వైఎస్సార్ సీపీ కార్యకర్తపై పోలీసుల దౌర్జన్యం
సాక్షి, అనంతపురం: తాడిపత్రి నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్ పాదయాత్ర 3000 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా సంఘీభావంగా, ముచ్చుకోట రిజర్వాయర్‌కు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి చేపట్టిన పాదయాత్ర పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించి, ఆయనను అరెస్ట్ చేశారు.
పెద్దారెడ్డి పాదయాత్రను భగ్నం చేయడానికి ఈ తెల్లవారుజాము నుంచే ముచ్చుకోట గ్రామంలో భారీగా పోలీసు బలగాలు మొహరించారు. తాడిపత్రి నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు రమేష్ రెడ్డి, పైలానరసింహయ్యలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ముచ్చుకోట నుంచి పెద్దపప్పూరు దాకా పాదయాత్ర చేసేందుకు వచ్చిన పెద్దారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీడీపీ సర్కారు చర్యలను పెద్దారెడ్డి తీవ్రంగా నిరసించారు. శాంతియుతంగా పాదయాత్ర చేసేందుకు వచ్చిన తనను అరెస్ట్ చేయడం సరికాదన్నారు.
ముచ్చుకోట సమీపంలో పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment