
సాక్షి, విజయనగరం : టీడీపీ ఉత్తరాంధ్ర బీసీ సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైఎస్సార్ సీపీ నాయకులు మజ్జి శ్రీనివాసరావు. గురువారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర బీసీ సమావేశంలో అశోక్ గజపతి రాజు మాట్లాడిన భాష చాలా అభ్యంతరకరంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యాతాయుతమైన పదవిలో ఉన్న అశోక్ గజపతి రాజు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. తమ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు.
అభియోగాలు రుజువు కాకుండా ప్రతిపక్ష నాయకున్ని దొంగగాడు అనడం సరికాదన్నారు. ఇన్నాళ్లు కేంద్ర మంత్రిగా పని చేసిన అశోక్ గజపతి రాజు ఉత్తరాంధ్రకు ఏం చేశారో చెప్పగలరా అంటూ శ్రీనివాస రావు ప్రశ్నించారు. బొబ్బిలిలో అధికంగా ఉన్న బీసీలకు కనీసం నామినేట్ పోస్టు కూడా ఇవ్వలేదని విమర్శించారు. గతంలో వైఎస్సార్ సీపీ ప్రకటించిన నవరత్నాలు సాధ్యం కాదని చెప్పిన చంద్రబాబు.. నేడు వాటిల్లోని కొన్ని పథకాలను దొంగిలించారని ఆరోపించారు.