
సాక్షి, గన్నవరం (కృష్ణా): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర పత్రిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితోనే బీసీలకు న్యాయం జరుగుతుందని ఆ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పార్టీ ప్రవేశపెట్టబోయే పథకాలతోనే బీసీలకు గౌరవం, న్యాయం జరుగుతుందన్నారు. శనివారం గన్నవరంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బీసీలను మభ్యపెట్టడానికే ఆదరణ పథకం పెట్టారని విమర్శించారు. జన్మభూమి కమిటీలతో ఆదరణ పథకం అవినీతిమయమైందన్నారు. ఆదరణ పథకంలో నాణ్యత లోపమున్నట్లు, ఆరు శాతం అవినీతి జరిగినట్లు స్వయంగా చంద్రబాబు ఒప్పుకున్నారని గుర్తుచేశారు. ఆదరణ పథకం బూటకమని, అవినీతిమయమని ఆరోపించారు. బీసీలపై చిత్తశుద్ధి ఉంటే 2014లో ఇచ్చిన హామీలు ‘బీసీ డిక్లరేషన్’, ‘ప్రతి సంవత్సరం పది వేల కోట్ల నిధులతో బీసీ సబ్ ప్లాన్’, నామినేటెడ్ పోస్టులు ఎన్ని ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.