సీఎం వైఎస్ జగన్‌తో నూతనంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు మోపిదేవి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని, సుభాష్ చంద్రబోస్. చిత్రంలో ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
సాక్షి, అమరావతి: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నలుగురూ విజయ భేరీ మోగించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణారావు 38 ఓట్ల చొప్పున సాధించడంతో నలుగురూ తొలి రౌండ్‌లోనే నెగ్గినట్లు రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు ప్రకటించారు. గెలుపొందిన నలుగురు అభ్యర్థులకు ఆయన శుక్రవారం రాత్రి సీఈవో విజయానంద్ సమక్షంలో ధ్రువీకరణ పత్రాలను అందచేశారు. ఓటింగ్‌కు ఇద్దరు శాసనసభ్యులు గైర్హాజరయ్యారని, 4 ఓట్లు చెల్లలేదని తెలిపారు. టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్యకు 17 ఓట్లు మాత్రమే రావడంతో ఓటమి పాలయ్యారు.
అధికార పక్షానికి 152 ఓట్లు...
శాసనసభలోని మొత్తం 175 ఓట్లు కనుక పోల్ అయి ఉంటే గెలిచేందుకు 36 ఓట్లు అవసరం అవుతాయి. అయితే 173 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, కె.అచ్చెన్నాయుడు ఓటింగ్‌లో పాల్గొనలేదు. మరోవైపు పోలైన వాటిల్లో కూడా నలుగురి ఓట్లు చెల్లకుండా పోయాయి. దీంతో గెలిచేందుకు ఒక్కొక్క అభ్యర్థికి 34 ఓట్లే అవసరం అయ్యాయి. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు తోడు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా మద్దతివ్వడంతో అధికార పక్షానికి 152 ఓట్లు వచ్చాయి. తమ పార్టీకి చెందిన నలుగురు అభ్యర్థులూ గెలుపొందడంతో వైఎస్సార్‌సీపీ నేతలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తల్లో ఆనందోత్సాహాలు వెల్లి విరిశాయి. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన గంటన్నర లోపే ఫలితాలన్నీ కొలిక్కి వచ్చాయి. రాజ్యసభ ఎన్నికలు ప్రాధాన్యత ఓటింగ్ పద్ధతిలో జరిగే అవకాశం ఉన్నప్పటికీ దాదాపుగా ఎమ్మెల్యేలంతా తొలి ప్రాధాన్యత ఓటునే ఎంపిక చేసుకోవడంతో లెక్కింపులో స్పష్టత వచ్చింది.
తొలి ఓటు ముఖ్యమంత్రి జగన్‌దే...
శాసనసభ కమిటీ హాల్–1లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉదయం 9.40 గంటల ప్రాంతంలో తొలి ఓటు వేసిన అనంతరం వైఎస్సార్‌సీపీ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఎం జగన్ తన ఓటును బీసీ వర్గానికి చెందిన పిల్లి సుభాష్‌చంద్రబోస్‌కు కేటాయించిన విషయం విదితమే. స్పీకర్ తమ్మినేని సీతారామ్ రెండో ఓటు వేశారు. తొలి రెండు గంటల్లోనే సుమారు 120 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 11.40 గంటల ప్రాంతంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ఓటు వేశారు. అందరికంటే చివరిగా సాయంత్రం 3.45 గంటలకు డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను సమన్వయం చేసి పోలింగ్ కేంద్రానికి రప్పించడం, వారంతా తమకు కేటాయించిన అభ్యర్థులకు ఓట్లు వేసేలా ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి పర్యవేక్షించారు.
టీడీపీకి మరికొందరు ఎమ్మెల్యేలు దూరం!
తగినంత బలం లేకున్నా అనవసరంగా రాజ్యసభ ఎన్నికల ప్రక్రియకు కారణమైన టీడీపీ అధినాయకత్వం మరి కొంతమంది ఎమ్మెల్యేల మద్దతు కోల్పోయినట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే టీడీపీకి దూరమైన ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ విప్ ప్రకారం ఓటింగ్‌కు హాజరై ఓటేసినప్పటికీ వారి ఓట్లు చెల్లకుండా పోయాయి. మరో ఎమ్మెల్యే కూడా చంద్రబాబు బీసీలను నిరాదరిస్తున్నారనే ఆవేదనతో నంబర్ వేయాల్సిన చోట టిక్ కొట్టటంతో ఆ ఓటు కూడా చెల్లకుండా పోయిందని భావిస్తున్నారు. కోవిడ్ సోకిన వారిని కలివడం వల్ల తాను స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నట్లు మరో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ చెప్పారు. అయితే పోలింగ్ జరిగే చోట ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉన్నా ఆయన అందుకు మొగ్గు చూపలేదని పేర్కొంటున్నారు.
రాజ్యసభలో ఆరుకు చేరిన వైఎస్సార్‌సీపీ బలం
వైఎస్సార్‌సీపీకి చెందిన నలుగురు అభ్యర్థులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వాని, పిల్లి సుభాష్‌చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావు ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో రాజ్యసభలో పార్టీ బలం ఆరుకు పెరగనుంది. 2024 నాటికి వైఎస్సార్ సీపీ బలం 11కు చేరుకుంటుందని, భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని పేర్కొంటున్నారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీల్లో ఆత్మస్థైర్యం
రాష్ట్రం నుంచి ఒకేసారి బీసీ సామాజిక వర్గాలకు చెందిన ఇద్దరు వ్యక్తులను రాజ్యసభకు పంపించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బీసీ వర్గాల్లో, ఎస్సీ, ఎస్టీల్లో ఆత్మస్థైర్యాన్ని కల్పించారని మంత్రి మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. రాజ్యసభ అభ్యర్థులు ఘనవిజయం సాధించిన అనంతరం శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో మోపిదేవితోపాటు పిల్లి సుభాష్‌చంద్రబోస్, అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానీతోపాటు ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. మోపిదేవి ఏమన్నారంటే..
► నన్ను రాజ్యసభకు పంపించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు.
► రాజ్యసభకు ఇంత త్వరగా ఎంపికవుతానని ఊహించలేదు.
► కేంద్రం నుంచి రావాల్సిన సహకారం కోసం పార్టీ పెద్దలతో కలిసి, సీఎం వైఎస్ జగన్ డైరెక్షన్‌లో ఎల్లవేళలా పనిచేస్తాం.
► మరో ఇద్దరు పారిశ్రామికవేత్తలను ఏపీ నుంచి రాజ్యసభకు ఎంపిక చేయడం రాష్ట్ర భవిష్యత్‌కు ఉపయోగకరంగా ఉంటుంది.
మీడియాతో మాట్లాడుతున్న బోస్, నత్వానీ, అయోధ్యరామిరెడ్డి, మోపిదేవి తదితరులు
కలలో కూడా ఊహించలేదు
► రాజ్యసభ సభ్యుడిగా ఎంపికవ్వడం సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన సువర్ణావకాశం.
► పార్లమెంట్‌లో అడుగుపెడతానని కలలో కూడా ఊహించలేదు.
► ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యేలకు హృదయపూర్వక ధన్యవాదాలు.
► కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, గ్రాంట్లు, ఇతర అంశాలపై శక్తివంచన లేకుండా పాటుపడతా.
► నా రాజకీయ గురువులు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన దివంగత రాయవరం మునసబు, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి జన్మజన్మలకి రుణపడి ఉంటా.
– పిల్లి సుభాష్‌చంద్రబోస్
సీఎం వైఎస్ జగన్ విజన్ ఉన్న నేత
► రాజ్యసభ అభ్యర్థిగా నన్ను ఎంపికచేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు.
► వైఎస్ జగన్ గొప్ప విజన్ ఉన్న నేత. ఆయన నాయకత్వంలో రాష్ట్రం కోసం, దేశం కోసం పనిచేస్తాం.
► ఈ రోజు నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం.
► ఈ ఎన్నిక మూడు నెలలు ఆలస్యమైనా సజావుగా జరిగింది.
► ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, వైఎస్సార్‌సీపీ నేతలకు, హితులకు, సన్నిహితులకు ధన్యవాదాలు. – ఆళ్ల అయోధ్య రామిరెడ్డి
సీఎం వైఎస్ జగన్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు
► రాజ్యసభ సభ్యుడిగా నన్ను పార్లమెంట్‌కు పంపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు.
► నాపై నమ్మకంతో నాకు ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు.
► రాష్ట్ర అభివృద్ధి కోసం పార్లమెంట్‌లో పోరాడుతా.
► రాష్ట్రానికి సంబంధించి అన్ని హక్కులను సాధించేందుకు వైఎస్సార్‌సీపీ ఎంపీలతో కలిసి కృషిచేస్తా.
– పరిమళ్ నత్వానీ
ఐక్యంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతాం
► రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ప్రస్థానం తొలుత ఒకటి నుంచి ఇప్పుడు ఆరు స్థానాలకు చేరింది.
► 2024 నాటికి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఇది 11 స్థానాలకు చేరుకుంటుంది.
► 30 ఎంపీ స్థానాలు ఉంటే ఏ ప్రాంతీయ పార్టీకైనా మంచి గుర్తింపు ఉంటుంది.
► అందరం కలిసి ఐక్యమత్యంగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతాం.
– వి. విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యులు
మోపిదేవి వెంకటరమణారావు
మోపిదేవి వెంకటరమణారావు 1964 ఆగస్టు 6వతేదీన రాఘవయ్య, నాగులమ్మ దంపతులకు జన్మించారు. 2004లో కూచిపూడి ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో మంత్రి పదవి చేపట్టారు. 2009లో రేపల్లె ఎమ్మెల్యేగా విజయం సాధించి వైఎస్సార్, కొణిజేటి రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి క్యాబినెట్‌లో పలు శాఖలు నిర్వహించారు. 2019 ఆగస్టులో ఎమ్మెల్సీగా ఎన్నికై సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాబినెట్‌లో మంత్రి పదవి చేపట్టారు.
ఆళ్ల అయోధ్య రామిరెడ్డి
ఆళ్ల అయోధ్య రామిరెడ్డి గుంటూరు జిల్లా పెదకాకానిలో 1964 ఆగస్టు 12న దశరథరామిరెడ్డి, వీర రాఘవమ్మ దంపతులకు జన్మించారు. ఉస్మానియా వర్సిటీలో ఎంఈ (సివిల్) చదివారు. 1988లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ప్రవేశించి 1994లో రాంకీ గ్రూప్స్ ఏర్పాటు చేశారు. ఏడు కంపెనీలకు చైర్మన్‌గా విదేశాల్లో సైతం వ్యాపారం విస్తరించారు. వ్యర్థాల నిర్వహణలో ఆసియా ఖండంలోనే ప్రధాన కంపెనీల్లో ఒకటిగా రాంకీ గుర్తింపు పొందింది. రాంకీ ఫౌండేషన్ ద్వారా దేశవ్యాప్తంగా విద్య, మహిళా సాధికారత, సహజ వనరుల సంరక్షణ, నైపుణ్య శిక్షణ లాంటి కార్యక్రమాలను చేపట్టారు.
పిల్లి సుభాష్‌చంద్రబోస్
పిల్లి సుభాష్‌చంద్రబోస్ 1950 ఆగస్టు 8న సూర్యనారాయణ, ముత్యాలమ్మ దంపతులకు జన్మించారు. బీఎస్సీ చదివారు. 1978లో జడ్పీ కోఆప్షన్ మెంబర్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1983లో హసన్‌బాద సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. రామచంద్రపురం నుంచి 1985లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీగా ఎన్నికై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా, రెవెన్యూ మంత్రిగా కొనసాగుతున్నారు.
పరిమళ్ ధీరజ్‌లాల్ నత్వానీ
1956 ఫిబ్రవరి 1న జన్మించిన పరిమళ్ ధీరజ్‌లాల్ నత్వానీ జార్ఖండ్ నుంచి రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం ఏప్రిల్‌తో ముగియడంతో ఈసారి ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించనున్నారు. 20 రాష్ట్రాల్లో రిలయన్స్ జియో 4జీ సేవలను విస్తరించడంలో నత్వానీ కీలకపాత్ర పోషించారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించి ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి అత్యంత సన్నిహితుడైన నత్వానీని పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేశారు. ముఖేష్ అంబానీ ఈ ఏడాది ఫిబ్రవరి 29న స్వయంగా తాడేపల్లి వచ్చి ముఖ్యమంత్రి జగన్‌ను కలసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నత్వానీకి అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.
సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన ‘రాజ్యసభ’ విజేతలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణారావు, పరిమళ్ నత్వానీలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీలో ఫలితాలు ప్రకటించిన అనంతరం శుక్రవారం వారు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుని సీఎంను కలిశారు. వారి వెంట వైఎస్సార్‌సీపీ నేత వి. విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment