అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై దాడి కేసును తక్షణమే జ్యుడీషియల్ విచారణకు అంగీకరించాలని వైఎస్సార్‌సీపీ నేత మోపిదేవి వెంకట రమణ డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మోపిదేవి విలేకరులతో మాట్లాడుతూ..హత్యాయత్నం వెనక నారా చంద్రబాబు హస్తం లేదని భావిస్తేనే ఆయన జ్యుడిషియల్ విచారణకు లేదా సీబీఐ విచారణకు ఆదేశిస్తారని పరోక్షంగా వ్యాక్యానించారు. ఏపీలో శాంతిభద్రతలు అధ్వాన్నంగా ఉన్నాయనడానికి వైఎస్ జగన్‌పై దాడే నిదర్శనమన్నారు.
వైఎస్ జగన్‌పై దాడి విషయంలో టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. వాస్తవాలు కప్పిపుచ్చి కేసుని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దాడిపై మంత్రులు వీధి రౌడీల్లా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు, ఢిల్లీ పర్యటనల వల్ల రాష్ట్రానికి ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు ఢిల్లీ వెళ్లి హడావిడి చేశారని దుయ్యబట్టారు.
స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలను వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు మతిస్థిమితం సక్రమంగా లేదని అనుమానం వస్తోందన్నారు. మొన్నటి దాకా ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెబుతూ వచ్చారు..ఇప్పుడేమో మోదీని దించేస్తానని బాబు ప్రగల్భాలు పలుకుతున్నారని వ్యాక్యానించారు. రిమాండ్ రిపోర్టులో హత్యాయత్నం చేశారని స్పష్టంగా ఉందని వెల్లడించారు. దాడి వెనక టీడీపీ నేతల హస్తం ఉందని స్పష్టమవుతోందని వ్యాఖ్యానించారు. డీజీపీ చెప్పిన మాటలకు, సీఎం మాటలకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టంగా చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ అంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.
బీజేపీతో కలిసి ఉన్నపుడు ఎక్కువ నిధులు వచ్చాయని ప్రచారం చేశారు.. ఇప్పుడు ఢిల్లీ వెళ్లి కేంద్రంపై పోరాటం అంటున్నారని బాబుపై మండిపడ్డారు. జగన్‌పై హత్యాయత్నంలో కేశినేని వ్యాఖ్యలు చూస్తుంటే ఆటవిక సమాజంలో ఉన్నామని అనిపిస్తోందని అన్నారు. ఎప్పుడు పడుకుంటారో తెలియని మంత్రులు కూడా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని తీవ్రంగా విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment