
వైఎస్సార్‌సీపీ నేత మళ్ల విజయప్రసాద్
విశాఖపట్నం: వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నంపై వైఎస్సార్‌సీపీ విశాఖపట్నం నగర అధ్యక్షుడు మళ్ల విజయ ప్రసాద్ పలు అనుమానాలు లేవనెత్తారు. విశాఖపట్నంలో విజయ ప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ.. నిందితుడు శ్రీనివాస్ వీఐపీ లాంజ్‌లోకి ఎలా వచ్చాడని ప్రశ్నించారు. ఎవరి సహాయంతో టీతో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు రెస్టారెంట్‌లో ఎలా చేరాడు.. శ్రీనివాస్‌కు ఎన్‌ఓసీ ఎక్కడ, ఎవరు ఇచ్చారు. ఈ విషయాలను ఎందుకు బయటపెట్టడం లేదని సూటిగా పోలీసులను అడిగారు. శ్రీనివాస్ వాటర్ బాటిల్‌ను అడ్డం పెట్టుకుని, పదునైన కత్తి వాడిన విషయాన్ని పోలీసులు ఎందుకు కనిపెట్టలేకపోయారని సందేహం లేవనెత్తారు.
వైఎస్ జగన్ హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాస్ సీఐఎస్‌ఎఫ్ అధీనంలో సాయంత్రం ఐదున్నర వరకు ఉంటే డీజీపీ, నిందితుడిని విచారించకుండా ఎలా మాట్లాడారని అనుమానం వ్యక్తం చేశారు. దాడి జరిగినపుడు నిందితుడి జేబులో మాకు లెటర్ ఎక్కడా కనిపించలేదని, హత్యాయత్నం జరిగిన సమయంలో తానూ అక్కడే ఉన్నానని విజయ ప్రసాద్ తెలిపారు. ఈ ఘటనను రాజకీయంగా వాడుకోవాలని, అప్పటికప్పుడే సీఎం కార్యాలయం నుంచి ఫోటోలు రావడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఎయిర్‌పోర్టు కేంద్రం అధీనంలో ఉందని చెబుతున్న ప్రభుత్వం, స్టేట్‌మెంట్లు ఇచ్చి ఉలిక్కి పడుతోందన్నారు. వైఎస్ జగన్ నిబద్ధత గలనాయకుడు.. అందుకే సహనంతో ఉన్నామని పేర్కొన్నారు.
రెండు రోజులు విచారణ చేసినా లాభం లేదట..పనికి మాలిన వాళ్లని పిలిచి విచారిస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసుకు సంబంధంలేని వైఎస్సార్‌సీపీ కార్యాలయం అసిస్టెంట్ మేనేజర్‌ను పిలిచి అర్ధరాత్రి రెండు గంటల వరకు విచారించారని మండిపడ్డారు. ఘటన అంతా వైఎస్సార్‌సీపీ మీద వేయడానికి చేస్తున్న కుట్ర ఇది అని పేర్కొన్నారు. పంచనామాలో సీఐఎస్‌ఎఫ్ కత్తి గురించి ప్రస్తావించారా..సీఐఎస్‌ఎఫ్ పంచనామా బహిర్గత పరచాలని డిమాండ్ చేశారు. సినీ నటుడు శివాజీకి సమాచారం ఎవరిస్తున్నారు..అదంతా చంద్రబాబు స్క్రిప్ట్ అని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వ భాగస్వామ్యం లేకుండా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయిస్తే నిజాలు బయటకువస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment