
సాక్షి, విజయవాడ: చంద్రబాబు పాలనలో బీసీలకు సంక్షేమ పథకాలు అందడం లేదని వైఎస్సార్ సీపీ బీసీ అధ్యయన కమిటీ చైర్మన్ జంగా కృష్ణమూర్తి అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ అధ్యయన కమిటీ సభ్యుల మొదటి సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ... బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని, గ్రామాల్లో బీసీలను బానిసలుగా మార్చేసారని విమర్శించారు. బీసీలకు టీడీపీ అన్నిరకాలుగా అన్యాయం చేసిందని ఆరోపించారు.
రాష్ట్రవ్యాప్తంగా బీసీల స్థితిగతులను అధ్యయనం చేస్తామని చెప్పారు. గ్రామ స్థాయిలో బీసీల సమస్యలపై దృష్టి సారిస్తామన్నారు. బీసీలకు న్యాయం చెయ్యాలన్న వైఎస్ జగన్ ఆదేశాలతో అధ్యయన కమిటీ రాష్ట్ర పర్యటనకు వెళుతోందని వెల్లడించారు. అధ్యయనం అనంతరం అధినేత జగన్‌కు నివేదిక అందజేయనున్నట్టు చెప్పారు. నివేదిక ఆధారంగా బీసీ గర్జనలో వైఎస్ జగన్ డిక్లరేషన్ ప్రకటిస్తారని తెలిపారు.