సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కొనే దమ్ము లేక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈసీని అడ్డం పెట్టుకుని కుట్ర చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను గురువారం మంగళగిరి పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల బృందం కలిసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ పేరుతో సర్క్యూలేట్ అయిన లేఖపై ఈ సందర్భంగా వారు డీజీపీ ఫిర్యాదు చేశారు. డీజీపీని కలిసిన వారిలో ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, జోగి రమేష్, కైలే అనిల్ కుమార్, పార్థసారథి, మల్లాది విష్ణులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్రలో భాగంగా ఈ లేఖను సర్క్యూలేట్ చేసినట్టుగా నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ లేఖ ఎక్కడి నుంచి బయటకు వచ్చిందో దర్యాప్తు చేయాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల బృందం డీజీపీని కోరింది. రమేష్‌కుమార్ పేరిట ప్రచారంలోకి వచ్చిన లేఖతోపాటు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక సమాచారాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు డీజీపీకి అందజేశారు.
ఈ సమావేశం అనంతరం అంబటి రాంబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై ఒక మనిషి అడ్డమైన రాతలు రాస్తే.. ధ్రువీకరణ లేకపోయినా దానిని పత్రికలు ప్రచురించడం దారుణమని అన్నారు. రాజ్యంగ వ్యసవ్థలో ఉన్న వ్యక్తి ఇలా వ్యవహరించడం సరైనాదేనా అని ప్రశ్నించారు. ఆ లేఖ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ రాస్తే ధైర్యంగా ఒప్పుకోవాలన్నారు. రమేష్‌కుమార్ మౌనంతో ఆ లేఖపై తమ అనుమానాలు బలపడుతున్నాయని తెలిపారు. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మౌనం వీడాలని డిమాండ్ చేశారు. ఆ లేఖకు సంబంధించి వాస్తవాలు బయటికొచ్చే వరకు పోరాడతామన్నారు. అధికారులపై దౌర్జన్యం చేసే అలవాటు తమకు లేదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment