
సాక్షి, విజయనగరం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యం అవుతుందనే ఉద్ధేశ్యంతో ప్రజలు ఆయనకు అవకాశం ఇచ్చారని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మాటని ప్రజలు విశ్వసించారని అన్నారు. గత ఐదేళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని వెనుకబడిన రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని బాబు దుర్వినియోగం చేశారన్నారు. పాదయాత్రలో వైఎస్ జగన్‌కు లభించిన ఆదరణ ఓటు ద్వారా ఇలా చూపించారని తెలిపారు. ఊహించని విజయాన్ని చూడబోతున్నామని వైఎస్ జగన్ గత కొద్ది రోజులుగా చెపుతూ వచ్చారన్నారు. వైఎస్ జగన్ ఈ అవకాశాన్ని ప్రజల కోసమే వినియోగిస్తారని, ఆయన వెంట తామంతా అభివృద్ధికోసం పాటుపడతామని చెప్పారు. ఈ విజయం ప్రజా విజయమని, ప్రజలకు రుణపడి ఉంటామని పేర్కొన్నారు. చంద్రబాబుకు చెప్పింది చేసే అలవాటులేదని మండిపడ్డారు.