ఆమరణ దీక్ష చేస్తున్న ఎంపీలు మిథున్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డిని పరామర్శిస్తున్న వైఎస్ విజయమ్మ
సాక్షి, న్యూఢిల్లీ, న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: విభజన వల్ల అన్ని విధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు వెంటనే ప్రత్యేక హోదా ఇవ్వాలని ఇంత పెద్దఎత్తున పోరాటం చేస్తున్నా కేంద్రం లెక్కలేనితనంతో వ్యవహరిస్తోందని వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విమర్శించారు. ‘ఏపీ అంటే అంత లెక్కలేని తనమా? మా ప్రజల ఆకాంక్ష పట్టదా?’ అని ప్రశ్నించారు. విజయమ్మ సోమవారం ఢిల్లీలోని రామ్‌మనోహర్ లోహియా ఆసుపత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న వైఎస్సార్‌సీపీ ఎంపీలను పరామర్శించారు.
అంతకుముందు ఏపీ భవన్‌లో వైఎస్సార్ సీపీ ఎంపీల నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపి దీక్షా వేదిక వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు భేషజాలకు పోకుండా ఇప్పటికైనా టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయించి హోదా సాధన పోరాటంలో కలిసి రావాలని, జీవిత చరమాంకంలోనైనా మంచిపేరు తెచ్చుకోవాలని సూచించారు. అంతా కలసి పోరాడుదామని చంద్రబాబుకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. ‘ప్రధానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఇచ్చిన హామీని నెరవేర్చాలని పాదాలకు నమస్కారం చేసి కోరుతున్నా’ అని విజయమ్మ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment