సాక్షి, పశ్చిమ గోదావరి : గత ఎన్నికల్లో జాబు రావాలంటే బాబు రావాలని చెప్పిన చంద్రబాబు కేవలం తన కొడుక్కు మాత్రమే ఉద్యోగం ఇచ్చుకున్నాడని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల విమర్శించారు. అఆలు కూడా పుప్పు గారికి మూడు మంత్రి పదవులు అవసరమా అని ఆమె ప్రశ్నించారు. టీడీపీ మోసపూరిత హామీలను నమ్మొద్దని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గారడీ బాబుకు ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న సీఎం కావాలి. అయిదేళ్లు అధికారంలో ఉండి అధ్వాన పాలన అందించిన చంద్రబాబును ‘నిను నమ్మం బాబు’ అని సాగనంపాలని పిలుపునిచ్చారు. ‘కేజీ నుంచి పీజీ విద్య, ఆడపిల్ల పుడితే రూ.25 వేలు, నిరుద్యోగులకు నెలకు రూ.2 వేలు ఇస్తామన్న బాబు సర్కారు మాట తప్పింది. టీడీపీకి ఓటు వేయాలని మీ ఇంటికొచ్చిన తెలుగుదేశం నాయకులను అడగండి. హామీలను అమలు చేయకుండా బాకీ పడిన సొమ్ము సంగతి తేల్చండని నిలదీయండి’ అని ప్రజలను కోరారు. బస్సు యాత్ర నిర్వహిస్తున్న షర్మిల గురువారం పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...
బాబుకు ఒంటరిగా వచ్చే సీన్ లేదు..
‘మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రైతుకి పెట్టుబడి సాయం కింద ప్రతి మే మాసంలో రూ. 12500 రూపాయలు ఇస్తారు. గిట్టుబాటు ధరకై 3 వేల కోట్ల రూపాయలతో నిధి ఏర్పాటు చేస్తారు. డ్వాక్రా రుణాలు నాలుగు విడతల్లో మాఫీ చేస్తారు. సున్నా వడ్డికే రుణాలు ఇస్తారు. కాలేజీ విద్యార్థులు ఏ కోర్సు అయినా చదవచ్చు. ఏ కోర్సు చదివిన ప్రభుత్వం ఉచితంగా చదివిస్తుంది. ఆరోగ్య శ్రీలో కార్పొరేట్ ఆస్పత్రులను చేరుస్తాం. పిల్లలను బడికి పంపించడానికి తల్లిదండ్రులకు రూ. 15వేలు ఇస్తాం. అవ్వలకు తాతలకు పెన్షన్లు రూ. రెండు వేల నుంచి క్రమంగా మూడు వేలకు పెంచుతాం. వికలాంగులకు పెన్షన్లు మూడు వేలు ఇస్తాం. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ మహిళలకు ఆర్థికసాయంగా రూ.75వేలు ఇస్తాం.
మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుపై వేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిడదవోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా జి.శ్రీనివాసనాయుడు, రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా మార్గాని భరత్‌ను గెలిపించండి. జగనన్నకు ఒక్క అవకాశం ఇవ్వండి. చంద్రబాబు అబద్దాలు ప్రచారం చేస్తూ కేసీఆర్‌తో పొత్తు పెట్టుకుంటున్నామని ఆరోపిస్తున్నారు. మాకు ఎవరితో పొత్తు అవసరం లేదు. సింహం సింగిల్ గానే వస్తుంది. నక్కలే గుంపులుగా వస్తాయి. అందుకే చంద్రబాబు కాంగ్రెస్, జనసేనతో కలిసి వస్తున్నారు. ఏ పొత్తు లేకుండా చంద్రబాబు ఇంతవరకు ఎన్నికలకే రాలేదు. 11వతేది ఎన్నికలు ఉన్నాయి. ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాజన్నను తలచుకోండి’ అని వైఎస్ షర్మిల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment