
సాక్షి, అమరావతి: శాసనమండలిలో ఖాళీ అయిన మూడు ఎమ్మెల్సీ సీట్లకు త్వరలో జరిగే ఉప ఎన్నికలకు వైస్సార్‌సీపీ అభ్యర్థులను పార్టీ ప్రకటించింది. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న మోపిదేవి వెంకటరమణ, మైనార్టీ నాయకుడు మహ్మద్ ఇక్బాల్, కర్నూలు జిల్లా సీనియర్ నాయకుడు చల్లా రామకృష్ణారెడ్డి పేర్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఖరారు చేశారు. ఈమేరకు సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఈ నెల 14వ తేదీతో ఎన్నికల నామినేషన్‌కు గడువు ముగియనుండడంతో వైఎస్సార్‌సీపీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. చల్లా ఈ నెల 13 లేదా 14వ తేదీన నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఎన్నిక లాంఛనమే..
మండలిలో ఖాళీ అయిన మూడు స్థానాలూ ఎమ్మెల్యేల కోటాకు సంబంధించినవే. ప్రస్తుత బలాబలాలను బట్టి చూస్తే మూడు స్థానాలూ వైఎస్సార్‌సీపీ ఖాతాలోనే చేరనున్నాయి. ఉప ఎన్నికల ఓటింగ్‌ను ఈ నెల 26వ తేదీన నిర్వహించి, అదే రోజున ఫలితాన్ని ప్రకటిస్తారు. టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు సంఖ్యా బలం లేకపోవడంతో మూడు స్థానాలు ఏకగ్రీవమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. కావున ముగ్గురూ ఎమ్మెల్సీలుగా ఎన్నిక కావడం లాంఛనమే.
చల్లా స్థానం.. విశిష్టం
కర్నూలు జిల్లా రాజకీయాల్లో చల్లా రామకృష్ణారెడ్డికి విశిష్టమైన స్థానం ఉంది. ఆయన స్వగ్రామం అవుకు మండలం ఉప్పలపాడు. తండ్రి చల్లా చిన్నపురెడ్డి. కుమారులు చల్లా భగీరథరెడ్డి, చల్లా విఘ్నేశ్వరరెడ్డి, కుమార్తెలు బృంద, పృథ్వీ. ఈయన 1983లో పాణ్యం ఎమ్మెల్యేగా గెలిపొందారు. 1989లో డోన్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1991లో నంద్యాల పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి చవిచూశారు. 1994లో కోవెలకుంట్ల అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు కర్రా సుబ్బారెడ్డి, ఎర్రబోతులను ఓడించి.. రెండు పర్యాయాలు భారీ మెజార్టీతో గెలుపొందారు. 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కోవెలకుంట్ల స్థానం కనుమరుగయ్యింది. ఈ నియోజకవర్గంలోని దొర్నిపాడు, ఉయ్యాలవాడ మండలాలు ఆళ్లగడ్డలోకి విలీనమయ్యాయి.
కోవెలకుంట్ల, అవుకు, సంజామల, కొలిమిగుండ్ల, బనగానపల్లె మండలాలతో బనగానపల్లె నియోజకవర్గం ఏర్పడింది. ఈ క్రమంలో బనగానపల్లె నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన చల్లా అప్పటి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి టికెట్ రాకపోవడంతో టీడీపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థి బీసీ జనార్దనరెడ్డిని ఒంటి చేత్తో గెలిపించారు. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వంలో ఏపీ సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆ పదవికి, పార్టీకి రాజీనామా చేసి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్సార్ సీపీ బనగానపల్లె అభ్యర్థి కాటసాని రామిరెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించారు. పార్టీకి చల్లా చేసిన సేవలను గుర్తిస్తూ ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment