
సాక్షి, హైదరాబాద్ : ఈవీఎంల ద్వారా గెలిచిన చంద్రబాబు ఇప్పుడు వాటిని విమర్శించడం తగదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా గత ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ టాంపరింగ్ చేసి గెలిచాయి కాబట్టే ఇప్పుడు ఆ పార్టీ నేతలు భయపడుతున్నారని దుయ్యబట్టారు. పోలీసు వ్యవస్థను బాబు భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయన సామాజిక వర్గ పోలీసులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. నిబద్దత గల పోలీసులకు అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఏనాడు పోలీసులను టార్గెట్ చేయలేదని పేర్కొన్నారు.
ఏలూరులో బీసీ డిక్లరేషన్...
బుధవారం చిత్తూరు జిల్లాలో వైఎస్ జగన్ సమర శంఖారావం సదస్సు ప్రారంభిస్తారని బొత్స తెలిపారు. వైఎస్ జగన్ ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సులో భాగంగా పార్టీ బూత్ కమిటీ నాయకులతో ఆయన భేటీ అవుతారని బొత్స పేర్కొన్నారు. ఈ సదస్సులో ఓటర్ల తొలగింపు, డబ్బు, మద్యం పంపిణీ వంటి టీడీపీ అకృత్యాలు ఎండగడతామని తెలిపారు. సమర శంఖారావానికి జిల్లాకు 40 వేల మంది హాజరవుతారన్నారు. బీసీ సంక్షేమానికై ఏలూరులో వైఎస్ జగన్ బీసీ డిక్లరేషన్ విడుదల చేయనున్నారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment