సాక్షి, కాకినాడ: పేదల జీవితంలో చిచ్చురేపుతున్న మద్యం మహమ్మారిపై అస్త్రం సంధించారు వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి. అధికారంలోకి రాగానే మూడు దశల్లో మద్య నిషేధాన్ని అమలు చేస్తామన్న హామీపై మహిళా లోకం హర్షం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం మద్యాన్నే ప్రధాన ఆదాయ వనరుగా చేసుకొని పాలన సాగిస్తున్న నేపథ్యంలో.. ఆదాయం కంటే ప్రజల సంక్షేమమే ముఖ్యమని భావించిన జగన్ తీసుకున్న సంచలన నిర్ణయానికి మహిళాలోకం నీరాజనాలు పలుకుతోంది.
బోట్‌క్లబ్: మద్యం మత్తుకు కుటుంబాలు చిత్తవుతున్నాయి. కష్టాన్ని నమ్ముకొని జీవించే పేద, మధ్యతరగతి మగవారు చిన్నా, పెద్ద తేడా లేకుండా మద్యానికి బానిసలవుతున్నారు. ఐదు సంవత్సరాలుగా మద్యం నగరంలో ఏరులై పారుతోంది. ఇక్కడ మత్స్యకార ప్రాంతాల్లో మద్యాన్ని సేవించని మగవారు లేరంటే అతిశయోక్తికాదు. దీంతో కుటుంబ పోషణ మహిళలకు పెనుభారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి దశలవారీగా మద్య నిషేధాన్ని ప్రకటించడంతో వారిలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే తమ జీవితాలు బాగుపడతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు.
మత్స్యకారుల చుట్టూ లిక్కర్ మాఫియా
కాకినాడ సిటీ నియోజకవర్గంలో ఏటిమొగ ప్రాంతాల్లో సుమారు 8 వేల మంది మత్స్యకార కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. జీవితాన్ని పణంగా పెట్టి సముద్రంలోకి వెళ్లి , చేపలు వేట ద్వారా సంపాదిస్తుండగా, వారి కష్టాన్ని కొందరు స్వార్థపరులు లిక్కర్ మాఫియా ద్వారా దోచుకొంటున్నారు. మత్స్యకార ప్రాంతాల్లో నిత్యం అనధికారంగా బెల్ట్‌షాపులు ద్వారా వేళాపాళా లేకుండా మద్యం విక్రయిస్తున్నారు.
ప్రతి నెలా టీడీపీ నాయకులు మద్యం మాఫియా వద్ద డబ్బులు తీసుకొని వారికి అనధికారంగా గేట్లు ఎత్తివేయడంతో మాఫియా ఆగడాలకు అడ్డు అదుపూ లేకుండా పోయింది. ఈ ప్రాంతంలో ప్రతి వీధిలోని ఒక బెల్ట్‌షాపు నడుస్తోందంటే ఇక్కడ మద్యం ఎంతమేర విక్రయాలు జరుగుతున్నాయో వేరే చెప్పనవరం లేదు. మద్యం షాపుల్లో కంటే బెల్ట్‌షాపుల ద్వారా విక్రయాలు అధికంగా జరుగుతుండడంతో మద్యం మాఫియా బెల్ట్‌షాపులపైనే దృష్టి సారించి విక్రయాలు చేస్తోంది.
బెల్ట్ షాపులో విక్రయించే ప్రతి బాటిల్‌కు రూ.10 అధికంగా వసూలు చేస్తున్నారు. మద్యం అలవాటైన వారు దూరప్రాంతాలకు వెళ్లడం కంటే స్థానికంగా మందు లభించడంతో అధిక రేట్లకు ఇక్కడే కొనుగోలు చేస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకొని మద్యం వ్యాపారులు వారి జేబులు గుల్ల చేస్తున్నారు.
సంచలన నిర్ణయం
మద్య నిషేధం సంచలన నిర్ణయం. పేద , మధ్యతరగతి మహిళల కష్టం చూసి జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నాం. సంక్షేమం కోసం తపించే వైఎస్సార్ వారసుడిగా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలి.
– ఎం.సుధామాధురి, కాకినాడ
ఆ మంచిరోజు కోసం ఎదురుచూస్తున్నాం
మద్య నిషేధంతో చాలా కుటుంబాలకు మంచిరోజులు వస్తాయి. మద్యానికి బానిసై మగవారు ఇంటిలోని భార్య, పిల్లలను పట్టించుకోని సంఘటనలు చాలా చూస్తున్నాం. మద్య నిషేధం అమలైతే ఆయా కుటుంబాలకు మంచిరోజులు వస్తాయి.
– అయినవిల్లి బాలాత్రిపుర సుందరి
Comments
Please login to add a commentAdd a comment