
హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో కుట్రను దర్యాప్తు సంస్థ ఎక్కడా బహిర్గతం చేయలేదని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు పొన్నవోలు సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సుధాకర్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో శ్రీనివాస్ ఎవరి సహాయంతో లోపలికి కత్తి తెచ్చాడని ప్రశ్నించారు. ఈ హత్యాయత్నం వెనక ఉన్న సూత్రధారులు ఎవరు అంటే ప్రభుత్వ పెద్దలేనని అర్ధమవుతోందని వ్యాఖ్యానించారు. కేసులో కీలక నిందితుడు హర్షవర్ధన్ చౌదరీకి చెందిన ఫ్యూజన్ రెస్టారెంట్‌ను నారా లోకేషే ప్రారంభించారని గుర్తు చేశారు.
హత్యాయత్నం జరిగిన 4 గంటల తర్వాత ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ అయిందని తెలిపారు. ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టకముందే డీజీపీ, మంత్రులు, చంద్రబాబు స్పందించారంటే ముమ్మాటికీ కుట్రే జరిగిందని స్పష్టమవుతోందన్నారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ అయితే ముందే డీజీపీ ఎలా మాట్లాడారని ప్రశ్నించారు. హత్యాయత్నం గురించి ముందు నిర్ణయించుకున్న ప్రకారం రియాక్ట్ అయ్యారని తెలిపారు. పోలీసుల వైఖరిపై తాము చార్జిషీట్ రిలీజ్ చేస్తున్నామని వెల్లడించారు. శ్రీనివాస్ వైఎస్సార్‌సీపీ కార్యకర్త అయితే జగన్, వైఎస్సార్ గురించి ఎందుకు రాస్తాడని అనుమానం లేవనెత్తారు. శ్రీనివాజ్ జేబులో లెటర్ ఉంది అని విచారణ జరగక ముందే డీజీపీ ఎలా చెప్పగలిగారని సందేహం వ్యక్తం చేశారు.
హత్యాయత్నం కేసులో గాయం లేకపోయినా హత్యాయత్నమే అవుతుందని వ్యాఖ్యానించారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో కీలక నిందితుడు శ్రీనివాస్‌ని అంతమొందించే కుట్ర జరుగుతోందని, నిందితుడికి ఏమైనా జరిగితే చంద్రబాబు నాయుడిదే బాధ్యతని అన్నారు. అసలు కుట్రదారుల్ని బయటికి రాకుండా చేస్తున్న ప్రయత్నమే టీడీపీ చేస్తున్న దుష్ప్రచారమని అన్నారు. తాము విడుదల చేస్తున్న ఛార్జ్‌షీట్ కాదనే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని సవాల్ విసిరారు. తాము అధికారంలోకి రాగానే కేసును రీఇన్వెస్టిగేషన్ చేయిస్తామని, పాత్రధారులు, సూత్రధారులని శిక్షిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment