సాక్షి, అనంతపురం : చంద్రబాబు చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని తన తండ్రి హెచ్చరించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం ఎంపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ అన్నారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.... తన నామినేషన్ విషయంలో ఈరోజు కోర్టు ఇచ్చిన తీర్పు చంద్రబాబు ప్రభుత్వానికి గొడ్డలి పెట్టు అని వాఖ్యానించారు. ‘ రాజకీయాల్లోకి వచ్చే ముందు జాగ్రత్తగా ఉండాలని మా నాన్న చెప్పారు. చంద్రబాబు వంటి ప్రమాదకరమైన వ్యక్తులను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అన్నట్లుగానే నా అభ్యర్థిత్వాన్ని నాశనం చేయాలని చంద్రబాబు కుట్ర పన్నారు. నాపై గతంలో కొట్టి వేసిన కేసులను సాకుగా చూపి తప్పుడు ఆరోపణలు చేశారు. నాపై కేసులు ఉన్నాయంటూ కోర్టును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.(చదవండి :గోరంట్ల మాధవ్‌కు లైన్‌క్లియర్)
ఈసీకి ఫిర్యాదు చేస్తా..
తనను నామినేషన్ అడ్డుకునేందుకు కుట్ర పన్నిన వారిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని మాధవ్ పేర్కొన్నారు. నిమ్మల కిష్టప్ప దమ్ముంటే గెలుపోటములలో తలపడాలని సవాల్ విసిరారు. బీసీలకు పెద్దపీట వేసే వైఎస్సార్ సీపీ నాయకుడిగా బీసీలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలపై చంద్రబాబు ఒలకబోస్తున్న కపట ప్రేమను అందరికీ తెలియజేస్తానని వ్యాఖ్యానించారు. కాగా రాజకీయాల్లో చేరే క్రమంలో 2018, డిసెంబరు 30న గోరంట్ల మాధవ్ సీఐ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో రెండు నెలల క్రితమే వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఏపీ ప్రభుత్వం ఆయన అభ్యర్థనను ఆమోదించకుండా పక్కనబెట్టింది. దీంతో ఆయనకు నామినేషన్ విషయంలో అడ్డంకులు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తక్షణమే మాధవ్ వీఆర్‌ఎస్‌ను ఆమోదించాలని ట్రిబ్యునల్.. ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిడంతో నామినేషన్‌కు మార్గం సుగమమైంది.
Comments
Please login to add a commentAdd a comment