రుణం కోసం రణమే..!
గిట్టుబాటు ధర గగనమే..
కరెంటు కోసం కాసుకు కూర్చోవడమే..
ఆత్మహత్యల్లోనూ ఘనమే..!
– రాష్ట్రంలో అన్నదాతల దీన స్థితికి అద్దం పట్టే గీతమిది!!
గిట్టుబాటు ధర కోసం అన్నదాత ఎక్కని మెట్టు లేదు.. పంట రుణం కోసం పుస్తెలు చేతబట్టుకుని బ్యాంకుల్లో పడిగాపులు.. కరెంటు కోసం చిమ్మచీకట్లో కాసుకుకూర్చోక తప్పని రోజు లేదు.. సాగు సంక్షోభంతో రైతులు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి.. సగానికిపైగా మండలాల్లో కరువు విలయతాండవం.. ఎటు చూసినా నెర్రెలిచ్చిన నేలలు.. కూలీలుగా మారుతున్న రైతులు.. కబేళాలకు
తరలుతున్న పశువులు..అన్నదాతల దైన్యం చూస్తే... కళ్లు చెమర్చకమానవు. దుఃఖం పొంగివస్తుంది.
ఇలాంటి పరిస్థితుల్లో జననేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. తన సుదీర్ఘ పాదయాత్రలో రైతుల కష్టాలు, కడగండ్లు.. అప్పులకుప్పగా మారి బలవన్మరణాలకు పాల్పడుతున్న అన్నదాతల దుఃఖం స్వయంగా చూసి.. రైతన్న రాజ్యం–రాజన్న రాజ్యం తెచ్చేందుకే.. రైతు భరోసా పథకాన్ని ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబానికి ఖరీఫ్‌కు ముందే మే నెలలోనే ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేలను పెట్టుబడి సాయం అందిస్తానని జగన్ హామీ ఇవ్వడంపై రైతాంగంలో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
– సాక్షి, అమరావతి
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ఇనుకుర్తిలో నిమ్మరైతులతో మాట్లాడుతున్న వైఎస్ జగన్ (ఫైల్)
ఇదీ వైఎస్సార్ రైతు భరోసా
ఏటా రూ. 12,500 సాయం
రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాల్లో భాగంగా ‘వైఎస్సార్ రైతు భరోసా’ పథకాన్ని ప్రకటించారు. ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.12,500 లబ్ధి చేకూరుతుంది. అన్నదాతకు ఆసరాగా నిలిచే ఈ పథకాన్ని ప్రకటించడంపై అన్నదాతల్లో సర్వత్రా సంతోషం వ్యక్తమవుతోంది.
రాష్ట్రంలో ప్రస్తుతం
85 లక్షల రైతు కుటుంబాలున్నాయి. ఒక్కో కుటుంబానికి ఏటా రూ.12,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని అందజేస్తారు. అంటే.. రాష్ట్రంలోని 85 లక్షల సన్నచిన్నకారు రైతు కుటుంబాలన్నింటికీ రైతు భరోసా ద్వారా ఎంతో ఉపశమనం లభిస్తుంది. ఫలితంగా ఏ రైతూ పెట్టుబడి లేదని బాధపడడమో, బలవన్మరణాలకు పాల్పడాల్సిన పరిస్థితులు తలెత్తడమో ఉండదు.
బాధిత రైతు కుటుంబానికి 5లక్షల బీమా
అన్నదాతలు దురదృష్టవశాత్తు బలవన్మరణానికి పాల్పడినా, ప్రమాదవశాత్తు మరణించినా.. ఆ రైతు కుటుంబానికి వైఎస్సార్ బీమా ద్వారా రూ.5 లక్షలు ఇస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రకటించారు. ఈ డబ్బును అప్పుల వాళ్లు తీసుకోకుండా.. బాధిత రైతు కుటుంబానికే చెందేలా అసెంబ్లీలో చట్టాన్ని తీసుకువచ్చి ఆ రైతు కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. చంద్రబాబు అధికారాన్ని చేపట్టిన 2014లో 164 మంది, 2015లో 516 మంది చనిపోయినట్టు ఎన్‌సీఆర్‌బీ అధికారికంగా ప్రకటించింది. ఇలా గత ఐదేళ్లలో 2,400 మంది రైతులు చనిపోయారన్నది అనధికారిక అంచనా.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో పదేపదే డిమాండ్ చేయడంతో.. రైతు ఆత్మహత్యలపై పరిహారాన్ని రూ.5 లక్షలకు పెంచుతున్నట్టు ప్రకటించి రకరకాల ఆంక్షలు పెట్టారు. చంద్రన్న రైతు బీమా కిందకు తెచ్చారు. 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్కులైన రైతులకు ఒక రేటు, ఆపై వయసున్న వారికి మరో రేటు.. ఇలా వివిధ రకాలుగా పెట్టి గరిష్టంగా రూ.5 లక్షలని చెబుతూ వచ్చారు. ఇలా చెప్పి మూడేళ్లు గడిచినా పట్టుమని 200 మందికి కూడా సాయం అందలేదు.
రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ
పంటకు గిట్టు బాటు ధర లభించక నష్టపోతున్న రైతులకు మేలు చేసేలా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.2 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధిని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రకృతి వైపరీత్యాల నిధి విషయంలో.. రాష్ట్ర ప్రభుత్వం రూ.2 వేల కోట్లను కేటాయిస్తే కేంద్రం మరో రూ.2వేల కోట్లను ఇవ్వాల్సి ఉంటుంది. అంటే.. రూ.4వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధి ఏర్పాటవుతుంది. రాష్ట్రంలో కరవులు, వరదలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఈ నిధి ఎంతగానో ఉపయోగపడుతుంది.
దరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడంతోపాటు పంట వేయడానికి ముందే రైతులకు గిట్టుబాటు ధరనూ ప్రకటిస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఇలా చేయడం వల్ల రైతులపై భారం తగ్గుతుంది. ప్రతి రైతు తన ఉత్పత్తులను ప్రభుత్వం ప్రకటించిన ధర కన్నా తక్కువకు అమ్ముకునే పరిస్థితి ఉండదు. ఒకవేళ ప్రభుత్వం ప్రకటించిన ధర కన్నా తక్కువకే అమ్ముకోవాల్సి వస్తే.. ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. అందుకు ఈ ధరల స్థిరీకరణ నిధి ఉపయోగపడుతుందని ఘంటాపథంగా చెప్పవచ్చు.
9 గంటల ఉచిత విద్యుత్ పగటిపూటే
వైఎస్ జగన్ వ్యవసాయానికి పగటి పూట నిరంతరాయంగా హెచ్చుతగ్గులు లేని నాణ్యమైన కరెంటును 9 గంటల పాటు ఉచితంగా సరఫరా చేస్తానని భరోసా ఇచ్చారు. జగన్ హామీతో రాష్ట్రంలో ప్రస్తుతమున్న 16 లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్ లభిస్తుంది. 17 లక్షల మంది రైతులకు మేలు జరుగుతుంది. లక్షలాది ఎకరాలకు నీళ్లు అందుతాయి. దీంతోపాటు ఆక్వా రైతులకు యూనిట్‌కు రూపాయిన్నరకే కరెంటు అందిస్తారు.
ఉచిత బోరుతో బావురమనే పరిస్థితే ఉండదు ..
ఒకప్పుడు వంద, రెండొందల అడుగులు తవ్వితే నీళ్లు వచ్చేవి. ప్రస్తుతం 7, 8 వందల అడుగులు దాటిపోయినా నీరు కనిపించడం లేదు. రాయలసీమలోనైతే ప్రత్యేకించి అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో 12 వందలు, 14 వందల అడుగుల్లో బోరు వేసినా నీరు పడక, పదేపదే బోర్లు వేసి చేతులు కాల్చుకుంటున్నారు. బోర్లు వేసేందుకు చేసిన అప్పులు తీరక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ దుస్థితి నుంచి రైతుల్ని కాపాడేందుకు ఉచితంగా బోర్లు వేయిస్తామని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో వ్యవసాయం దాదాపు 45శాతం భూగర్భ జలాల ఆధారంగా సాగవుతోంది. రోజురోజుకూ భూగర్భ జలాలు తరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితిలో మోట, దిగుడు బావులు ఎండిపోతున్నాయి. గొట్టపు బావుల సంఖ్య పెరుగుతోంది. కోస్తాలో 64 మండలాలు, రాయలసీమలో 169 మండలాల్లో అత్యధికంగా భూగర్భ జలాలను వినియోగిస్తున్నారు. పాత లెక్క ప్రకారం ఒక్కో బోరు వేయడానికి రూ.18500 ఖర్చు అవుతుందని గత ప్రభుత్వాలు నిర్ణయించినా.. వాస్తవానికి లక్ష నుంచి లక్షన్నర రూపాయల వరకు వ్యయం చేయాల్సివస్తోంది. ఇంత మొత్తం ఖర్చు పెట్టి వేసినా.. ఆ బోరు బావిలో నీరు పడకపోతే రైతులు అల్లాడిపోవాల్సిందే. ఇలా ఒకటికి రెండు మూడుసార్లు బోర్లు వేసి నష్టపోయి అప్పులు పెరిగి ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇటువంటి దుస్థితి నుంచి రైతుల్ని కాపాడేందుకు వైఎస్ జగన్ ప్రకటించిన ఉచిత బోర్ల పథకం ఉపయోగపడుతుంది.
పంటల బీమా ప్రీమియం చెల్లింపునకు జగన్ పూచీ
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రధాన మంత్రి ఫసల్ బీమా, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాలకు రైతుల తరఫున ఉచితంగా ప్రీమియం చెల్లిస్తామని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ హామీ రాష్ట్రంలోని దాదాపు 85 లక్షల మంది రైతులకు ఎంతగానో ఉపకరిస్తుంది. అతివృష్టి, అనావృష్టితో పంటలు దెబ్బతిని రైతులు నష్టపోకుండా చూస్తానని భరోసా ఇవ్వడాన్ని రైతులు హర్షిస్తున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం–ప్రధాన మంత్రి పంటల బీమా కింద ఖరీఫ్‌లో 2 శాతం, రబీలో 1.5 శాతం ప్రీమియంను రైతులు చెల్లించాలి.
అదే ఉద్యాన పంటల రైతులైతే 5 శాతం చెల్లించాలి. మిగతా మొత్తాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం చెల్లిస్తాయి. రైతుల వాటా మొత్తాన్ని కూడా చెల్లిస్తానని జగన్ హామీ ఇచ్చారు. వాస్తవానికి రాష్ట్రంలో సుమారు 85 లక్షల మంది వరకు రైతులు ఉన్నా.. కనీసం నాలుగోవంతు మంది కూడా పంటల బీమాను చెల్లించడం లేదు. బీమా బాధ్యతను తానే తీసుకుంటాననిజగన్ ప్రకటించడం రైతులకు మేలు చేస్తుంది. ఏదయినా విపత్తు సంభవించినప్పుడు రైతులకు బీమా కంపెనీల నుంచి క్లెయిమ్ వచ్చేలా చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment