సాక్షి, హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సీ.రామచంద్రయ్య విమర్శల వర్షం కురిపించారు. వైఎస్సార్‌సీపీలోకి వస్తున్న వలసలను చూసి బాబు భయపడుతున్నారని అన్నారు. జగన్ ఎవరైనా కలిస్తే ఉలిక్కి పడుతున్నారని, బాబుకు ఎందుకింత అభద్రతాభావం అని ఎద్దేవా చేశారు. రాజీనామాలు చేశాకే ఇతర పార్టీల నాయకులను వైఎస్ జగన్ పార్టీలో చేర్చుకుంటున్నారని తెలిపారు. ఏపీ, తెలంగాణ మధ్య విభేదాలు సృష్టించి ఓట్లు దుండుకునే వ్యూహం పన్నుతున్నారని మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
నేరస్తులకు కొమ్ముకాస్తూ చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రామచంద్రయ్య ప్రశ్నించారు. ‘ప్రజస్వామ్యంలో నీ అంత హీనమైన చరిత్ర ఇంకొకరిది లేదు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి దళితులపట్ల వెటకారంగా మాట్లాడి పైశాచిక ఆనందం పొందుతున్నారు. దళితులను దూషించిన ఎమ్మెల్యేపై, రైతు కోటయ్య మృతి వంటి వాటిపై మీ చానెళ్లలో చర్చ పెట్టరు. చంద్రబాబు చక్రం తిప్పడం కాదు. తానే తిరుగుతున్నాడు’ అని ఎద్దేవా చేశారు. టీడీపీ విలువలు, విశ్వసనీయత లేని పార్టీ అని అన్నారు. పుల్వామా ఉగ్రదాడికి నైతిక బాధ్యత వహించి ప్రధాని మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న బాబు.. రాజమండ్రి పుష్కరాల్లో 30 మంది చనిపోతే బాధ్యత వహించారా అని సూటిగా ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment