
సాక్షి, అనంతపురం : జేసీ బ్రదర్స్ ఒత్తిడితోనే తన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారని తాడిపత్రి వైఎస్సార్ సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను రైతుల కోసం పాదయాత్ర చేస్తే జేసీ బ్రదర్స్‌కి ఎందుకింత ఉలికిపాటు అని విమర్శించారు. జేసీ దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డిలకు ఓటమి భయం పట్టుకుందని పెద్దారెడ్డి అన్నారు. జేసీ దివాకర్ రెడ్డికి దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో తాడిపత్రి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు.
పోలీసులు జేపీ బ్రదర్స్ తొత్తులుగా మారారని పెద్దారెడ్డి మండిపడ్డారు. తాడిపత్రి పోలీసులకి ఎస్పీ ఆదేశాలకన్నా జేసీ బద్రర్స్ ఆశీస్సులే ముఖ్యమని విమర్శించారు. ప్రబోదానందస్వామి ఆశ్రమంపై జేసీ దివాకర్ రెడ్డి దగ్గరుండి మరీ దాడులు చేయించారని ఆరోపించారు. జేసీ దివాకర్‌పై కేసు నమోదు చేయాలంటే పోలీసులు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ముచ్చుకోట రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేయడంలో టీడీపీ విఫలమయిందని దుయ్యబట్టారు. జేసీ బ్రదర్స్‌ని ఓడించేందుకు ప్రజలు సిద్ధమయ్యారని పెద్దారెడ్డి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment