సాక్షి, అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబ నాయుడుపై విమర్శల వర్షం కురిపించారు. సభా సంప్రదాయాల గురించి చంద్రబాబు మాట్లాడుతుంటే జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆమె మాట్లాడారు. గతంలో డిప్యూటీ స్పీకర్ కుతూహలమ్మను కన్నీళ్లు పెట్టించింది టీడీపీ నేతలు కాదా అని ప్రశ్నించారు. పార్టీ పెట్టి గెలిపించిన ఎన్టీఆర్‌కే సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కన్నీళ్లు పెట్టించిన చంద్రబాబు సంప్రదాయాలు గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
‘గత సభలో మీరెలా ప్రవర్తించారో మర్చిపోయారా. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అంతు చూస్తామని నాడు చంద్రబాబు బెదిరించారు. అచ్చెన్నాయుడు ఈరోజు గింజుకుంటున్నారు. గతంలో సాక్షాత్తు అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డిని కించపరిచే విధంగా మాట్లాడినప్పుడు సభా సంప్రదాయాలు గుర్తుకురాలేదా. మా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై చర్చను దారిమళ్లించేందుకే టీడీపీ ఎమ్మెల్యేలు ఇలా ప్రవర్తిస్తున్నారు. అమ్మ ఒడి, రైతు భరోసా లాంటి పథకాలపై చర్చ జరగకుండా రాద్ధాంతం చేయాలనుకుంటున్నారు. ఈ దేశంలో ఏ అసెంబ్లీలో లేనివిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్షానికి ఉన్న బలం కంటే ఎక్కువ అవకాశాలిస్తున్నారు.
సభలో బడ్జెట్‌పై మాట్లాడే దమ్మూ, ధైర్యం లేకే చర్చ జరగకుండా అడ్డుకుంటున్నారు. రైతుల సమస్యలంటూ టీడీపీ నాయకులు వింతగా మాట్లాడుతున్నారు. రైతుల సమస్యలకు ఐదేళ్లు పాలించిన టీడీపీ కారణం కాదా. రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ వాళ్లపై దాడులు చేస్తున్నారు. మళ్లీ వాళ్లే అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇవ్వడం విడ్డూరం. ఎమ్మార్వో వనజాక్షిని టీడీపీ నేత చింతమనేని కొట్టినప్పుడు ఏం చేశారు. నారాయణ కాలేజీల్లో ఆడపిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటే విచారణ లేకుండా చేసిన మీరా మాట్లాడేది. కాల్‌మని సెక్స్ రాకెట్‌లో ఆడవాళ్ళ జీవితాలను నాశనం చేస్తే టీడీపీ నేతలకు సంబంధముందని కేసులనే లేకుండా చేసింది మీరు కాదా. శాంతి భద్రతల గురించి మీరు మాట్లాడుతుంటే జనం నవ్వుకుంటున్నారు’అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment