
సాక్షి, న్యూఢిల్లీ: ఐదుకోట్ల ఆంధ్రులకు అపర సంజీవని వంటి ప్రత్యేక హోదా సాధన కోసం హస్తిన వేదికగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల పోరాటం కొనసాగుతూనే ఉంది. హోదా కోసం వైఎస్సార్ సీపీ ఎంపీలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. ఆరోగ్యం క్షీణించడంతో ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని బలవంతంగా ఆస్పత్రికి తరలించగా.. ఎంపీలు మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాశ్‌రెడ్డి మొక్కవోని సంకల్పంతో దీక్ష కొనసాగిస్తున్నారు. వారికి సంఘీభావం తెలిపిన పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఎంపీలతోపాటు దీక్షలో కూర్చున్నారు. వైఎస్ విజయమ్మతోపాటు వైఎస్సార్ సీపీ నేతలు రోజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు దీక్షలో కూర్చున్నారు.
చంద్రబాబుది యూటర్న్..!
తమ శక్తి మేరకు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామని, రాజకీయాలు పక్కనబెట్టి ఇకనైన టీడీపీ ఎంపీలు తమతో కలిసి రావాలని దీక్ష కొనసాగిస్తున్న ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. ఇది రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన సమస్య అని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోయిందని, ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని అన్నారు. గతంలో హోదా కోసం ఉద్యమాలు చేస్తే చంద్రబాబు అరెస్టు చేయించారని, గత నాలుగేళ్లలో ఒక్కసారి కూడా హోదా కోసం డిమాండ్ చేయని చంద్రబాబు.. ఇప్పుడు ప్రజల్లో తనపై వ్యతిరేకత వస్తుండటంతోనే యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు.
మోదీ ఇచ్చిన హామీనే నెరవేర్చాలని అడుగుతున్నాం..!
తిరుమల వెంకన్న సాక్షిగా నరేంద్రమోదీ ఇచ్చిన హామీని నెరవేర్చాలని తాము అడుగుతున్నామని, ఇప్పటికైనా కేంద్రం దిగివచ్చి ప్రత్యేక హోదా డిమాండ్‌ను నెరవేర్చాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ప్రత్యేక హోదా వస్తే ఏపీ అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందని అన్నారు. టీడీపీ ఎంపీలు కడుపునిండా భోజనం చేసి స్పీకర్ చాంబర్‌లో నిద్రపోయారని ఎద్దేవా చేశారు. పబ్లిసిటీ కోసమే టీడీపీ ఎంపీలు ధర్నా చేస్తున్నారని విమర్శించారు. బీజేపీతో లాలూచీ పడ్డ టీడీపీ ఎంపీలు తమను విమర్శించడానికి సిగ్గు పడాలని రోజా మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment