చూపించారు. కులం, మతం, పార్టీలతో సంబంధం లేకుండా వైఎస్సార్‌ ప్రతి ఒక్కరికి మేలు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా మేలు చేసింది వైఎస్సార్‌ మాత్రమే. అందుకే ఆ మహానేత చనిపోయి పదేళ్లు కావస్తున్నా కోట్ల మంది గుండెల్లో బ్రతికే ఉన్నారు. చంద్రబాబు అవినీతి, అరాచకానికి, వెన్నుపోటుకు, దౌర్జన్యానికి మారుపేరు. రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేస్తాడు. మాట తప్పుతాడు. హామీ ఇచ్చిన మొదటి సంతకానికే దిక్కులేకుండా చేశాడ’ని విమర్శించారు.

ఎన్నికల వేళ పసుపు-కుంకుమ పేరుతో డ్వాక్రా మహిళలకు ఎంగిలి చేయి విదిలిస్తున్నాడని అక్క చెల్లెమ్మలు మోసపోవద్దని కోరారు. ఇంతకు ముందు చేసిన రుణమాఫీ కనీసం వడ్డీకి కూడా సరిపోలేదని విమర్శించారు. ఫీజురీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయకుండా విద్యార్థులను ఇబ్బందిపెడుతున్నాడని, ఆరోగ్యశ్రీ నుంచి కార్పొరేటు ఆసుపత్రులను తొలగించాడని ఆరోపించారు. చంద్రబాబు కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం బాగా లేకపోతే గవర్నమెంటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటారా అని ప్రశ్నించారు. 

కమీషన్ల కోసం పోలవరం తానే కడతానన్నారు
జాతీయ హోదా ఉన్న పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం కట్టాలి.. కానీ కమీషన్ల కోసం తానే కడతానంటూ పోలవరం ప్రాజెక్టును ఆలస్యం చేశాడు.. పైపెచ్చు రూ.60 వేల కోట్ల మేర అంచనాలు పెంచుకుని వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు.  గత ఎన్నికల సమయంలో రాజధాని కట్టే అనుభవం ఉందని ఓట్లు వేయించుకున్నాడు... అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం రాజధాని నిర్మాణానికి రూ.2500 కోట్లు ఇస్తే ఒక్క పర్మినెంటు బిల్డింగ్‌ కూడా కట్టలేదని విమర్శించారు.  జయంతికి, వర్థంతికి తేడా తెలియని నారా లోకేష్‌కు ఏం అర్హత ఉందని మూడు శాఖలకు మంత్రిని చేశారని సూటిగా ప్రశ్నించారు.

ఏపీకి ప్రత్యేక హోదా సంజీవని
కొత్త పరిశ్రమలు రావాలంటే ప్రత్యేక హోదా కావాలని, ప్రత్యేక హోదా వైఎస్‌ జగన్‌ వల్లే ఇప్పటికీ సజీవంగా ఉందని వైఎస్‌ షర్మిల అన్నారు. కేసీఆర్‌తో పొత్తుపెట్టుకోవడానికి వెంపర్లాడింది చంద్రబాబేనని, వాళ్లు ఒప్పుకోకపోవడంతో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుందీ చంద్రబాబేనని అన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు ఏ పార్టీతోనూ పొత్తు లేదని, మేము సింగిల్‌గానే పోటీ చేస్తున్నామని చెప్పారు.

ప్రతి రైతుకు మే నెలలో రూ.12,500
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ప్రతి రైతు కుటుంబానికి రూ.12,500, పిల్లల్ని బడులకు పంపే ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు, 45 ఏళ్లు దాటిన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు రూ.75 వేలు ఇస్తామని చెప్పారు. అలాగే డ్వాక్రా మహిళలకు నాలుగు దఫాల్లో పూర్తి రుణం మాఫీ చేసి, తిరిగి సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తామని చెప్పారు. విద్యార్థులకు పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు ఏడాది మెస్‌ ఖర్చులకు గానూ రూ.20 వేలు చెలిస్తామన్నారు. పార్టీ పెట్టిన మొదటి నుంచి వైఎస్సార్‌ కుటుంబానికి అండగా ఉన్న నరసాపురం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ముదునూరి ప్రసాద రాజు, ఎంపీ అభ్యర్థి రఘురాం కృష్ణంరాజుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement